Share News

బంగారం అమ్మేస్తున్న భారతీయులు!

ABN , Publish Date - Jun 29 , 2026 | 09:34 PM

భవిష్యత్తులో బంగారం ధరలు పడిపోతాయనే భయంతో, తమ వద్ద ఉన్న పాత బంగారు ఆభరణాలను అమ్మి నగదుగా మార్చుకునేందుకు దేశంలోని మధ్యతరగతి కుటుంబాలు ఎగబడుతున్నారు. ఇలా.. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఏకంగా 50 టన్నుల పాత బంగారాన్ని అమ్మేశారు.

బంగారం అమ్మేస్తున్న భారతీయులు!
Gold Prices Fall: Indians Sell Old Jewellery Amid Fears of Further Correction

ఢిల్లీ,జూన్ 29: భవిష్యత్తులో ధరలు పడిపోతాయనే(మార్కెట్ కరెక్షన్)భయంతో, తమ వద్ద ఉన్న పాత బంగారు ఆభరణాలను అమ్మి నగదుగా మార్చుకునేందుకు భారతీయులు.. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎగబడుతున్నారు. దీంతో ఈ మూడునెలల్లో ఏకంగా 43 శాతం మేర పాత బంగారం అమ్మకాలు పెరిగిపోయాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) అందించిన గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారతీయ కుటుంబాలు ఏకంగా 50 టన్నుల పాత బంగారాన్ని విక్రయించాయి. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 43శాతం ఎక్కువ. ఈ వినూత్న ధోరణి కారణంగా దేశంలో పాత బంగారం రీసైక్లింగ్ పరిశ్రమకు ఒక్కసారిగా భారీ డిమాండ్ పెరిగింది.


ఊపందుకున్న 'గోల్డ్ రీసైక్లింగ్' బిజినెస్

ఇళ్లల్లో లేదా బ్యాంక్ లాకర్లలో ఊరికే పడి ఉండే పాత ఆభరణాలు ఇప్పుడు ఫార్మల్ ఎకానమీ (అధికారిక మార్కెట్)లోకి వస్తున్నాయి. ప్రముఖ ముత్తూట్ ఎగ్జిమ్ సంస్థ తమ 100కు పైగా 'గోల్డ్ పాయింట్' నెట్‌వర్క్‌లలో పాత బంగారం వాల్యూమ్ ఏకంగా 40 శాతం పెరిగినట్లు ప్రకటించింది. వినియోగదారులు ఇప్పుడు పాత పద్ధతుల్లో కాకుండా, పారదర్శకమైన అధికారిక ఛానెల్స్ ద్వారా బంగారాన్ని నగదుగా మార్చుకునేందుకు ఇష్టపడుతున్నారని ముత్తూట్ ఎగ్జిమ్ సీఈఓ కేయూర్ షా తెలిపారు.

గతేడాది 2025లో రీసైకిల్డ్ గోల్డ్ వాటా 125-150 టన్నులుగా ఉంది. ఇదే ట్రెండ్ కొనసాగితే ఈ ఏడాది అది 200-250 టన్నులకు చేరవచ్చని చెబుతున్నారు. భారతీయ కుటుంబాల వద్ద సుమారు 30,000 టన్నుల బంగారం నిల్వలు ఉన్నట్లు అంచనా. ఈ విధంగా అంతర్గతంగానే రీసైక్లింగ్ పెరగడం వల్ల దేశానికి పసిడి దిగుమతుల భారం తగ్గి, విదేశీ మారక ద్రవ్యం ఆదా అయ్యే అవకాశం ఉంటుందని కూడా మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.


కాగా, బంగారం ధరలు ఈ ఏడాది ప్రారంభంలో సరికొత్త రికార్డులను సృష్టించాయి. అయితే ప్రస్తుతం ఎంసీఎక్స్ (MCX) మార్కెట్లో బంగారం ధర సగటున తులం (10 గ్రాములు) రూ. 1,44,199 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది ఆల్‌టైమ్ హై కంటే తక్కువగా ఉండటంతో, భవిష్యత్తులో ధరలు మరింత తగ్గి రూ. 1.2 లక్షల మార్కుకు పడిపోవచ్చనే అంచనాలు మార్కెట్లో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చేతిలో ఉన్న బంగారానికి మంచి విలువ ఉన్నప్పుడే లాభం చేసుకోవాలని (Profit Booking) వినియోగదారులు భావించడం కూడా దీనికి ముఖ్య కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

జైపుర్‌లో విషాదం.. గోడ కూలడంతో ముగ్గురు కార్మికుల మృతి

గ్రామాల అభివృద్ధే వికసిత్ భారత్‌కు పునాది: శివరాజ్‌సింగ్

Updated Date - Jun 29 , 2026 | 09:34 PM