భారీ నష్టాల్లో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు..
ABN , Publish Date - Mar 27 , 2026 | 09:53 AM
గత రెండు రోజులుగా లాభాల్లో పయనించిన భారతీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల పెరుగుదల ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.
ఆంధ్రజ్యోతి, మార్చి 27: గత రెండు రోజులుగా లాభాల్లో పయనించిన భారతీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల పెరుగుదల ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఇవాళ ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే బిఎస్‌ఈ సెన్సెక్స్ 850 పాయింట్లకు పైగా పతనమై 74,400 స్థాయికి చేరుకుంది. నిఫ్టీ సైతం 225 పాయింట్లు నష్టపోయి, కీలకమైన 23,100 మార్కు కంటే దిగువకు పడిపోయింది. మార్కెట్లు ఓపెన్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఇన్వెస్టర్ల సంపద సుమారు 4 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయింది.
ఇరాన్ తన 82వ విడత దాడులను ప్రారంభించడం, హైఫా పోర్ట్ లక్ష్యంగా డ్రోన్ దాడులు జరగడం మార్కెట్లలో ఆందోళన కలిగించింది. డొనాల్డ్ ట్రంప్ 10 రోజుల గడువు ఇచ్చినా, క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు తగ్గకపోవడం ప్రతికూలంగా మారింది. మరోవైపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ చరిత్రలో మొదటిసారి 94 మార్కును దాటి (94.16) రికార్డు కనిష్టానికి పడిపోయింది. ఇది దిగుమతుల భారాన్ని పెంచుతుందనే భయం మార్కెట్లను కలవరపెడుతోంది.
ఇక, బ్రెంట్ క్రూడ్ ధరలు మళ్లీ 110 డాలర్ల వైపు దూసుకుపోతున్నాయి. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ మూసివేత భయాలు చమురు ధరలను ప్రభావితం చేస్తున్నాయి. ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (FIIs) మార్చి నెలలో ఇప్పటివరకు దాదాపు 1.21 లక్షల కోట్ల రూపాయల విలువైన షేర్లను విక్రయించారు. ఈ నిరంతర అమ్మకాలు మార్కెట్‌పై ఒత్తిడి పెంచుతున్నాయి. నిన్న అమెరికా మార్కెట్లు (NASDAQ, S&P 500) భారీగా నష్టపోవడంతో, ఆ ప్రభావం ఆసియా మార్కెట్లపై, ముఖ్యంగా భారత్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. నేటి ట్రేడింగ్‌లో బ్యాంకింగ్, ఐటీ, ఆటో రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. ముఖ్యంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
ఇవి కూడా చదవండి:
ప్రీతి జింటా నాకు సారీ చెప్పింది: ఆర్సీబీ ప్లేయర్
PL 2026 : రెండో దశ షెడ్యూల్ వచ్చేసింది..