ఏటా 8 నుంచి10% జీడీపీ వృద్ధి రేటు సాధ్యమే
ABN , Publish Date - Feb 05 , 2026 | 06:08 AM
ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ దేశ దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధి రేటుపై అత్యంత ఆశాభావంతో ఉన్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు ఏటా 8 నుంచి 10 శాతం వృద్ధి రేటు
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ
ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ దేశ దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధి రేటుపై అత్యంత ఆశాభావంతో ఉన్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు ఏటా 8 నుంచి 10 శాతం వృద్ధి రేటు నమోదు చేసే సత్తా ఉందన్నారు. జీడీపీ వృద్ధి రేటు రెండంకెల స్థాయిలో నమోదయ్యే అవకాశాన్నీ తోసిపుచ్చలేమన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్లాక్‌రాక్ జాయింట్ వెంచర్ సంస్థ జియో బ్లాక్‌రాక్ బుధవారం సంయుక్తంగా నిర్వహించిన ఒక సమావేశంలో అంబానీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘వచ్చే 20-30 సంవత్సరాల్లో మన జీడీపీ వృద్ధి రేటు, ప్రపంచ జీడీపీ వృద్ధి రేటు మించి ఉంటుందని నేను నమ్ముతున్నా’ అన్నారు. మన దేశ ప్రజలు గత 50-60 సంవత్సరాలుగా పెద్ద మొత్తంలో పొదుపు చేసినా ఆ మొత్తాలను ఉత్పాదక ఆస్తుల పెంపునకు ఉపయోగించలేక పోయారని అంబానీ విచారం వ్యక్తం చేశారు. బ్లాక్‌రాక్‌తో కలిసి తమ అనుబంధ సంస్థ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏర్పాటు చేసిన జియోబ్లాక్‌రాక్ ఈ లోటును తీర్చబోతోందన్నారు. పొదుపు మొత్తాలను దీర్ఘకాలిక ఆస్తుల కల్పనకు ఎలా పెట్టుబడులు పెట్టాలనే విషయంలో జియోబ్లాక్‌రాక్ ప్రజలకు సలహాలు, సూచనలు అందిస్తుందన్నారు.
టెక్ ఇన్‌ఫ్రాలోనూ ముందుంటాం: మన దేశ జీడీపీ 4.5 లక్షల కోట్ల డాలర్లకు చేరడంతో మన చరిత్ర మారబోతోందని అంబానీ అన్నారు. దీంతో అధునాతన టెక్నాలజీలకు అవసరమైన కీలక మౌలిక సదుపాయాల కల్పనలో మన దేశం ముందుకు పోతోందన్నారు. ఈ విషయంలో భారత్ ఏ మాత్రం వెనకబడి లేదన్నారు. అధునాతన టెక్నాలజీల అందుబాటుతో వచ్చే పదేళ్లలో మన ఇంధన అవసరాల్లో 80 శాతం దేశీయంగానే సమకూర్చుకోబోతున్నట్టు అంబానీ చెప్పారు. దేశంలో పెరుగతున్న స్టార్టప్స్‌పై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ స్టార్టప్స్ 100 రిలయన్స్ లాంటి మహా కంపెనీలుగా ఎదిగే అవకాశం ఉందన్నారు. ఇందుకు అవసరమైన విధానపరమైన ప్రోత్సాహక వాతావరణం ప్రస్తుతం దేశంలో ఉందన్నారు. పెరుగుతున్న ఆర్థిక పుష్టితో అంతర్జాతీయ ఆర్థిక, దౌత్య రంగంలోనూ మన దేశ ప్రాధాన్యత పెరుగుతోందన్నారు. ఇటీవల అమెరికా, ఈయూ దేశాలతో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలే ఇందుకు నిదర్శనమని అంబానీ తెలిపారు.
ఇది భారత యుగం
బ్లాక్‌రాక్ సీఈఓ లారీ
అంబానీతో కలిసి ఈ సమావేశంలో పాల్గొన్న బ్లాక్‌రాక్ సీఈఓ లారీ ఫింక్ ప్రస్తుతం నడుస్తోంది భారత యుగమన్నారు. మరో 20-25 సంవత్సరాల వరకు దీనికి తిరుగు లేదన్నారు. వచ్చే పదేళ్లలో భారత జీడీపీ వృద్ధి రేటు ఏటా 8 నుంచి 10 శాతం వరకు ఉంటుందని తెలిపారు. దీంతో పెట్టుబడులపై మంచి రాబడులు ఆశించే మదుపరులు ఎవరూ భారత్‌ను నిర్లక్ష్యం చేయలేరన్నారు. రిటైర్ అయిన వారి పెట్టుబడులతో దేశీయ పెట్టుబడులూ ఇబ్బడిముబ్బడిగా అందుబాటులోకి రావడంతో భారత్‌కు విదేశీ పెట్టుబడుల అవసరం పెద్దగా ఉండదని లారీ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తుర్కియే విమానం ఇంజిన్‌లో మంటలు.. కోల్‌కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
భార్యను చంపేందుకు కుట్ర..! రెండు సార్లు ఫెయిలై.. మూడో ప్రయత్నంలో..
For More National News And Telugu News