మార్చి 31 తుది గడువు.. ఈ 3 పనులు వెంటనే పూర్తి చేయండి!
ABN , Publish Date - Mar 31 , 2026 | 08:26 AM
ఆర్థిక సంవత్సరం 2025-26 ముగింపు దశకు వచ్చేసింది. 2026 మార్చి 31 నాటికి పన్ను చెల్లింపుదారులు, బ్యాంకు ఖాతాదారులు కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఇంటర్నెట్ డెస్క్: నేటితో మార్చి నెల ముగింపు దశకు చేరుకుంది. అలానే 2025-26 ఆర్థిక సంవత్సరం కూడా తుది దశకు చేరింది. ఈ నేపథ్యంలో మీరు బ్యాంకులు, డీమ్యాట్, పన్నులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. మార్చి31న అర్ధరాత్రి 12 గంటలలోపు మీరు ఈ పనులను పూర్తి చేయకపోతే, మీ అకౌంట్స్ పని చేయకపోవచ్చు లేదా మీరు భారీ జరిమానాను ఎదుర్కోవలసి రావచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరి.. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం..
బ్యాంక్, డీమ్యాట్ ఖాతాలలో నామినేషన్:
సెబీ, ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. ఇప్పుడు అన్ని బ్యాంక్ , డీమ్యాట్ అంకౌట్లకు నామినీని చేర్చడం తప్పనిసరి. మీరు ఇంకా నామినీని చేర్చకపోతే, మీ ఖాతా పనిచేయకపోవచ్చు. మీరు నెట్ బ్యాంకింగ్ లేదా మీ స్టాక్‌బ్రోకర్ యాప్‌ను ఉపయోగించి ఇంటి నుంచే ఇ-నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. నామినీ పేరు, వారితో మీకున్న రిలేషన్ గురించి పొందుపరుస్తే సరిపోతుంది.
కేవైసీ అప్‌డేట్, బ్యాంక్ ఖాతా యాక్టివేషన్:
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)తో సహా పలు బ్యాంకులు, తమ కస్టమర్లను వారి కేవైసీ వివరాలను అప్‌డేట్ చేసుకోమని ఇటీవల నోటిఫికేషన్లు జారీ చేశాయి. గత రెండేళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరగని ఖాతాలను పనిచేయనివిగా ప్రకటించారు. అలాంటి ఖాతాల వినియోగదారులకు ఏప్రిల్ 15 వరకు గడువు ఉంది. అయితే ఈకేవైసీ ప్రక్రియను మార్చి 31వ తేదీలోగా పూర్తి చేయడం సురక్షితం. మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీ తాజా ఫోటోతో మీ హోమ్ బ్రాంచ్‌ను సందర్శించి.. ఈ ప్రక్రియను పూర్తి చేయడం ఉత్తమం.
పన్ను ఆదా , పాన్-ఆధార్ అనుసంధానం:
ఆర్థిక సంవత్సరం చివరిలో పన్ను ఆదా చేసుకోవడానికి ఇది మీకు చివరి అవకాశం. రూ. 1.5 లక్షల వరకు మినహాయింపు పొందడానికి మార్చి 31 లోపు పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్ లేదా జీవిత బీమాలో పెట్టుబడి పెట్టండి. ఒకవేళ మీ పాన్ కార్డ్ ఇంకా ఆధార్‌తో అనుసంధానం కాకపోతే, అది ఇన్ యాక్టివ్ గా మారి ఉండవచ్చు. వెంటనే దానిని తిరిగి అనుసంధానం చేసే ప్రక్రియను ప్రారంభించండి. అలా చేయని పక్షంలో రూ. 1,000 జరిమానా విధించబడుతుంది. అదేవిధంగా మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయలేరు.
ఇవి కూడా చదవండి:
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
ముంచేసిన మార్చి..రూ.51 లక్షల కోట్లు ఫట్