పొగాకు ఉత్పత్తులపై కొత్త పన్ను విధానం
ABN , Publish Date - Feb 01 , 2026 | 02:28 AM
ఫిబ్రవరి 1 నుంచి పొగాకు ఉత్పత్తులకు సంబంధించి ప్రభుత్వం ఒక కొత్త పన్ను విధానం తీసుకువచ్చింది. గరిష్ఠ చిల్లర ధర ఆధారంగా పన్ను లెక్కించే ఈ కొత్త విధానం...
ఫిబ్రవరి 1 నుంచి పొగాకు ఉత్పత్తులకు సంబంధించి ప్రభుత్వం ఒక కొత్త పన్ను విధానం తీసుకువచ్చింది. గరిష్ఠ చిల్లర ధర ఆధారంగా పన్ను లెక్కించే ఈ కొత్త విధానం.. ఇప్పటి వరకు ఉన్న విధానానికి పూర్తి భిన్నం. ఆ వివరాలు మీ కోసం..
ఇప్పటి వరకు పొగాకు ఉత్పత్తులపై సిగరెట్, జర్దా, పాన్‌మసాలా, గుట్కా, ఖైనీ ఇలాంటి వాటి మీద జీఎ్‌సటీ 28 శాతంతో పాటు సెస్ ఉండేది. పన్ను లెక్కింపు మాత్రం ఇన్వాయిస్ ఆధారంగానే లెక్కించే వారు. అంటే ఇన్వాయి్‌సలో ఎంత విలువ ఉందో దాని మీదే సంబంధిత పన్ను కట్టాల్సి ఉండేది. ఇప్పుడు కొత్త విధానం ప్రకారం పన్ను అనేది ఇన్వాయి్‌సలో చూపిన విలువ ఆధారంగా కాకుండా ప్యాకెట్ మీద ముద్రించిన ధర మీద లెక్కిస్తారు. దీనిని ఇంతకు ముందు ఎంఆర్‌పీ (మాగ్జిమమ్ రిటైల్ ప్రైస్)గా వ్యవహరించగా ఇప్పుడు ఆర్‌ఎ్‌సపీ (రిటైల్ సేల్ ప్రైస్)గా వ్యవహరించనున్నారు. ఇప్పటి వరకు జీఎ్‌సటీలో ఉత్పత్తితో సంబంధం లేకుండా ట్రాన్సాక్షన్ వాల్యూ అంటే ఇన్వాయి్‌సలో చూపిన విలువ మీదే పన్ను లెక్కిస్తుండగా ఇప్పుడు పైన తెలిపిన పొగాకు ఉత్పత్తులకు మాత్రం కొత్త విధానంలో పన్ను లెక్కిస్తారు. మరి దీన్ని ఎలా లెక్కించాలి?
ఆర్‌ఎ్‌సపీ అంటే అన్ని పన్నులు అందులో కలిసి ఉన్నాయని భావం. ఒక వస్తువు మీద ఉండే ఆర్‌ఎ్‌సపీలో జీఎస్‌టీ కూడా కలిసి ఉంటుంది. కాబట్టి ఇది తీసివేయగా వచ్చిన నికర విలువను ఆధారంగా చేసుకుని పన్ను లెక్కించాలి. ఈ కొత్త మార్పు ప్రకారం పన్ను లెక్కించే విధానంతో పాటుగా పన్ను రేటులో కూడా మార్పు వచ్చింది. ఇప్పటి వరకు పన్ను 28 శాతంతో పాటు సెస్ ఉండేది. ఈ సెస్ అనేది ఉత్పత్తిని బట్టి మారుతుండేది. కాగా, ఇప్పుడు కొత్త విధానంలో సెస్‌ను పూర్తిగా తొలగించారు. అయితే పన్నును మాత్రం 28 శాతం నుంచి 40 శాతానికి పెంచారు. కాబట్టి ఒక వస్తువు మీద ముద్రించిన ధర రూ.100 అనుకుంటే అందులో 40 శాతం జీఎ్‌సటీ కలిపి ఉన్నట్లు భావించాలి. దీన్ని వెనుక నుంచి లెక్కిస్తే రూ.71.43 ఆ వస్తువు విలువ కాగా దాని మీద పన్ను 40 శాతం లెక్కిస్తే రూ.28.57 అవుతుంది. ఈ రెండు కలిపితే రూ.100 అవుతుంది. మరి ఆర్‌ఎ్‌సపీ కంటే తక్కువ ధరకే అంటే రూ.70 లేదా రూ.80కి అమ్మితే.. అప్పుడు కూడా పన్ను మాత్రం రూ.28.57 చెల్లించాలి.
ఇప్పటి వరకు ఉన్న విధానంలో రూ.100 ఆర్‌ఎ్‌సపీ ఉన్న వస్తువును ఉత్పత్తిదారుడు రూ.50కి, హోల్‌సేల్ వ్యక్తి రూ.60కి, రిటైల్ వ్యక్తి రూ.70కి అమ్ముతుంటే పన్ను మాత్రం రూ.50, రూ.60, రూ.70 మీద చెల్లించాల్సి వచ్చేది. కొత్త విధానం ప్రకారం పన్ను అసలు విలువతో సంబంధం లేకుండా చేతులు మారిన ప్రతిసారి రూ.28.57 చెల్లించాలి. కాకపోతే తాను కొనుగోలు చేసిన సమయంలో చెల్లించిన రూ.28.57 ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) కింద తీసుకోవచ్చు.
ఈ విధానంలో డీలర్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే వారి దగ్గర ఉన్న స్టాక్ పాత పద్దతిలో కొనుగోలు చేసి ఉండవచ్చు. కానీ, ఫిబ్రవరి 1 నుంచి అమ్మే స్టాక్‌కు మాత్రం కొత్త పన్ను విధానమే అమలవుతుంది. అయితే, ఇప్పటి వరకు మిగిలి ఉన్న ఐటీసీని కొత్త పన్నుకు కూడా వాడుకోవచ్చు. కానీ సెస్‌ను మాత్రం వాడకూడదు.
ఇకపోతే, పైన చెప్పిన దానికి అదనంగా ఫిబ్రవరి 1 నుంచి పొగాకు ఉత్పత్తుల మీద ఎక్సైజ్ డ్యూటీతో పాటు హెల్త్ సెస్ అమలు కానుంది. కాకుంటే ఇది ఉత్పత్తిదారులకు మాత్రమే పరిమితం. ఇంకొక ముఖ్య విషయం ‘బీడీ’లకు ఈ కొత్త పన్ను విధానం అమలు కాదు.
రాంబాబు గొండాల
గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.
ఇవి కూడా చదవండి..
ఆర్థిక శాఖ మినహా సునేత్రకు మూడు శాఖలు..
మహారాష్ట్ర డీసీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సునేత్ర పవార్
For More National News And Telugu News