Share News

కేంద్ర బడ్జెట్ 2026 - 27.. భారత్‌ను హెచ్చరించిన ఎకనామిక్ సర్వే..

ABN , Publish Date - Jan 29 , 2026 | 04:06 PM

ప్రపంచ రాజకీయాల్లో చైనా, అమెరికా దేశాల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. చైనాను అన్ని రంగాల్లో వెనక్కు తోసేయాలని అమెరికా.. అమెరికాను అన్ని రంగాల్లో వెనక్కు తోసేయాలని చైనా పావులు కదుపుతున్నాయి.

కేంద్ర బడ్జెట్ 2026 - 27.. భారత్‌ను హెచ్చరించిన ఎకనామిక్ సర్వే..
India US China dependency

న్యూఢిల్లీ, జనవరి 29: కేంద్ర బడ్జెట్ 2026 - 27 సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ‘ది ఎకనామిక్ సర్వే 2025 - 26’ భారత్‌ను హెచ్చరించింది. అమెరికా, చైనాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వస్తువులు, సేవల విషయంలో అమెరికా, చైనాలపై ఆధారపడటం మంచిది కాదని స్పష్టం చేసింది. మరీ ముఖ్యంగా టెక్నాలజీ, సెమీ కండక్టర్స్, ఏఐ, ట్రేడ్ కంట్రోల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. లేదంటే అమెరికా, చైనా దేశాల మధ్య భారత్ క్రాస్ ఫైర్ అవ్వక తప్పదని అంది.


ది ఎకనామిక్ సర్వే ప్రకారం.. ప్రపంచ రాజకీయాల్లో చైనా, అమెరికా దేశాల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. చైనాను అన్ని రంగాల్లో వెనక్కు తోసేయాలని అమెరికా.. అమెరికాను అన్ని రంగాల్లో వెనక్కు తోసేయాలని చైనా పావులు కదుపుతున్నాయి. అమెరికా ఆధిపత్యం సాగిస్తున్న రంగాలపై చైనా దృష్టి సారించింది. అమెరికా కూడా అదే పని చేస్తోంది. ఒకే విధమైన ఆలోచనలు ఉన్న దేశాలను కలుపుకొని సెక్యూర్ ఏఐ ఎకోసిస్టమ్‌ను తయారు చేయాలని అమెరికా చూస్తోంది. సాధారణంగా అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్, క్రిటికల్ ఏపీఐలు, సెమీ కండక్టర్ల ఉత్పత్తిలో ఆధిపత్యం కొనసాగిస్తున్న దేశాలే ప్రపంచ రాజకీయాల్లో పవర్‌ను కలిగి ఉంటాయి.


భారత్ ఈ రెండు దేశాలపై ఆధారపడటం తగ్గించాలి. వస్తువులు లేదా సేవల విషయంలో ప్రత్యామ్నాయం లేని దేశంగా తప్పకుండా ఎదగాల్సిన అవసరం ఏంతైనా ఉంది. అలా చేయకపోతే ప్రపంచ రాజకీయాల్లో భారత్ పట్టు కోల్పోతుంది. అమెరికా, చైనాల మధ్య జరిగే గొడవల వల్ల భారత్ ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. చైనా గనుక దిగుమతులపై ఆంక్షలు విధించినా లేదా ధరల్ని పెంచినా దాని ప్రభావం భారత తయారీ రంగంపై తీవ్రంగా ఉంటుంది. అలాగే అమెరికా.. పాలసీలను కఠినతరం చేస్తే దాని ప్రభావం భారత సర్వీస్ సెక్టార్‌పై తీవ్రంగా ఉంటుంది.


ఇవి కూడా చదవండి..

అజిత్‌ పవార్ విమాన ప్రమాదం.. కాక్ పిట్‌లో చివరి మాటలివే..

భారీ నష్టాల నుంచి లాభాల వైపు.. చివర్లో కోలుకున్న దేశీయ సూచీలు

Updated Date - Jan 29 , 2026 | 04:20 PM