Share News

జీఎస్‌టీలో ఇక అరెస్టులుండవా..!

ABN , Publish Date - Oct 11 , 2026 | 05:58 AM

జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం అంటే సాధారణంగా అందరి దృష్టి పన్ను రేట్ల మీదే ఉంటుంది. అయితే ఈ నెల 8న జరిగిన 57వ జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం మాత్రం...

జీఎస్‌టీలో ఇక అరెస్టులుండవా..!

జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం అంటే సాధారణంగా అందరి దృష్టి పన్ను రేట్ల మీదే ఉంటుంది. అయితే ఈ నెల 8న జరిగిన 57వ జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది. గత ఏడాది పన్ను రేట్లను సరళీకరించి ప్రధానంగా రెండు శ్లాబులకు పరిమితం చేసిన తర్వాత.. ఈసారి రేట్ల జోలికి వెళ్లకుండా పన్ను చెల్లింపుదారులు తరచుగా ఎదుర్కొనే ఇబ్బందుల మీద దృష్టి పెట్టింది. రిజిస్ట్రేషన్‌, రిఫండ్‌, నోటీసులు, జరిమానాలు, సరుకు రవాణాలో తనిఖీలు.. ఇలా దాదాపు ప్రతి దశలో మార్పులు సూచించింది. అందులో ముఖ్యమైనవి..

అన్నిటికి కాదు..

జీఎస్‌టీ చట్టంలో అధికారులకు ఉన్న అరెస్ట్‌ అధికారాన్ని పూర్తిగా తొలగించాలని కౌన్సిల్‌ సిఫారసు చేసింది. చట్టం అనేది పన్ను చెల్లింపుదారుల మీద నమ్మకం ఆధారంగా ఉండాలని కౌన్సిల్‌ భావించటమే ఈ నిర్ణయానికి కారణం. అలాగే ప్రాసిక్యూషన్‌ కోర్టులో క్రిమినల్‌ కేసు దాఖలు చేయటానికి ఉన్న పరిమితిని రూ.కోటి నుంచి రూ.5 కోట్లకు పెంచారు. శిక్షలను కూడా తగ్గించారు. రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు పన్ను ఎగవేతలకు గరిష్ఠంగా రెండేళ్లు, రూ.10 కోట్లు మించితే గరిష్ఠంగా ఐదేళ్లు శిక్ష ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న 6 నెలల కనీస జైలు శిక్ష నిబంధనను తొలగించి, అవసరమైతే కేవలం జరిమానాతో సరిపెట్టే అధికారం కోర్టులకు ఇవ్వనున్నారు. నేరాల జాబితాను కూడా కుదించారు. అయితే, అసలు సరఫరాలు పొందకుండా లేదా ఇన్వాయిస్‌ లేకుండా మోసపూరితంగా క్రెడిట్‌ పొంద టం, మోసపూరితంగా రిఫండ్‌ తీసుకోవటం లాంటివి మాత్రం నేరాలుగానే కొనసాగుతాయు. ఈ మార్పులకు చట్ట సవరణ అవసరం కాబట్టి తుది రూపం వచ్చిన తర్వాత మరింత స్పష్టత వస్తుంది.

కొత్తగా రిజిస్ట్రేషన్‌ తీసుకునేందుకు..

కొత్తగా రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసే వారికి ఏ పత్రాలు జత చేయాలనే విషయంలో చాలా గందరగోళం ఉంటుంది. ఒక పత్రం సరిపోలేదని దరఖాస్తు తిరిగి రావటం, మళ్లీ దాఖలు చేయటం సర్వసాధారణం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏ పత్రాలు అవసరమో స్పష్టంగా తెలియజేస్తూ ప్రభుత్వం ఒక జాబితా విడుదల చేయనుంది. వ్యాపార స్థలం సొంతమా.. కిరాయిదా అనే దాన్ని బట్టి ఏ పత్రాలు కావాలో పోర్టల్‌లో కనిపిస్తాయి. ఆ జాబితాలో లేని పత్రాలను అధికారులు అదనంగా అడగటానికి వీలుండదు.


వివరాలు మారితే..

ఇకపోతే, రిజిస్ట్రేషన్‌ తీసుకున్న తర్వాత వివరాలు మారితే అంటే, ఫోన్‌ నంబర్‌, ఈ-మెయిల్‌, భాగస్వాములు, వ్యాపార సంస్థ పేరు, సంస్థ స్వరూపం (ఉదాహరణకు భాగస్వామ్య సంస్థ నుంచి కంపెనీగా మారటం), అదనపు వ్యాపార స్థలం చేర్చటం లాంటివి. సిస్టమ్‌ ద్వారానే ఆటోమేటిక్‌గా ఆమోదం లభిస్తుంది. కేవలం ‘ప్రధాన వ్యాపార స్థలం’ అంటే చిరునామా మార్పునకు మాత్రమే పరిశీలన ఉంటుంది. అది కూడా నిర్ణీత 15 రోజుల గడువు లోపు. తక్కువ రిస్‌్‌క ఉన్న చిన్న వ్యాపారులకు అయితే చిరునామా మార్పు కూడా ఆటోమేటిక్‌గా జరుగుతుంది.

రిజిస్ట్రేషన్‌ రద్దు చేసుకోవటం..

అలాగే వ్యాపారం మూసివేసినప్పుడు రిజిస్ట్రేషన్‌ రద్దు చేసుకోవటం కూడా చాలా మందికి ఒక పెద్ద ప్రహసనం. ఇకపై అన్ని రిటర్నులు దాఖలు చేసి, బకాయిలన్నీ చెల్లించి ఉంటే రద్దు దరఖాస్తు ఆటోమేటిక్‌గా ఆమోదం పొందుతుంది. మొదటి దశలో.. రిజిస్ట్రేషన్‌ పొందినప్పటి నుంచి ఏ నెలలో కూడా రూ.2.5 లక్షలకు మించి ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ)ను కొనుగోలుదారులకు బదిలీ చేయని చిన్న వ్యాపారులకు రద్దు దరఖాస్తు ఆటోమేటిక్‌గా ఆమోదం పొందుతుంది. ఒకవేళ అంతకు మించి ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ ఉన్నప్పటికీ ‘ఫైనల్‌ రిటర్న్‌’ సకాలంలో దాఖలు చేసిన వారికి ఈ సౌకర్యం వర్తిస్తుంది. రెండో దశలో అందరికీ వర్తింపజేస్తారు.

చిన్న వ్యాపారులకు సులభతర రిజిస్ట్రేషన్‌

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ-కామర్స్‌ పోర్టల్‌ ద్వారా అమ్మకాలు చేపట్టే చిన్న వ్యాపారులకు కూడా రిజిస్ట్రేషన్‌ సులభతరం చేశారు. ఉదాహరణకు గద్వాల్‌లో ఉన్న చిన్న వ్యాపారి ఒక ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా బెంగళూరు, చెన్నైల్లో చీరలు అమ్మాలనుకున్నాడనుకుందాం. ఈ ప్లాట్‌ఫామ్‌ గోదాములు ఆయా రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ, అక్కడ తాను స్వయంగా రిజిస్ట్రేషన్‌ తీసుకోవాలంటే ఆ రాష్ట్రంలో తనకంటూ ఒక చిరునామా ఉండాలి. ఇది చిన్న వ్యాపారులకు సాధ్యం కాని పని. ఇకపై సదరు ఆన్‌లైన్‌ సంస్థ గోదామునే తన వ్యాపార స్థలంగా చూపి ఆ రాష్ట్రంలో ఆటోమేటిక్‌గా రిజిస్ట్రేషన్‌ పొందవచ్చు. నెలకు రూ.2.5 లక్షల లోపు ఐటీసీ బదిలీ చేసే వారికి ఇది వర్తిస్తుంది.

రాంబాబు గొండాల

గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.

ఇవి కూడా చదవండి..

భుజ్ భూకంపం.. నరేంద్ర మోదీ రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిన విపత్తు..

ఈ రోజు ఫోన్, టీవీ చూడొద్దని ముందే చెప్పాడు: అభిజిత్ దీప్కే తల్లి

Updated Date - Oct 11 , 2026 | 05:58 AM