వెర్స్ ఇన్నోవేషన్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా పీఆర్ రమేశ్ నియామకం
ABN , Publish Date - Mar 31 , 2026 | 07:49 PM
భారతదేశ ప్రముఖ ఏఐ బేస్‌డ్ లోకల్ లాంగ్వేజ్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్, డైలీహంట్, జోష్, మాగ్జటర్, నెక్స్‌వర్స్.ఏఐల మాతృసంస్థ వెర్స్ ఇన్నోవేషన్ స్వతంత్ర డైరెక్టర్‌గా పీఆర్.రమేశ్ నియమితులయ్యారు. ఈ మేరకు వెర్స్ ఇన్నోవేషన్ ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: వెర్స్ ఇన్నోవేషన్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా పీఆర్ రమేశ్ నియమితులయ్యారు. ఆయన ఆడిట్ కమిటీకి నేతృత్వం వహించడం సహా ఫైనాన్షియల్ రిపోర్టింగ్, ఇంటర్నల్ కంట్రోల్స్, రిస్క్ మేనేజ్మెంట్ వంటి విభాగాలను పర్యవేక్షించనున్నారు. ఈ మేరకు దేశీయ ప్రముఖ ఏఐ బేస్‌డ్ లోకల్ లాంగ్వేజ్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్, డైలీహంట్, జోష్, మాగ్జటర్, నెక్స్‌వర్స్.ఏఐల మాతృసంస్థ వెర్స్ ఇన్నోవేషన్ ప్రకటించింది.
చార్టర్డ్ అకౌంట్లో దశాబ్దాల అనుభవం కలిగిన రమేశ్.. డెలాయిట్ ఇండియా మాజీ ఛైర్మన్, డెలాయిట్ గ్లోబల్ బోర్డ్ మాజీ మెంబర్‌గా పనిచేశారు. ఫైనాన్షియల్, కార్పొరేట్ గవర్నెన్స్, రెగ్యులేటరీ సలహా బోర్డు నాయకత్వంలో ఆయనకు విశేష అనుభవం ఉంది. తన కెరీర్‌లో ప్రముఖ భారతీయ, బహుళజాతి సంస్థలకు గవర్నెన్స్, రిస్క్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రమాణాలు, రెగ్యులేటరీ కంప్లయన్స్‌పై సలహాలిచ్చారు. ఎయిర్ఇండియా, సిప్లా, నెస్లే ఇండియా, ఎ అండ్ టీ, క్రాంప్టన్ గ్రీవ్స్, ఐటీసీ హోటల్స్, సైయంట్, తేజస్ నెట్‌వర్క్స్, హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి పలు ప్రముఖ సంస్థల బోర్డుల్లోనూ విధులు నిర్వర్తించారు. 2022-23 సంవత్సరానికి గానూ ఆసియా సెంటర్ ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్ అండ్ సస్టైనబిలిటీ నుంచి 'బెస్ట్ ఇండిపెండెంట్ డైరెక్టర్' పురస్కారాన్ని కూడా పొందారు. సెబీ, ఆర్బీఐ, ఐఆర్డీఏఐ వంటి నియంత్రణ సంస్థల అడ్వైజరీ కమిటీల్లోనూ రమేశ్ సభ్యుడిగా ఉన్నారు. తద్వారా దేశ ఆర్థిక ప్రమాణాల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు.
ఈ సందర్భంగా.. వెర్స్ ఇన్నోవేషన్ సహ వ్యవస్థాపకుడు ఉమాంగ్ బేడి మాట్లాడారు. 'ఒక సంస్థ కాలపరీక్షను తట్టుకుని నిలబడాలంటే.. దానికి పటిష్ఠ పాలన, ఆర్థిక క్రమశిక్షణ, పాదర్శకత అవసరం. బోర్డు సారథ్యం, నియంత్రణ చట్రాలు, గ్లోబల్ ఆడిట్ నాయకత్వంలో పీఆర్.రమేశ్‌కు విశేష అనుభవముంది. ఆ అనుభవం మా పాలనా ప్రమాణాలను బలోపేతం చేయడం సహా వాటాదారుల విశ్వాసాన్ని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది' అని అన్నారు.
ఇక.. నూతన డైరెక్టర్ రమేశ్ మాట్లాడుతూ.. 'డిజిటల్ రంగంలో వెర్స్ అద్భుత స్థాయికి చేరుకుంది. దానికి తగినట్టుగానే పాలనా వ్యవస్థలు, ఆర్థిక నియంత్రణలు, రిస్క్ పర్యవేక్షణలూ వృద్ధికి అనుగుణంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. బలమైన సంస్థలు కేవలం ఆవిష్కరణలపైనే కాకుండా, క్రమశిక్షణ, జవాబుదారీతనంపై కూడా నిర్మితమవుతాయి. ఈ సూత్రాలను మరింత బలపరిచేందుకు నిరంతర, బాధ్యతాయుతమైన వృద్ధికి తోడ్పడే పాలనను రూపొందించడంలో సహాయపడటానికి బోర్డు, యాజమాన్య బృందంతో కలిసి పనిచేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను' అని చెప్పుకొచ్చారు.
ఈ సంస్థను 2007లో వీరేంద్ర గుప్తా ప్రారంభించారు. తొలుత ఇది మొబైల్ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ అందించేది. 2011లో న్యూస్‌హంట్ యాప్‌ను కొనుగోలు చేశారు వీరేంద్ర గుప్తా. ఆ తర్వాత ఇది వెర్స్ ఇన్నోవేషన్‌గా మారింది. ఫేస్‌బుక్ ఇండియా మాజీ ఎండీ ఉమాంగ్ బేడీ 2018లో వెర్స్ ఇన్నోవేషన్ సహ వ్యవస్థాపకులుగా చేరారు. అప్పటినుంచి టెక్నాలజీ, బిజినెస్ రంగంలో గణనీయమైన పురోగతి సాధించిందీ సంస్థ. డిజిటల్ అంతరాన్ని తగ్గించడంలో టెక్నాలజీ సాయపడుతుందనేదే వెర్స్ ఇన్నోవేషన్ ప్రధాన సూత్రం. సాంకేతికతను ఉపయోగించి లక్షలాది వినియోగదారుల తీరని కంటెంట్ అవసరాలను తీర్చే సవాలును స్వీకరించింది. దీని ప్రత్యేకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ సాంకేతికతలు, వినియోగ ప్రాధాన్యాల ఆధారంగా లక్షలాది మంది వినియోగదారులకు కంటెంట్‌ను అందించేందుకు దోహదపడుతున్నాయి.
ఇవీ చదవండి:
ఇండిగో కొత్త సీఈఓగా విలియమ్ వాల్ష్
మార్చి 31 డెడ్‌లైన్.. ఈ 3 పనులు వెంటనే పూర్తి చేయండి!