Share News

ఇన్ఫీ లాభం 7,823 కోట్లు

ABN , Publish Date - Oct 24 , 2026 | 03:25 AM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి (క్యూ2) దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌ లిమిటెడ్‌ రూ.7,823 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది.

ఇన్ఫీ లాభం 7,823 కోట్లు
infoysis

  • క్యూ2లో 6 శాతం వృద్ధి నమోదు

  • 10శాతం వృద్ధితో రూ.49,244 కోట్లకు ఆదాయం

  • వార్షికాదాయ అంచనా 1-2 శాతానికి కుదింపు

  • ఒక్కో షేరుకు రూ.26 మధ్యంతర డివిడెండ్‌

  • 3 నెలల్లో 8,000 మంది ఫ్రెషర్ల హైరింగ్‌..

  • ఉద్యోగుల సంఖ్యలో 4,480 నికర పెరుగుదల

బెంగళూరు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి (క్యూ2) దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌ లిమిటెడ్‌ రూ.7,823 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఇదే కాలానికి నమోదైన రూ.7,364 కోట్ల లాభంతో పోలిస్తే 6.2 శాతం వృద్ధి కనబరిచింది. జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో నమోదైన రూ.7,769 కోట్ల లాభంతో పోలిస్తే మాత్రం కేవలం 0.7 శాతం పెరిగింది. సమీక్షా త్రైమాసికంలో ఇన్ఫోసిస్‌ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 10.7 శాతం వృద్ధితో రూ.49,244 కోట్లకు ఎగబాకింది. 2025-26లో ఇదే కాలానికి ఆదాయం రూ.44,490 కోట్లుగా నమోదైంది. ఈ క్యూ1 ఆదాయం రూ.48,211 కోట్లతో పోలిస్తే 2 శాతం వృద్ధి నమోదైంది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఆదాయం అంచనా శ్రేణిని మాత్రం గతంలో ప్రకటించిన 1.5-3 శాతం నుంచి 1-2 శాతానికి కుదించింది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు, క్లయింట్లు ఐటీ వ్యయాలపై ఆచితూచి వ్యవహరిస్తుండటం ఇందుకు కారణమని ఇన్ఫోసిస్‌ సీఈఓ, ఎండీ సలీల్‌ పరేఖ్‌ తెలిపారు. అయితే వార్షిక నిర్వహణ మార్జిన్‌ అంచనా శ్రేణిని మాత్రం యథాతథంగా 20-22 శాతంగా కొనసాగించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ఇన్ఫోసిస్‌ తన వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.26 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఇందుకు అర్హులైన షేర్‌హోల్డర్ల వివరాల నమోదుకు నవంబరు 3ను రికార్డు తేదీగా నిర్ణయించిన సంస్థ.. 11న చెల్లింపులు జరపనున్నట్లు తెలిపింది.


కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సేవల ద్వారా ఆదాయం త్రైమాసిక ప్రాతిపదికన 29 శాతం పెరిగిందని.. మొత్తం రాబడిలో ఈ సేవల వాటా 10.5 శాతంగా ఉందని కంపెనీ తెలిపింది. క్యూ1లో ఇది 8.2 శాతంగా ఉంది.

ఈ క్యూ2లో కంపెనీ స్థిర కరెన్సీ ఆధారిత ఆదాయం త్రైమాసిక ప్రాతిపదికన 1.2 శాతం పెరగగా.. వార్షిక ప్రాతిపదికన 1.5 శాతం వృద్ధి కనబరిచింది. నిర్వహణ మార్జిన్‌ 21 శాతంగా, ఎర్నింగ్‌ పర్‌ షేర్‌ (ఈపీఎస్‌) 8.7 శాతంగా నమోదైంది.

గడిచిన మూడు నెలల్లో 520 కోట్ల డాలర్ల విలువైన బడా డీల్స్‌ను కంపెనీ దక్కించుకుంది. అందులో ఒక డీల్‌ 200 కోట్ల డాలర్లకు పైగా విలువైనదని వెల్లడించింది. అంతేకాదు, మొత్తం డీల్స్‌లో 62 శాతం కొత్తగా వచ్చినవేనని తెలిపింది.

గడిచిన మూడు నెలల్లో ఇన్ఫోసిస్‌ ఉద్యోగులు నికరంగా 4,480 మంది పెరిగారు. దాంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,32,542కు చేరుకుంది. సమీక్షా కాలానికి ఉద్యోగుల వలసల రేటు 12.7 శాతానికి తగ్గింది. జూన్‌ త్రైమాసికంలో ఇది 13 శాతంగా ఉంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రాంగణ నియామకాల (క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌) ద్వారా దాదాపు 20,000 మంది కాలేజీ విద్యార్థులను ఉద్యోగంలో చేర్చుకోవాలని ఇన్ఫోసిస్‌ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా సెప్టెంబరు త్రైమాసికంలో 8,000 మంది ఫ్రెషర్లను నియమించుకున్నట్లు ఇన్ఫోసిస్‌ వెల్లడించింది.

ఈ వార్తలు కూడా చదవండి

అమితాబ్ బచ్చన్ బంగ్లాను పేల్చేస్తామంటూ బెదిరింపు ఈ-మెయిల్!

మెటా కళ్లద్దాలతో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం: కర్ణాటక సీఎం

Updated Date - Oct 24 , 2026 | 04:19 AM