Share News

ముంచేసిన మార్చి..రూ.51 లక్షల కోట్లు ఫట్‌

ABN , Publish Date - Mar 31 , 2026 | 01:39 AM

పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావంతో భారత స్టాక్‌ మార్కెట్‌ ఈ నెలలో భారీ పతనాన్ని చవిచూసింది. గడిచిన నెల రోజుల్లో బీఎస్ఈ సెన్సెక్స్‌ 9,340 పాయింట్లు .....

ముంచేసిన మార్చి..రూ.51 లక్షల కోట్లు ఫట్‌

  • పశ్చిమాసియా యుద్ధంతో స్టాక్‌ మార్కెట్‌ కోల్పోయిన సంపద ఇది..

  • ఒక్క రోజులో రూ.10 లక్షల కోట్లు ఆవిరి

  • సెన్సెక్స్‌ మరో 1,636 పాయింట్లు పతనం. 72,000 దిగువకు

  • 22,400 స్థాయికి నిఫ్టీ.. ఈ నెలలో 11 శాతం పైగా క్షీణించిన సూచీలు

ముంబై: పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావంతో భారత స్టాక్‌ మార్కెట్‌ ఈ నెలలో భారీ పతనాన్ని చవిచూసింది. గడిచిన నెల రోజుల్లో బీఎస్ఈ సెన్సెక్స్‌ 9,340 పాయింట్లు (11.5 శాతం), నిఫ్టీ 2,850 పాయింట్లు (11.3 శాతం) క్షీణించాయి. ఈక్విటీ వర్గాల సంపదగా భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ దాదాపు రూ.51 లక్షల కోట్లు తగ్గి రూ.412.41 లక్షల కోట్లకు (4.36 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది. పశ్చిమాసియా యుద్ధ జ్వాలల్లో ముడి చమురు భగ్గుమంటోంది. ఆ ప్రభావంతో రూపాయి భారీగా క్షీణించింది. మరోవైపు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెద్దఎత్తున పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారు. దాంతో ఈక్విటీ మార్కెట్లు వరుసగా ఐదు వారాలుగా నష్టాల్లో పయనిస్తున్నాయి. 2025 ఆగస్టు తర్వాత మార్కెట్లకు ఇదే సుదీర్ఘ నష్టకాలం.

2 రోజుల్లో రూ.18.60 లక్షల కోట్ల నష్టం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరాని (2025-26)కి ప్రామాణిక సూచీలు భారీ నష్టాలతో ముగింపు పలికాయి. 2025-26 చివరి ట్రేడింగ్‌ సెషన్‌ అయిన సోమవారం సెన్సెక్స్‌ మరో 1,635.67 పాయింట్లు (2.22 శాతం) క్షీణించి 71,947.55 వద్దకు జారుకుంది. ఒక దశలో సూచీ 1,809.09 పాయింట్ల నష్టంతో 71,774.13 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 488.20 పాయింట్లు (2.14 శాతం) తగ్గి 22,331.40 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈలోని మిడ్‌క్యాప్‌ సెలెక్ట్‌ సూచీ 3.13 శాతం, స్మాల్‌క్యాప్‌ సెలెక్ట్‌ ఇండెక్స్‌ 2.14 శాతం తగ్గాయి. రంగాలవారీ సూచీలన్నీ నేలచూపులు చూశాయి. దాంతో బీఎస్ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఒక్క రోజే రూ.9.74 లక్షల కోట్ల మేర తరిగిపోయింది. గడిచిన రెండు ట్రేడింగ్‌ సెషన్లలో రూ.18.60 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది.

2025-26లో సెన్సెక్స్‌ 7 శాతం డౌన్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) ఇన్వెస్టర్లకు నష్టాలనే మిగిల్చింది. గడిచిన ఏడాది కాలంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 5,467 పాయింట్లు (7 శాతం) క్షీణించగా.. నిఫ్టీ 1,188 పాయింట్లు (దాదాపు 5 శాతం) పతనమైంది. మార్కెట్‌ సంపద రూ.46,000 కోట్లకు పైగా తగ్గింది.

నేడు మార్కెట్లకు సెలవు: మహావీర్‌ జయంతి సందర్భంగా మంగళవారం.. స్టాక్‌ ఎక్స్ఛేంజీలు బీఎస్ఈ, ఎన్‌ఎస్ఈలకు సెలవు. బుధవారం మార్కెట్లు యధావిధిగా పనిచేస్తాయి.

Updated Date - Mar 31 , 2026 | 01:39 AM