Share News

ఇక బ్లాక్‌ ఆయిల్‌ నుంచి డీజిల్‌ తయారీ

ABN , Publish Date - Jan 06 , 2026 | 05:54 AM

విశాఖపట్నంలోని హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) మరో ఘనత సాధించింది. బ్లాక్‌ ఆయిల్‌ నుంచి డీజిల్‌ తయారు చేసే రెసిడ్యూ అప్‌గ్రెడేషన్‌ యూనిట్‌...

ఇక బ్లాక్‌ ఆయిల్‌ నుంచి డీజిల్‌ తయారీ

విశాఖ హెచ్‌పీసీఎల్‌లో ఆర్‌యూఎఫ్‌ యూనిట్‌ ప్రారంభం

విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలోని హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) మరో ఘనత సాధించింది. బ్లాక్‌ ఆయిల్‌ నుంచి డీజిల్‌ తయారు చేసే రెసిడ్యూ అప్‌గ్రెడేషన్‌ యూనిట్‌ (ఆర్‌యూఎ్‌ఫ)ను సోమవారం నాడు ప్రారంభించింది. దీని వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 3.55 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు. దేశంలో తొలి ఆర్‌యూఎఫ్‌ యూనిట్‌ ఇదే కావడం విశేషం. హెచ్‌పీసీఎల్‌ తన రిఫైనింగ్‌ సామర్థ్యాన్ని 8.33 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల నుంచి 15 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు పెంచుకునేందుకు కొద్ది సంవత్సరాల క్రితం రూ.32,000 కోట్లతో విస్తరణ పనులు చేపట్టింది. ఈ పనులన్నీ ఆర్‌యూఎ్‌ఫతో పూర్తయ్యాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న క్రూడాయిల్‌ను రిఫైనరీలో శుద్ధి చేస్తే అందులో 60 శాతం వైట్‌ ఆయిల్స్‌ (పెట్రోల్‌, డీజిల్‌) వస్తాయి. మిగిలిన 40 శాతాన్ని బ్లాక్‌ ఆయిల్స్‌గా వ్యవహరిస్తారు. వాటి నుంచి బిటుమిన్‌, ఫ్యూయల్‌ ఆయిల్స్‌, నౌకలు నడపడానికి ఉపయోగించే ఎల్‌డీఓ వంటివి తయారుచేస్తారు. క్రూడాయిల్‌లో 60 శాతం వైట్‌ ఆయిల్స్‌ పోగా మిగిలిన దానిని రెసిడ్యూగా వ్యవహరిస్తారు. దీన్ని మరింత శుద్ధి చేసి లాభదాయకమైన ఉత్పత్తులు తయారు చేయడానికి ఉద్దేశించినదే ఆర్‌యూఎఫ్‌ ప్రాజెక్ట్‌. దీనికి ఎల్‌సీ-మ్యాక్స్‌ యూనిట్‌గా నామకరణం చేశారు. దేశంలో ఎక్కడా ఇలాంటిది లేదు. ఇదే మొదటిది. దీనిని ఎల్‌ అండ్‌ టీ నిర్మించింది. దీనికి అవసరమైన 2,200 టన్నుల రియాక్టర్‌ను గుజరాత్‌లోని హజీరాలో తయారు చేయించి సముద్ర మార్గంలో బార్జీల ద్వారా విశాఖపట్నం తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ యూనిట్‌ ద్వారా రెసిడ్యూ (బ్లాక్‌ ఆయిల్స్‌) నుంచి కూడా డీజిల్‌ తయారుచేస్తారు. అంటే క్రూడాయిల్‌ నుంచి దాదాపుగా 93 శాతం వైట్‌ ఆయిల్స్‌ తీస్తారు.

ఇవి కూడా చదవండి..

పీఓకే సహా జమ్మూకశ్మీర్‌ మొత్తాన్ని భారత్‌లో కలపాలి.. బ్రిటన్ ఎంపీ బ్లాక్‌మన్

మోదీని కలిసిన యోగి.. ఎజెండా ఏమిటంటే

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 06 , 2026 | 05:54 AM