Share News

దేశంలో చమురు కొరత లేదు.. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగుతాయి: కేంద్రం

ABN , Publish Date - May 18 , 2026 | 08:09 PM

అమెరికా ఆంక్షల మినహాయింపులు ఉన్నా, లేకపోయినా రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తామని భారత కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశ ఇంధన భద్రత, వాణిజ్య ప్రయోజనాలే తమకు ముఖ్యమని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.

దేశంలో చమురు కొరత లేదు.. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగుతాయి: కేంద్రం
India Russian oil imports

భారత్‌లో కేవలం తొమ్మిదిన్నర రోజులకు సరిపడా చమురు నిల్వలు మాత్రమే ఉన్నాయంటూ వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. దేశంలో చమురు కొరత అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై కేంద్రం స్పష్టతనిచ్చింది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే కొందరు ఇలాంటి అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని, వీటిని ప్రజలెవరూ నమ్మవద్దని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ (PIB Fact Check) విభాగం స్పష్టం చేసింది. అమెరికా మినహాయింపు గడువు ముగిసినప్పటికీ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగుతాయని స్పష్టం చేసింది.


'రష్యా చమురుపై అమెరికా ఆంక్షల సమయంలో కూడా భారత్ అక్కడి నుంచి కొనుగోలు చేసింది. ఆంక్షలు సడలించినపుడూ కొనుగోళ్లు చేశాం. ఇకపై కూడా ఆ కొనుగోళ్లు కొనసాగుతాయి. చమురును ఏ దేశం నుంచి కొనాలనే నిర్ణయం పూర్తిగా మన వాణిజ్య ప్రయోజనాలపైనే ఆధారపడి ఉంటుంది. రష్యా చమురుపై అమెరికా ఆంక్షలు ఉన్నా, లేకపోయినా మన కొనుగోళ్లు కొనసాగుతాయి' అని పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ స్పష్టం చేశారు (US sanctions Russia oil).


సరఫరా లోటు లేకుండా దేశ అవసరాలను తీర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సుజాత శర్మ తెలిపారు (India energy security). ప్రస్తుతం దేశంలో ముడి చమురు కొరత లేదని స్పష్టం చేశారు. ఇరాన్‌తో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ రష్యా చమురుపై ఆమెరికా తాత్కాలికంగా ఆంక్షలు ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఆ గడువు మే 17వ తేదీతో ముగిసింది. ఈ నేపథ్యంలో రష్యా నుంచి చమురు సరఫరా ఆగిపోతుందనే ఆందోళనల నేపథ్యంలో కేంద్రం స్పష్టతనిచ్చింది.


ఇవి కూడా చదవండి..

సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం.. మార్కులు పెరిగితే రీ-ఎవాల్యుయేషన్ ఫీజు పూర్తిగా రీఫండ్..


ఉగ్రవాదికి బట్టతల కష్టాలు.. దాడులు చేయడానికి భారత్‌లోకి చొరబడి..

Updated Date - May 18 , 2026 | 08:30 PM