SBI: IMPS లావాదేవీలపై ఛార్జీలు పెంచిన ఎస్‌బీఐ.. ఫిబ్రవరి 15 నుంచి అమలు
ABN , Publish Date - Jan 16 , 2026 | 05:28 PM
దేశంలోని ప్రైవేట్ బ్యాంకులు ఐఎంపీఎస్ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేస్తున్నప్పటికీ.. దిగ్గజ ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.5లక్షల లోపు లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయడం లేదు. అయితే.. ఇప్పుడు రూ.25వేలు దాటితే ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది.
ఆంధ్రజ్యోతి, జనవరి 16: సంక్రాంతి పండుగ వేళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కస్టమర్లకు మరో షాక్ ఇచ్చింది. ఇటీవల ATM లావాదేవీలపై ఛార్జీలు పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు IMPS(Immediate Payment Service) ద్వారా చేసే ఆన్‌లైన్ నగదు బదిలీలపై కూడా పరిమితి దాటితే కొత్తగా సర్వీస్ ఛార్జీలు విధించాలని SBI నిర్ణయించింది.
బ్యాంక్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. 2026 ఫిబ్రవరి 15 నుంచి ఈ కొత్త IMPS ఛార్జీలు అమల్లోకి వస్తాయి. ఇప్పటివరకు ఆన్‌లైన్ IMPS ట్రాన్సాక్షన్లు రూ.5 లక్షల వరకు పూర్తిగా ఉచితంగా ఉండేవి. అయితే.. తాజా నిర్ణయంతో ఈ ఉచిత పరిమితిని రూ.25,000కి తగ్గించారు. అంటే ఇకపై రూ.25 వేలకుపైగా ఆన్‌లైన్ IMPS లావాదేవీలు చేస్తే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
సవరించిన SBI ఆన్‌లైన్ IMPS ఛార్జీలు ఇలా..
రూ.25,000 నుంచి రూ.1 లక్ష వరకు: రూ.2 + జీఎస్టీ
రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు: రూ.6 + జీఎస్టీ
రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు: రూ.10 + జీఎస్టీ
ఈ ఛార్జీలు ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా చేసే IMPS ట్రాన్సాక్షన్లకే వర్తిస్తాయి. బ్రాంచ్ ద్వారా చేసే IMPS లావాదేవీలపై ఇప్పటివరకు ఉన్న ఛార్జీల్లో మార్పులేదని బ్యాంక్ స్పష్టం చేసింది. అలాగే కొన్ని ప్రత్యేక శాలరీ అకౌంట్లు, పెన్షన్ ఖాతాలకు మినహాయింపులు కొనసాగనున్నాయి.
UPI లావాదేవీలు ఇప్పటికీ ఉచితంగానే కొనసాగుతున్న నేపథ్యంలో, అధిక మొత్తాల తక్షణ బదిలీల కోసం IMPS ఉపయోగించే కస్టమర్లపై ఈ నిర్ణయం అదనపు భారం పెంచనుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కాగా.. ప్రైవేట్ బ్యాంకులు ఇప్పటికే IMPS ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన HDFC Bank IMPS ప్రస్తుత ఛార్జీలు(Online Transfers) సాధారణంగా ఇలా ఉన్నాయి.
రూ.1,000 వరకు: రూ. 2.50 + GST
రూ.1,001 నుంచి రూ. 1,00,000 రూ. 5 + GST
రూ.1,00,000 కంటే ఎక్కువ రూ. 15 + GST
ప్రైవేట్ బ్యాంకుల్లో స్పెషల్, ప్రిఫర్డ్, ప్రీమియం ఖాతాదారులు కొన్నిసార్లు ఫ్రీ IMPS సేవలను పొందవచ్చు. యాక్సిస్ బ్యాంకు సహా చాలా ప్రైవేట్ బ్యాంకులు ఐఎంపీఎస్ లావాదేవీల విషయంలో ఇంచుమించుగా ఇంతే మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తున్నాయి.
ఇవీ చదవండి:
30 వాట్స్ లేదా 60 వాట్స్ చార్జర్.. బ్యాటరీ మన్నికకు ఏది బెటర్?
వైద్య కళాశాలల అవసరం భవిష్యత్తులో ఉండదు.. ఎలాన్ మస్క్ వ్యాఖ్య