దేశంలో తగ్గిన బంగారం డిమాండ్!
ABN , Publish Date - Jul 30 , 2026 | 01:34 PM
దేశంలో బంగారం కొనుగోళ్లకు సంబంధించి ఆసక్తికర వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో పసిడి డిమాండ్ 6 శాతం తగ్గి 131 టన్నులకు పరిమితమైంది. ఆభరణాల డిమాండ్ 15 శాతం తగ్గగా, బంగారం బిస్కెట్ల డిమాండ్ మాత్రం 9 శాతం పెరిగింది.
ముంబై, జులై 30: భారతదేశంలో బంగారం ధరల్లో నిరంతరం చోటుచేసుకుంటున్న తీవ్ర వ్యత్యాసాలు, అస్థిరత కొనుగోలుదారులను వెనక్కి తగ్గేలా చేస్తున్నాయి. గరిష్ఠ స్థాయిల్లో ఉన్న ధరల కారణంగా వినియోగదారులు ఆభరణాల కొనుగోలును వాయిదా వేసుకోవడంతో ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో (Q2) భారతదేశంలో పసిడి డిమాండ్ 6 శాతం తగ్గి 131 టన్నులకు పరిమితమైంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(WGC) జారీ చేసిన 'గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్' నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
అయితే, ధరలు భారీగా ఉండటంతో కొనుగోలు విలువ పరంగా మాత్రం రికార్డు స్థాయి నమోదు కావడం గమనార్హం. గతేడాది జూన్ త్రైమాసికంలో పసిడి డిమాండ్ విలువ రూ.1.32 లక్షల కోట్లుగా ఉంటే, ఈసారి ఏకంగా 50 శాతం పెరిగి రూ.1.98 లక్షల కోట్లకు చేరింది.
ఆభరణాల డిమాండ్‌లో 15 శాతం కోత
బంగారం రేట్లు మండిపోతుండటంతో వినియోగదారులు ఆభరణాలు కొనుగోలు చేయడాన్ని తగ్గించుకున్నారు. గతేడాది 89 టన్నులుగా ఉన్న ఆభరణాల డిమాండ్ ఈ త్రైమాసికంలో 15 శాతం తగ్గి 75 టన్నులకు పడిపోయింది. పరిమాణం తగ్గినప్పటికీ, విలువ పరంగా మాత్రం గతేడాది ఉన్న రూ.84,200 కోట్ల నుంచి 34 శాతం పెరిగి రూ.1.13 లక్షల కోట్లకు చేరింది.
నాణాలు, బిస్కట్లు, ETF పెట్టుబడులకు క్రేజ్
ఆభరణాల అమ్మకాలు తగ్గినప్పటికీ, పెట్టుబడి సాధనంగా బంగారాన్ని భావించే వాళ్లు బంగారం బిస్కట్ల కొనుగోలు వైపే మొగ్గు చూపారు. వీటి డిమాండ్ 9 శాతం పెరిగి 50 టన్నులకు చేరింది. విలువ పరంగా చూస్తే రూ.43,700 కోట్ల నుంచి రూ.75,700 కోట్లకు భారీగా పెరిగింది. గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లోకి మదుపరుల ప్రవాహం ఏడాది ప్రాతిపదికన 62 శాతం పెరిగి 4 టన్నులకు చేరింది.
ఇవి కూడా చదవండి
కాళేశ్వరం నుంచి నీటి చుక్క వాడకుండా అత్యధిక ధాన్యం పండించిన తెలంగాణ: ఉత్తమ్
ప్రజల భద్రతతోపాటు వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యం: పవన్ కల్యాణ్