9 ఏళ్లపాటు వచ్చినవి.. రెండేళ్లలో వెనక్కి పోయె..
ABN , Publish Date - Oct 25 , 2026 | 06:24 AM
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎ్‌ఫఐఐ) తిరుగుబాట పట్టారు. మన స్టాక్ మార్కెట్లోని పెట్టుబడులను వేగంగా బయటికి తరలిస్తున్నారు. 9 ఏళ్ల పాటు పెట్టిన...
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల తిరుగు బాట
11 ఏళ్లలో పెట్టుబడులు నికరంగా సున్నా
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎ్‌ఫఐఐ) తిరుగుబాట పట్టారు. మన స్టాక్ మార్కెట్లోని పెట్టుబడులను వేగంగా బయటికి తరలిస్తున్నారు. 9 ఏళ్ల పాటు పెట్టిన పెట్టుబడులను గడిచిన రెండేళ్లలో వెనక్కి తీసుకున్నారు. దాంతో గత 11 ఏళ్ల కాలానికి విదేశీ పెట్టుబడులు సున్నాకు పడిపోయాయి. 2015 అక్టోబరు నుంచి 2024 సెప్టెంబరు వరకు భారత ఈక్విటీ మార్కెట్లో 6,350 కోట్ల డాలర్ల (రూ.6.03 లక్షల కోట్ల పైమాటే) మేర ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌ఐఐలు.. 2024 అక్టోబరు నుంచి ఇప్పటివరకు దాదాపు 6,360 కోట్ల డాలర్ల (రూ.6.04 లక్షల కోట్లు) సొమ్మును బయటి మార్కెట్లకు తరలించేశారు.
ఈ ఏడాదిలో 3.12 లక్షల కోట్లు వెనక్కి
గత ఏడాది నికరంగా రూ.1.66 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న ఎఫ్‌ఐఐలు.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు (అక్టోబరు 23 నాటికి) దాదాపు రూ.3.12 లక్షల కోట్లను బయటికి తరలించేశారు. గత ఏడాదితో పోలిస్తే 2026లో 9 నెలల 23 రోజుల్లోనే దాదాపు రెండింతల పెట్టుబడులను మన దేశం దాటించేశారు. ఈ నెలలోనే దాదాపు రూ.52,000 కోట్లు ఉపసంహరించుకున్నారు. ఎఫ్‌ఐఐలు అమ్మకాలు పోటెత్తిస్తున్నప్పటికీ, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల (డీఐఐ) భారీ కొనుగోళ్లు మన మార్కెట్‌కు అండగా నిలుస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు డీఐఐలు నికరంగా రూ.5 లక్షల కోట్లకు పైగా విలువైన షేర్లను కొనుగోలు చేశారు.
కారణాలు..
యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుతో పాటు ఆ దేశ అప్పులు రికార్డు స్థాయిలో 40 లక్షల కోట్ల డాలర్లకు చేరుకోవడంతో అక్కడి బాండ్ల రేట్లు భారీగా పెరిగాయి. దాంతో ఎఫ్‌ఐఐలు భారత్ సహా ఇతర వర్ధమాన దేశాల ఈక్విటీ మార్కెట్లలోని పెట్టుబడులను అమెరికన్ బాండ్లలోకి తరలిస్తున్నారు.
అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల ఈక్విటీ మార్కెట్లు అధిక రిటర్నులు పంచుతుండటం.. వేగంగా పుంజుకుంటున్న ఏఐ, సెమీకండక్టర్ సహా ఇతర టెక్నాలజీ రంగ షేర్లలో పెట్టుబడుల కోసం ఎఫ్‌ఐఐలు భారత మార్కెట్లోని సొమ్మును వెనక్కి తీసుకుంటున్నారు.
మన మార్కెట్లో అధిక వ్యాల్యుయేషన్ల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు ఇక్కడి సొమ్మును ఆకర్షణీయ రిటర్నులు పంచుతున్న తైవాన్, దక్షిణ కొరియా వంటి వర్ధమాన దేశాల మార్కెట్లకు తరలించడం.
చమురు ధరలు, వడ్డీ రేట్ల పెరుగుదల, ఎల్‌నినో ప్రభావంతో భారత కంపెనీల పనితీరుతో పాటు దేశీయ ఆర్థిక వృద్ధి మందగించవచ్చన్న భయాలు, రూపాయి క్షీణత కూడా ఎఫ్‌ఐఐల అమ్మకాలకు కొంత వరకు కారణమవుతున్నాయి.
పెట్టుబడులు తిరిగి రావా..?
ప్రస్తుత పెట్టుబడుల ఉపసంహరణ ఆధారంగా ఎఫ్‌ఐఐలు మన మార్కెట్‌పై పూర్తిగా నమ్మకం కోల్పోయినట్లుగా భావించవద్దని ఈక్విటీ విశ్లేషకులు అంటున్నారు. అంతర్జాతీయంగా ఈక్విటీ, బాండ్ మార్కెట్లలో మారుతున్న పరిస్థితులు, రిటర్నుల రేటు ఆధారంగా ఎఫ్‌ఐఐలు తమ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోను సర్దుబాటు చేసుకుంటున్నారని వారంటున్నారు. ఆకర్షణీయ ప్రతిఫలాలు పంచగలిగితే ఎఫ్‌ఐఐలు తిరిగి భారత మార్కెట్ బాట పడతారని అన్నారు. పశ్చిమాసియాలో పరిస్థితులు, చమురు ధరలు, అమెరికా సహా అభివృద్ధి చెందిన దేశాల్లో వడ్డీ రేట్లతోపాటు దేశీయంగా ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి, కార్పొరేట్ కంపెనీల పనితీరు వంటి అంశాలు విదేశీ సంస్థాగత పెట్టుబడుల ట్రెండ్‌ను ప్రభావితం చేయనున్నాయని వారన్నారు.
విదేశీ పెట్టుబడులు ఎందుకంత ముఖ్యం..?
విదేశీ సంస్థాగత పెట్టుబడులు మన దేశ ఈక్విటీ మార్కెట్‌తో పాటు కరెన్సీ పుంజుకునేందుకు దోహదపడతాయి. అలాగే, అంతర్జాతీయంగా మన మార్కెట్‌పై విశ్వాసాన్నీ పెంచుతాయి. అందుకే ఎఫ్‌ఐఐల పెట్టుబడులను హాట్ మనీగా పిలుస్తారు.
ఎఫ్‌ఐఐ
ఆయా దేశాల ఈక్విటీ, బాండ్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే విదేశీ మ్యూచువల్ ఫండ్, బీమా సంస్థలు, పెన్షన్ ఫండ్లు, హెడ్జ్ ఫండ్లే ఎఫ్‌ఐఐలు.
డీఐఐ
మన ఈక్విటీ మార్కెట్లో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టే దేశీయ మ్యూచువల్ ఫండ్లు, బీమా సంస్థలు, పెన్షన్ ఫండ్లు డీఐఐల పరిధిలోకి వస్తాయి.
ఈ వార్తలనూ చదవండి:
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల