Share News

సులభంగా రిఫండ్‌ ప్రక్రియ..

ABN , Publish Date - Oct 25 , 2026 | 06:19 AM

జీఎ్‌సటీ కౌన్సిల్‌ సమావేశం ఇటీవల తీసుకున్న పలు ముఖ్య నిర్ణయాల గురించి ఇప్పటికే తెలుసుకున్నాం. మరికొన్ని విషయాలు మీకోసం..

సులభంగా రిఫండ్‌ ప్రక్రియ..

జీఎ్‌సటీ కౌన్సిల్‌ సమావేశం ఇటీవల తీసుకున్న పలు ముఖ్య నిర్ణయాల గురించి ఇప్పటికే తెలుసుకున్నాం. మరికొన్ని విషయాలు మీకోసం..

ఎగమతిదారులకు.. ఇన్వర్టెడ్‌ డ్యూటీ (ముడి సరుకు మీద ఎక్కువ పన్ను, తయారైన వస్తువు మీద తక్కువ పన్ను ఉంటే వ్యాపారాలు)లో ఉన్న వారికి రిఫండ్‌ ప్రక్రియ సులభతరం చేశారు. ఇప్పటి వరకు ఉన్న విధానం ప్రకా రం.. రిఫండ్‌ దరఖాస్తు అందినట్లుగానీ, అందులో లోపాలు ఉన్నట్లు గానీ తెలియజేయటానికి ఇప్పటి వరకు 15 రోజుల గడువు ఉండగా దాన్ని 10 రోజులకు తగ్గించారు. ఆలోపు అధికారి స్పందించకపోతే దరఖాస్తు అందినట్లే భావిస్తారు. ఎగుమతులు, ఇన్వర్టెడ్‌ డ్యూటీ రిఫండ్స్‌లో సిస్టమ్‌ రిస్క్‌ పరిశీలన జరిపి, 90 శాతం మొత్తాన్ని అధికారి ప్రమేయం లేకుండా తాత్కాలికంగా మంజూరు చేయాలని ప్రతిపాదించారు. ఇక ముడి సరుకు మీద ఎక్కువ పన్ను, తయారైన వస్తువు మీద తక్కువ పన్ను ఉన్నప్పుడు.. అంటే ఇన్వర్టెడ్‌ డ్యూటీ ఉన్నప్పుడు, మిగిలిపోయిన ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ)ని రిఫండ్‌గా తీసుకునే సందర్భంలో కేవలం ముడి సరుకు మీద అంటే ఇన్‌పుట్స్‌ మీద చెల్లించిన పన్నును మాత్రమే పరిగణనలోకి తీసుకునే వారు. ఫ్యాక్టరీ లేదా ఆఫీస్‌ అద్దె, సరుకు రవాణా, జాబ్‌ వర్క్‌, సెక్యూరిటీ, కన్సల్టెన్సీ, మార్కెటింగ్‌, పబ్లిసిటీ లాంటి సేవల మీద వ్యాపారి 18 శాతం పన్ను చెల్లించినప్పటికీ, ఆ క్రెడిట్‌ను రిఫండ్‌ లెక్కలోకి తీసుకోకపోవటంతో రిఫండ్‌ తక్కువ వచ్చేది. వ్యాపార వర్గాలు దీనికి సంబంధించి చాలా కాలంగా వినతులు చేస్తూ వస్తున్నాయి. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమే అని సుప్రీంకోర్టు కూడా గతంలో అభిప్రాయపడింది. ఇప్పుడు కొత్త నిర్ణయం ప్రకారం ఇన్‌పుట్‌ సర్వీ్‌సలను కూడా రిఫండ్‌ ప్రక్రియలో భాగం చేయనున్నారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయాలు రెండు ఉన్నాయి.

మొదటిది.. ఈ సదుపాయం ఈ ఏడాది నవంబరు 1 నుంచి తీసుకునే సేవల క్రెడిట్‌కు మాత్రమే వర్తిస్తుంది. అంతకుముందు తీసుకున్న క్రెడిట్‌ను ఈ పద్ధతిలో రిఫండ్‌ కోరలేరు. రెండోది.. అసలు ఇన్వర్టెడ్‌ డ్యూటీ ఉందా లేదా అనేది మాత్రం ఇప్పటి లాగానే ముడి సరుకు పన్ను రేటును, అమ్మే వస్తువు పన్ను రేటును పోల్చి నిర్ణయిస్తారు. అంటే ముడి సరుకు మీద తక్కువ పన్ను ఉండి, కేవలం సేవల మీద ఎక్కువ పన్ను ఉన్నంత మాత్రాన ఇన్వర్టెడ్‌ డ్యూటీ కిందకు రాదు. అలాగే యంత్రాల వంటి క్యాపిటల్‌ గూడ్స్‌ విషయానికి వస్తే.. ఎగుమతిదారులకు గానీ, ఇన్వర్టెడ్‌ డ్యూటీ ఉన్న వారికి గానీ వాటి మీద చెల్లించిన పన్నుకు ఇప్పటి వరకు రిఫండ్‌ అవకాశం లేదు. కొత్తగా ఉత్పత్తి యూనిట్‌ పెట్టే వారికి, ఉన్న యూనిట్‌ను విస్తరించే వారికి ఇది పెద్ద భారం. ఇకపై 2027 ఏప్రిల్‌ 1 నుంచి తీసుకునే క్యాపిటల్‌ గూడ్స్‌ క్రెడిట్‌కు కూడా రిఫండ్‌ లభిస్తుంది. జీఎ్‌సటీ చట్టం ప్రకారం ఏదేనీ ఒక యంత్రం మీద అంటే క్యాపిటల్‌ గూడ్స్‌ మీద క్రెడిట్‌ తీసుకుంటే దాని కాలపరిమితి 60 నెలలుగా లెక్కిస్తారు. కాబట్టి ఒకేసారి కాకుండా ఆ క్రెడిట్‌లో 60వ వంతు భాగాన్ని ప్రతి నెల రిఫండ్‌ కోసం పరిగణనలోకి తీసుకోవచ్చు.


క్రెడిట్‌ మీద ఆంక్షల సడలింపు

కొన్ని రకాల ఖర్చుల మీద చెల్లించిన పన్నును ఐటీసీగా తీసుకోవటానికి ఇప్పటి వరకు వీలు లేదు. ఇందులో కొన్నిటిని తొలగించాలని కౌన్సిల్‌ సూచించింది. ఉద్యోగులకు కల్పించే ఆరోగ్య, జీవిత బీమా, ఔట్‌ డోర్‌ కేటరింగ్‌, టెలికాం టవర్లు, ఫ్యాక్టరీ ఆవరణ బయట వేసే పైప్‌లైన్లు, ఉచితంగా ఇచ్చే శాంపిల్స్‌, చట్ట ప్రకారం గడువు తీరిన తర్వాత నాశనం చేయాల్సిన సరుకు.. వీటన్నిటి మీద ఇకపై క్రెడిట్‌ తీసుకోవచ్చు. ఉదాహరణకు ఒక ఫార్మా కంపెనీ గడువు తీరిన ఔషధాలను నిబంధనల ప్రకారం నాశనం చేసినప్పుడు, వాటి తయారీకి తీసుకున్న క్రెడిట్‌ను ఇప్పటి వరకు వెనక్కు చెల్లించాల్సి వచ్చేది. అలాగే ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు, ఫార్మా సంస్థలు ప్రచారం కోసం ఉచితంగా ఇచ్చే శాంపిల్స్‌కు కూడా ఇదే పరిస్థితి. ఇకపై ఈ భారం ఉండదు. అలాగే రెస్టారెంట్లు, ఔట్‌డోర్‌ కేటరింగ్‌, రోజుకు రూ.7,500 లోపు అద్దె ఉండే హోటల్‌ గదులు, జిమ్‌ సేవలందించే వారు ఇప్పటి వరకు 5 శాతం పన్ను చెల్లిస్తూ ఎలాంటి క్రెడిట్‌ తీసుకోలేక పోయేవారు. ఇకపై వీరు అదే రకమైన సేవను ఇతరుల నుంచి తీసుకున్నప్పుడు.. ఉదాహరణకు ఒక హోటల్‌ తన అతిథుల కోసం మరో హోటల్‌లో గదులు తీసుకున్నప్పుడు, దాని మీద చెల్లించిన పన్నుకు క్రెడిట్‌ తీసుకోవచ్చు. ఇకపోతే సరఫరాదారు పన్ను చెల్లించకపోవటంతో నిజాయితీగా కొనుగోలు చేసిన వ్యాపారి క్రెడిట్‌ను కోల్పోతున్నాడనే ఫిర్యాదు చాలా కాలంగా ఉంది. సరుకు అందుకుని, సరైన ఇన్వాయిస్‌ ఉండి, సరఫరాదారుకు పూర్తి డబ్బు చెల్లించిన కొనుగోలుదారును ఎలా కాపాడాలనే దాని మీద అధికారుల కమిటీ ఒకటి అధ్యయనం చేసి మూడు నెలల లోపు నివేదిక ఇవ్వనుంది.

రాంబాబు

గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.

ఈ వార్తలనూ చదవండి:

పల్లె పండుగకు నిధుల గండం

ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Updated Date - Oct 25 , 2026 | 06:19 AM