Share News

మెగా ఐపీఓకు 'జియో' రెడీ.. నేడే సెబీకి డ్రాఫ్ట్ పేపర్లు.. ప్రకటించిన ముకేశ్‌ అంబానీ

ABN , Publish Date - Jun 19 , 2026 | 04:56 PM

భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత భారీ ఐపీఓలలో ఒకటిగా నిలవబోతున్న 'రిలయన్స్ జియో ఐపీఓ' త్వరలో రాబోతోంది. ఈ మెగా ఇష్యూకు సంబంధించిన డ్రాఫ్ట్‌ పేపర్లను జియో ప్లాట్‌ఫామ్స్‌ బోర్డు ఆమోదించింది. ఈ పత్రాలను ఈరోజే 'సెబీ'కి సమర్పించారు.

మెగా ఐపీఓకు 'జియో' రెడీ.. నేడే సెబీకి డ్రాఫ్ట్ పేపర్లు.. ప్రకటించిన ముకేశ్‌ అంబానీ
NSE and Reliance Jio IPOs Set to Become India's Largest Public Offerings

ముంబై, జూన్ 19: భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత భారీ ఐపీఓలలో ఒకటిగా నిలవబోతున్న 'రిలయన్స్ జియో ఐపీఓ' (Jio IPO)కి ముహూర్తం ఖరారైంది. మదుపరులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మెగా ఇష్యూకు సంబంధించిన డ్రాఫ్ట్‌ పేపర్లను జియో ప్లాట్‌ఫామ్స్‌ బోర్డు అధికారికంగా ఆమోదించింది. ఈ ముసాయిదా పత్రాలను శుక్రవారమే మార్కెట్‌ నియంత్రణ సంస్థ (SEBI) కి సమర్పించనున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ వెల్లడించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సాధారణ సమావేశం (AGM)లో వాటాదారులను ఉద్దేశించి ప్రసంగించిన ముకేశ్‌ అంబానీ ఈ కీలక ప్రకటన చేశారు.


భావోద్వేగ క్షణం..

జియో ఐపీఓ గురించి ముకేశ్‌ అంబానీ మాట్లాడుతూ, ఇది రిలయన్స్ కుటుంబానికి, కోట్లాది మంది వాటాదారులకు అత్యంత భావోద్వేగభరితమైన క్షణమని అభివర్ణించారు. 'ఈ ఏడాది రిలయన్స్‌ ప్రస్థానంలో జియో ఐపీఓ అత్యంత ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఇది మా పాత వాటాదారులకు గణనీయమైన విలువను అందించడమే కాకుండా, కొత్త పెట్టుబడిదారులకు ఓ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రపంచ స్థాయి సామర్థ్యం కలిగిన సాంకేతిక సంస్థలను భారత్ నిర్మించగలదని జియో లిస్టింగ్‌ ప్రపంచానికి చాటిచెబుతుంది' అని ముకేశ్‌ అంబానీ చెప్పారు.

ఐపీఓ సైజ్ ఎంత?

రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఫైలింగ్స్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం.. రూ.10 ముఖ విలువ (Face Value) కలిగిన 27 కోట్ల ఈక్విటీ షేర్లను ఫ్రెష్‌ ఇష్యూ ద్వారా విక్రయించనున్నారు. ఈ ఐపీఓ ద్వారా సుమారు 4 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.36,000 కోట్ల నుంచి రూ.40,000 కోట్లు) మార్కెట్‌ నుంచి సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. బుక్‌ బిల్డింగ్‌ ప్రాసెస్‌ ద్వారా ఐపీఓ ధరను త్వరలోనే నిర్ణయించనున్నారు.


ఆలస్యానికి కారణాలు ఏంటి?

గత ఏడాది ఏజీఎంలోనే ముకేశ్‌ అంబానీ 2026 ప్రథమార్ధంలో జియో ఐపీఓ ఉంటుందని ప్రకటించారు. అయితే, అనుకున్న సమయం కంటే ఈ ప్రక్రియ కాస్త ఆలస్యమైంది. దీనికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. 1. ఈ ఏడాది రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు విలువలో కొంత క్షీణత నమోదు కావడం. 2. పశ్చిమాసియాలో (Middle East) నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా రిలయన్స్‌కు ప్రధాన ఆదాయ వనరైన పెట్రోకెమికల్‌ వ్యాపారంపై ప్రభావం పడటం. ఈ సవాళ్లను అధిగమించి జియో ఐపీఓ ఎట్టకేలకు పట్టాలెక్కడంతో అటు మార్కెట్ వర్గాల్లోనూ, ఇటు రిటైల్ ఇన్వెస్టర్లలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. సెబీ అనుమతి లభించిన తర్వాత ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ తేదీలు, ప్రైస్ బ్యాండ్ వివరాలు వెల్లడి కానున్నాయి.


ఇవి కూడా చదవండి...

హోటల్స్, రెస్టారెంట్లలో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల దాడులు.. షాకింగ్ విషయాలు వెలుగులోకి

వాన్‌‌పిక్‌ ఆస్తుల వ్యవహారం.. హైకోర్టులో ఈడీ పిటిషన్ డిస్మిస్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 19 , 2026 | 05:16 PM