Share News

అన్‌స్టాబుల్

ABN , Publish Date - Nov 07 , 2026 | 01:32 AM

వాల్‌ స్ట్రీట్‌ కుప్పకూలినా దలాల్‌ స్ట్రీట్‌లో దీపావళి సంబరాలు కొనసాగాయి. అమెరికా, ఆసియా మార్కెట్లు బేర్‌ పంజా దెబ్బకు విలవిల్లాడుతుంటే మన మార్కెట్‌ బుల్‌ మాత్రం అన్‌స్టాపబుల్‌గా పరుగులు తీసింది.

అన్‌స్టాబుల్
bull

  • అమెరికా, ఆసియా మార్కెట్లు కుప్పకూలినా దలాల్‌ స్ట్రీట్‌లో బుల్‌ జోరు

  • మళ్లీ 25,000 ఎగువకు నిఫ్టీ

  • మరో 1,718 పాయింట్ల లాభంతో 81,000 పైకి సెన్సెక్స్‌

  • ఏడో రోజూ లాభాల్లో సూచీలు 8 రూ.1.45 లక్షల కోట్ల సంపద వృద్ధి

ముంబై: వాల్‌ స్ట్రీట్‌ కుప్పకూలినా దలాల్‌ స్ట్రీట్‌లో దీపావళి సంబరాలు కొనసాగాయి. అమెరికా, ఆసియా మార్కెట్లు బేర్‌ పంజా దెబ్బకు విలవిల్లాడుతుంటే మన మార్కెట్‌ బుల్‌ మాత్రం అన్‌స్టాపబుల్‌గా పరుగులు తీసింది. దాంతో దేశీయ ప్రామాణిక ఈక్విటీ సూచీలు వరుసగా ఏడో రోజూ లాభపడ్డాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ మరో 1,718.01 పాయింట్లు (2.17శాతం) ఎగబాకి 81,028.02 వద్ద ముగిసింది. నిఫ్టీ 493.75 పాయింట్ల (2.01శాతం) వృద్ధితో 9 నెలల గరిష్ఠ స్థాయి 25,030.35 వద్ద స్థిరపడింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐ) కొనుగోళ్ల జోరు, చమురు ధరల తగ్గుదల ఇందుకు ప్రధానంగా దోహదపడ్డాయి. ఎఫ్‌ఐఐలు నికరంగా రూ.13,749.82 కోట్ల షేర్లను కొనుగోలు చేయగా.. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐ) మాత్రం రూ.5,968.70 కోట్ల నికర విక్రయాలు చేపట్టారు.

ఎం అండ్‌ ఎం టాప్‌ గెయినర్‌: సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో పవర్‌గ్రిడ్‌ మినహా అన్నీ లాభపడ్డాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) షేరు 6.15 శాతం ఎగబాకి సూచీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. బీఎస్ఈలోని మిడ్‌క్యాప్‌ సూచీ 0.23 శాతం పెరగగా.. స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ మాత్రం 0.92 శాతం తగ్గింది. బీఎస్ఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.1.45 లక్షల కోట్లు పెరిగి రూ.503.06 లక్షల కోట్లకు (5.34 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది.

7 రోజుల్లో రూ.30 లక్షల కోట్ల లాభం: గడిచిన ఏడు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ 7,781.99 పాయింట్లు, నిఫ్టీ 2,331.5 పాయింట్లు బలపడ్డాయి. మార్కెట్‌ సంపదలో ఏకంగా రూ.30.43 లక్షల కోట్ల వృద్ధి నమోదైంది.


రూపీ జూమ్‌: భారత కరెన్సీ భారీగా పుంజుకుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 43 పైసలు బలపడి రూ.93.98 వద్ద ముగిసింది. ఈ ఏడాది అక్టోబరు 12 తర్వాత రూపాయి మారకం విలువలో ఇదే అత్యధిక ఒక్కరోజు వృద్ధి.

బంగారం రూ.2500 డౌన్‌: వరుసగా రెండు రోజులు పెరుగుతూ వచ్చిన విలువైన లోహాల ధరలు ధనత్రయోదశి నాడు కాస్త దిగివచ్చాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాముల రేటు రూ.2,500 తగ్గి రూ.1,46,300కు జారుకోగా.. కిలో వెండి రూ.2,000 తగ్గుదలతో రూ.1,92,500కు పరిమితమైంది.

సంవత్‌ 2082.. ప్చ్‌!

హిందూ సంప్రదాయ సంవత్సరం ‘సంవత్‌ 2082’.. మన ఈక్విటీ మార్కెట్లకు అంతగా కలిసిరాలేదు. సంవత్‌ 2081 ముగింపు స్థాయి 84,363.37 తో పోలిస్తే.. ఈ శనివారంతో ముగుస్తున్న ప్రస్తుత సంవత్‌లో సెన్సెక్స్‌ 3,335.35 పాయింట్లు (3.95శాతం) తగ్గి 81,028.02 వద్దకు జారుకుంది. నిఫ్టీ విషయానికొస్తే, ఈ సంవత్‌లో 812.8 పాయింట్ల (3.14శాతం) నష్టంతో 25,030.35 వద్దకు పడిపోయింది.


గడిచిన వారం రోజుల మార్కెట్‌ ర్యాలీని మినహాయిస్తే, ఈ సంవత్‌లో సూచీలు 8శాతం మేర క్షీణతను నమోదు చేసి ఉండేవి. ట్రంప్‌ వాణిజ్య సుంకాల వడ్డింపు, పశ్చిమాసియా ఉద్రిక్తతలతో చమురు ధరల పెరుగుదల, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల అమ్మకాలు గడిచిన ఏడాది కాలంలో మార్కెట్లను బాగా బలహీనపరిచాయి.

వచ్చే సంవత్‌పై ఆశావహం

ఈ దీపావళితో ప్రారంభం కానున్న ‘సంవత్‌ 2083’లో మాత్రం మార్కెట్లు మళ్లీ పుంజుకోవచ్చని, సూచీలు రెండంకెల స్థాయి వరకు రిటర్నులు అందించే అవకాశాలున్నాయని కొందరు ఈక్విటీ విశ్లేషకులు భావిస్తున్నారు. పశ్చిమాసియాలో పరిణామాలు, చమురు ధరలు, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ప్రామాణిక వడ్డీ రేట్లు, యూఎస్‌ బాండ్‌ రేట్లు, విదేశీ సంస్థాగత పెట్టుబడుల ట్రెండ్‌ వంటి అంశాలు వచ్చే సంవత్‌లో స్టాక్‌ మార్కెట్ల దిశను నిర్దేశించనున్నాయని వారు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

రూ.11కే ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్.. ప్రమాదం జరిగితే వైద్య ఖర్చుల కవరేజ్

వెహికిల్‌ సొల్యూషన్స్‌ వ్యాపారంలోకి ఎల్‌జీ

Updated Date - Nov 07 , 2026 | 01:32 AM