ఇండిగో కొత్త సీఈఓగా విలియమ్ వాల్ష్
ABN , Publish Date - Mar 31 , 2026 | 06:21 PM
ఇండిగో సంస్థ నూతన సీఈఓగా వైమానిక రంగ నిపుణులు విలియమ్ వాల్ష్ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని సంస్థ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ కొత్త సీఈఓగా విలియమ్ వాల్ష్‌ను ఎంపిక చేసినట్టు సంస్థ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్ సీఈఓగా ఉన్న విలియమ్ వాల్ష్ పదవీకాలం ఈ ఏడాది జులై 31న ముగుస్తుంది. ఆగస్టు 3న ఆయన ఇండిగో సీఈఓ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సంస్థ పేర్కొంది (Indigo CEO-William Walsh)
విలియమ్ వాల్ష్ గతంలో బ్రిటిష్ ఎయిర్‌వేస్, ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ గ్రూప్ సీఈఓగా పని చేశారు. ఇండిగో సీఈఓ బాధ్యతలు దక్కడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇండిగో పునాదులు బలమైనవని అన్నారు. ఏవియేషన్ రంగం కీలక మార్పులకు లోనవుతోందని, ఈ రంగంలో అగ్రగామిగా నిలిచేందుకు ఇండిగోకు అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పారు. సంస్థ సిబ్బందితో కలిసి పనిచేసేందుకు తాను ఉత్సుకతతో ఉన్నానని తెలిపారు.
ఇండిగో సీఈఓగా విలియమ్ వాల్ష్ ఎంపిక కావడంపై సంస్థ చైర్మన్ విక్రమ్ సింగ్ మెహతా హర్షం వ్యక్తం చేశారు. వైమానిక రంగంలో ఆయన నాయకత్వ లక్షణాలు, ట్రాక్ రికార్డు అద్భుతమని కొనియాడారు. ఇండిగోను ముందుండి నడిపించేందుకు ఆయన తగినవారని అన్నారు. సీఈఓగా విలియమ్ ఎంపికను తాను స్వాగతిస్తున్నట్టు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా కూడా తెలిపారు.
ఈ వార్తలూ చదవండి:
మార్చి 31 డెడ్‌లైన్.. ఈ 3 పనులు వెంటనే పూర్తి చేయండి!
మహావీర్ జయంతి సందర్భంగా ఈ రోజు భారత స్టాక్ మార్కెట్లకు సెలవు