మార్కెట్లకు చమురు సెగ.. భారీ నష్టాల్లో దేశీయ సూచీలు..
ABN , Publish Date - Apr 30 , 2026 | 09:51 AM
ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఇరాన్ ఓడ రేవులపై అమెరికా దిగ్బంధనం కొనసాగుతుండడంతో చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ఒప్పందం కుదిరేవరకు దిగ్బంధనం కొనసాగుతుందని ట్రంప్ హెచ్చరించడంతో చమురు ధరలు అమాంతం పెరిగాయి.
ముడి చమురు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. ఇరాన్ ఓడ రేవులపై అమెరికా దిగ్బంధనం కొనసాగుతుండడంతో చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ఒప్పందం కుదిరేవరకు దిగ్బంధనం కొనసాగుతుందని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడంతో చమురు ధరలు అమాంతం పెరిగాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర ఏకంగా ఆరు శాతం పెరిగి 120 డాలర్లు దాటింది. 2022 తర్వాత బ్రెంట్ క్రూడాయిల్ ధర ఈ స్థాయిలో పెరగడం ఇదే ప్రథమం.
మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మరింతగా క్షీణించింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 95.20గా ఉంది. రికార్డు కనిష్ఠానికి చేరుకుంది. ఈ ప్రతికూలతల నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. (Indian stock market).
గత సెషన్ ముగింపు (77,496)తో పోల్చుకుంటే గురువారం ఉదయం 450 పాయింట్లకు పైగా నష్టంతో 77,014 వద్ద మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత కిందకు పడిపోయింది. ఉదయం 9:45 గంటల సమయంలో సెన్సెక్స్ 816 పాయింట్ల నష్టంతో 76,680 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతం 256 పాయింట్ల నష్టంతో 23,921 వద్ద కదలాడుతోంది. చాలా రోజుల తర్వాత 24 వేల మార్క్ దిగువకు పడిపోయింది (stock market news today).
సెన్సెక్స్, నిఫ్టీలో బజాజ్ ఫైనాన్స్, మోతీలాల్ ఓస్వాల్, బజాజ్ ఫిన్‌సెర్వ్, ఎంఫసిస్, కోల్ ఇండియా మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). వారీ ఎనర్జీస్, ఇండియన్ బ్యాంక్, అదానీ ఎనర్జీ, ప్రీమియర్ ఎనర్జీ, హిందుస్థాన్ జింక్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 591 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 716 పాయింట్ల నష్టంతో ఉంది.
ఇవి కూడా చదవండి..
బంగారం కొనాలనుకుంటున్నారా.. మరింత తగ్గిన ధరలు..
రష్యాలో మరో ఆయిల్ కేంద్రంపై దాడి.. డ్రోన్ శక్తిని చూపిస్తున్న ఉక్రెయిన్..