Trump Tariffs Impact: టారిఫికర్‌లోనూ తగ్గేదేలే
ABN , Publish Date - Jan 07 , 2026 | 06:26 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల దెబ్బతో బెంబేలెత్తిన భారత ఎగుమతుల మార్కెట్ ఇపుడిప్పుడే కోలుకుంటోంది. ప్రత్యామ్నాయ మార్కెట్లు చూసుకుంటోంది. అమెరికా స్థాయిలో...
ప్రత్యామ్నాయ మార్కెట్లపై భారత్ దృష్టి.. ఫలిస్తున్న ప్రభుత్వ ప్రయత్నాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల దెబ్బతో బెంబేలెత్తిన భారత ఎగుమతుల మార్కెట్ ఇపుడిప్పుడే కోలుకుంటోంది. ప్రత్యామ్నాయ మార్కెట్లు చూసుకుంటోంది. అమెరికా స్థాయిలో లేకపోయినా.. ప్రస్తుత కష్టకాలంలో ఈ మార్కెట్లు భారత ఎగుమతులను చాలా వరకు ఆదుకుంటున్నాయి. గత ఏడాది సెప్టెంబరు-నవంబరు మధ్య కాలంలో మన మత్స్య ఎగుమతులే ఇందుకు ఉదాహరణ. అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే గత ఏడాది సెప్టెంబరు-నవంబరు కాలంలో మత్స్య ఎగుమతులు 16.8 శాతం పెరిగాయి. చైనా, యూరప్ దేశాలపై దృష్టి పెట్టడడం ఇందుకు ప్రధాన కారణం. ఈ కాలంలో దక్షిణ కొరియాకు ఏకంగా 466.6 శాతం పెరగగా బెల్జియంకు 124.4, మలేషియాకు 81 శాతం, జర్మనీ-నెదర్లాండ్‌కు 56 నుంచి 65 శాతం పెరిగాయి. ఇదే సమయంలో చైనాకు జరిగే మత్స్య ఎగుమతులూ 23 శాతం వరకు పెరిగాయి.
రొయ్యల రైతులకు ఊరట
ట్రంప్ సుంకాల పోటు మన రొయ్యల ఎగుమతులపై పెద్దగా పడలేదని తెలుస్తోంది. 50 శాతం సుంకాల భారం ఉన్నా.. క్రిస్మస్, కొత్త ఏడాది గిరాకీని దృష్టిలో ఉంచుకుని అమెరికా ఎగుమతిదారులు పెద్దఎత్తున రొయ్యలు దిగుమతి చేసుకున్నారు. దాంతో ఆంధ్రప్రదేశ్‌లోని రొయ్యల రైతులూ కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారు. కిలో రొయ్యలకు రైతులకు లభించే ధర కూడా కౌంట్‌ను బట్టి తేడా రూ.20కి మించి తగ్గలేదు. అయితే మార్చి-ఏప్రిల్‌లో చేతికి వచ్చే రొయ్యల ఎగుమతులు, ధరలు ఎలా ఉంటాయనే దానిపై ఆందోళన నెలకొంది. యూరప్, జపాన్, చైనా, ఆస్ట్రేలియాల నుంచి మంచి డిమాండ్ ఉన్నందున వచ్చే సీజన్‌లో కూడా ధరలకు పెద్దగా ఢోకా ఉండకపోవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ (ఈయూ), జపాన్, ఆస్ట్రేలియా దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదిరితే రొయ్యల ఎగుమతులకు అమెరికాపై అధికంగా ఆధారపడడం తగ్గుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
వస్త్ర, నగల పరిశ్రమలకు కష్టాలు
అమెరికా సుంకాలతో మన దేశం నుంచి ఆ దేశానికి జరిగే వస్త్ర, ఆభరణాల పరిశ్రమలు బాగా దెబ్బతిన్నాయి. గత ఏడాది మే-అక్టోబరు మధ్య కాలం లో వీటి ఎగుమతులు 37 శాతం పడిపోయాయి. ముత్యాలు, రత్నాల ఎగుమతులైతే 78.5 శాతం, పసిడి ఆభరణాల ఎగుమతులు 39 శాతం పడిపోయాయి. దీంతో జెమ్స్ అండ్ జువెలరీ పరిశ్రమలో 1.35 లక్షల మంది, వస్త్ర పరిశ్రమలో 1.5 లక్షల మంది రోడ్డున పడ్డారు. అయితే డాలర్‌తో రూపాయి పతనం, బంగ్లాదేశ్‌లో నెలకొన్న ఆటుపోట్లు ఇపుడిప్పుడే భారత వస్త్ర పరిశ్రమకు కొద్దిగా కలిసి వస్తున్నాయి. యూరప్, జపాన్ దేశాల నుంచి ఆర్డర్లు పుంజుకుంటున్నట్టు ఎగుమతిదారులు చెబుతున్నారు. అయితే ఈ ఆర్డర్లు అమెరికా స్థాయిలో లేవు. దీంతో ఎంత త్వరగా భారత-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదురుతుందా అని పరిశ్రమ వర్గాలు కొండంత ఆశతో ఎదురు చూస్తున్నాయి.
స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు జంప్
ట్రంప్ సుంకాల పోటు ప్రభావం స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రికల్ మెషినరీ ఎగుమతులపై మాత్రం పెద్దగా లేదు. నిజానికి గత ఏడాది సెప్టెంబరు-నవంబరు నెలల్లో, అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే స్మార్‌్ట్‌ఫోన్ల ఎగుమతులు 237 శాతం పుంజుకున్నాయి. యాపిల్ ఐఫోన్ల ఎగుమతులు ఇందుకు ప్రధాన కారణంగా ఉన్నాయి.
ఫార్మా ఎగుమతులూ షురూ
ఫార్మా, ఐటీ ఎగుమతులపైనా ట్రంప్ సుంకాల ప్రభావం పెద్దగా లేదు. ఈ రెండింటిపై ఎలాంటి సుంకాలు విధించక పోవడమే ఇందుకు కారణం. అమెరికాలో ఔషధ ధరలు, ఉత్పత్తి ఖర్చులు పెరుగుతాయనే భయంతోనే ట్రంప్ ప్రస్తుతానికి ఈ రెండింటిని సుంకాల నుంచి మినహాయించినట్టు భావిస్తున్నారు. అయినా ఎప్పుడు ఎలాంటి పిడుగులాంటి వార్త వినాల్సి వస్తుందోనని ఈ రెండు రంగాల కంపెనీలు బిక్కు బిక్కుమంటున్నాయి.
2025 సెప్టెంబరు-నవంబరు మధ్య కాలంలో
అమెరికాకు తగ్గిన వివిధ ఉత్పత్తుల ఎగుమతులు
ఉత్పత్తి తగ్గిన %
ముత్యాలు, రత్నాలు 78.5
పసిడి, రత్నాభరణాలు 39.4
కాటన్ వస్త్రాలు, దుస్తులు 23.4
ఎలకా్ట్రనిక్ పరికరాలు 19.0
మత్స్య ఎగుమతులు 17.3
ఆటోమొబైల్ విడిభాగాలు 8.9
పారిశ్రామిక యంత్రాలు 7.0
రెడీమేడ్ కాటన్ దుస్తులు 4.6
డ్రగ్స్ అండ్ బయోలాజికల్స్ 3.5
ఇనుము, స్టీల్ ఉత్పత్తులు 1.6
ఇవి కూడా చదవండి..
ఉత్తరప్రదేశ్‌లో 2.89 కోట్ల మంది ఓటర్ల తొలగింపు
తొక్కిసలాట మరణాలపై విజయ్‌కు సీబీఐ సమన్లు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి