Share News

బ్యాంకుల ఫలితాలు భేష్‌..

ABN , Publish Date - Oct 18 , 2026 | 05:55 AM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించి పలు బ్యాంకులు తమ ఆర్థిక ఫలితాలను ప్రకటించాయి. ఇందులో కొన్ని బ్యాంకులు మెప్పించగా..

బ్యాంకుల ఫలితాలు భేష్‌..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించి పలు బ్యాంకులు తమ ఆర్థిక ఫలితాలను ప్రకటించాయి. ఇందులో కొన్ని బ్యాంకులు మెప్పించగా.. మరికొన్ని బ్యాంకులు పర్వాలేదనిపించాయి. కాగా మరికొన్ని బ్యాంకులు మార్కెట్‌ అంచనాలను అందుకోలేకపోయాయి. శనివారం ఆర్థిక ఫలితాలు ప్రకటించిన బ్యాంకుల్లో హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌తో పాటు త్వరలో ప్రైవేటుపరం కాబోతున్న ఐడీబీఐ బ్యాంక్‌ సహా మరికొన్ని బ్యాంకులున్నాయి.

హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ లాభం రూ.20,700 కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి (క్యూ2) హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 5.55 శాతం వృద్ధితో రూ.20,700 కోట్లకు చేరింది. స్టాండ్‌ఎలోన్‌ లాభం 4.7 శాతం పెరుగుదలతో రూ.19,510 కోట్లుగా నమోదైంది. క్యూ2లో మొత్తం ఆదాయం రూ.97,258 కోట్లకు ఎగబాకింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి రాబడి రూ.91,040 కోట్లుగా ఉంది. కాగా, వ్యయాలు రూ.63,117 కోట్ల నుంచి రూ.67,774 కోట్లకు పెరిగాయి. అలాగే, మొండి బకాయిలతో పాటు తక్షణ అవసరాల కోసం కేటాయింపులు కూడా రూ.3,500 కోట్ల నుంచి రూ.3,573.62 కోట్లకు పెరిగాయి. స్థూల ఎన్‌పీఏలు 1.24 శాతం నుంచి 1.11 శాతానికి తగ్గినట్లు బ్యాంక్‌ పేర్కొంది.

ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభంలో 22% వృద్ధి

సెప్టెంబరు త్రెమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ.16,333.18 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి గడించిన రూ.13,357.06 కోట్ల లాభంతో పోలిస్తే 22.28 శాతం లాభం కనబరిచింది. కాగా, బ్యాంక్‌ స్టాండ్‌ఎలోన్‌ లాభం వార్షిక ప్రాతిపదికన 20.1 శాతం వృద్ధితో రూ.14,843 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 17.7 శాతం పెరిగి రూ.25,339 కోట్లకు చేరుకుంది. సమీక్షా కాలానికి రుణ పోర్ట్‌ఫోలియో 30 శాతం వృద్ధి చెందడం ఇందుకు దోహదపడింది. బ్యాంక్‌ నికర వడ్డీ మార్జిన్‌ మాత్రం 0.12 శాతం తగ్గి 4.18 శాతానికి పరిమితమైంది. కాగా స్థూల ఎన్‌పీఏలు 1.58 శాతం నుంచి 1.20 శాతానికి తగ్గాయి.

38% పెరిగిన యాక్సిస్‌ బ్యాంక్‌ లాభం

సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో యాక్సిస్‌ బ్యాంక్‌ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 39.4 శాతం వృద్ధితో రూ.7,704.67 కోట్లకు చేరుకుంది. స్టాండ్‌ఎలోన్‌ లాభం 37.6 శాతం పెరిగి రూ.7,003.28 కోట్లుగా నమోదైంది. సమీక్షా కాలానికి బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 12 శాతం పెరిగి రూ.15,371 కోట్లకు ఎగబాకగా.. నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) 3.36 శాతంగా నమోదైంది. బ్యాంక్‌ రుణాలు 23 శాతం, డిపాజిట్లు 21 శాతం వార్షిక ప్రాతిపదిక వృద్ధిని కనబరిచాయి.


ఐడీబీఐ బ్యాంక్‌ లాభం 39% డౌన్‌

సెప్టెంబరుతో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో ఐడీబీఐ బ్యాంక్‌ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 39 శాతం తగ్గి రూ.2,205 కోట్లకు పరిమితమైంది. వడ్డీయేతర ఆదాయం తగ్గుముఖం పట్టడం ఇందుకు కారణమైంది. సమీక్షా కాలానికి బ్యాంక్‌ మొత్తం ఆదాయం మాత్రం రూ.9,865 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 29 శాతం పెరిగి రూ.4,228 కోట్లకు చేరినప్పటికీ, వడ్డీయేతర ఆదాయం మాత్రం 46 శాతం తగ్గి రూ.1,353 కోట్లకు జారుకుంది. ఆస్తుల నాణ్యత విషయానికొస్తే, సెప్టెంబరు 30 నాటికి బ్యాంక్‌ మొండి బకాయిల (గ్రాస్‌ ఎన్‌పీఏ) నిష్పత్తి 2.12 శాతానికి తగ్గింది. గత ఏడాది సెప్టెంబరు చివరినాటికిది 2.65 శాతంగా నమోదైంది. ఇక నికర ఎన్‌పీఏలు 0.21 శాతం నుంచి 0.17 శాతానికి తగ్గాయి. ప్రస్తుతం ఎల్‌ఐసీ పరిధిలో ఉన్న ఐడీబీఐ బ్యాంక్‌లో 60.72 శాతం వాటాను కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్‌ ఫైనాన్షియల్‌ హోల్డింగ్స్‌ దాదాపు రూ.53,000 కోట్లకు కొనుగోలు చేయనుంది.

యస్‌ బ్యాంక్‌ లాభంలో 65% వృద్ధి

సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో యస్‌ బ్యాంక్‌ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 65 శాతం వృద్ధి చెంది రూ.1,080 కోట్లకు ఎగబాకింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 22.7 శాతం పెరిగి రూ.2,822 కోట్లకు చేరింది. ఆస్తుల నాణ్యత విషయానికొస్తే, స్థూల ఎన్‌పీఏలు రూ.3,875 కోట్లకు, నికర ఎన్‌పీఏలు రూ.757 కోట్లకు తగ్గాయి. కాగా, 2020 మార్చిలో బ్యాంక్‌ రూ.8,415 కోట్ల విలువైన అడిషనల్‌ టైర్‌ 1 (ఏటీ1) బాండ్లను రైటాఫ్‌ చేసిన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఈ నెల 15న రద్దు చేసింది.

న్యాయస్థానం తీర్పుతో ఆర్థిక ప్రభావాన్ని బ్యాంక్‌ ఈ త్రైమాసిక ఫలితాల్లో పరిగణనలోకి తీసుకోలేదు. ఒకవేళ ఈ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని ఉండే, సెప్టెంబరు త్రైమాసికంలో బ్యాంక్‌ రూ.5,217 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించేది ఉండేదని అంచనా.

సెంట్రల్‌ బ్యాంక్‌కు వడ్డీ ఆదాయ దన్ను

సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (సీబీఐ) నికర లాభం వార్షిక ప్రాతిపదికన 21 శాతం వృద్ధితో రూ.1,469 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం పుంజుకోవడంతో పాటు మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం ఇందుకు దోహదపడింది. సమీక్షా కాలానికి బ్యాంక్‌ మొత్తం ఆదాయం రూ.11,737 కోట్లకు ఎగబాకగా.. అందులో వడ్డీ ఆదాయం రూ.10,357 కోట్లుగా ఉంది. నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) వార్షిక ప్రాతిపదికన 26 శాతం వృద్ధితో రూ.4,146 కోట్లకు పెరిగింది.

ఈ వార్తలు కూడా చదవండి..

స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. కూటమి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

మహిళలు స్వయంకృషితో ఎదిగేందుకు ఎన్టీఆర్‌ ట్రస్ట్ చేయూత: నారా భువనేశ్వరి

ద్వారకా తిరుమలలో 21 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు

Read Latest AP News And Telangana News And National News

Updated Date - Oct 18 , 2026 | 05:55 AM