అంతర్జాతీయంగా 24 శాతం పతనమైన బంగారం ధరలు.. భారత్‌లో 20% మాత్రమే తగ్గడానికి కారణాలేంటి..
ABN , Publish Date - Nov 08 , 2026 | 10:48 AM
బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో సరికొత్త గరిష్ఠాలను తాకిన పసిడి.. ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు 24 శాతం పతనమైంది.
ఇంటర్నెట్ డెస్క్: బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో సరికొత్త గరిష్ఠాలను తాకిన పసిడి.. ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు 24 శాతం పతనమైంది. అయితే భారత్‌లో మాత్రం ధరల తగ్గుదల 20 శాతానికే పరిమితమైంది. ప్రపంచ మార్కెట్‌తో పోలిస్తే మన దేశంలో బంగారం ధరలు తక్కువగా పడటానికి కారణమేంటి? దిగుమతి సుంకాల పెంపు, రూపాయి విలువలో మార్పులు, దేశీయ మార్కెట్లో గతంలో ఉన్న అదనపు ప్రీమియం వంటి అంశాలు ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు (Gold Price Crash 2026).
2026 జనవరి 29న అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 5,379 డాలర్ల రికార్డు స్థాయికి చేరింది. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడి పెరగడంతో ధరలు క్రమంగా దిగివచ్చాయి. నవంబర్ 6న ట్రేడింగ్ ముగిసే సమయానికి ఔన్సు బంగారం ధర 4,068.71 డాలర్లకు పడిపోయింది. జనవరి గరిష్ఠంతో పోలిస్తే ఇది దాదాపు 24 శాతం తక్కువ. భారత్‌లోనూ బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. జనవరి నెలతో పోల్చుకుంటే దేశీయ మార్కెట్లో ధరలు సుమారు 20 శాతం తగ్గాయి (Gold Price India).
భారత్‌లో బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్‌తో పోలిస్తే తక్కువగా తగ్గడానికి ప్రధాన కారణాల్లో దిగుమతి సుంకం పెంపు ఒకటి. జనవరిలో బంగారం దిగుమతులపై 6 శాతం సుంకం ఉండేది. అయితే మే 13న కేంద్ర ప్రభుత్వం దీనిని 15 శాతానికి పెంచింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినా, దిగుమతి సుంకం పెరగడం వల్ల దేశీయ మార్కెట్లో ఆ ప్రభావం కొంత మేర తగ్గింది (Gold Import Duty India).

బంగారం ధరను అంతర్జాతీయంగా అమెరికన్ డాలర్లలో నిర్ణయిస్తారు. భారత్ ఇతర దేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. అందువల్ల రూపాయి విలువ తగ్గితే దేశీయంగా బంగారం కొనుగోలు ఖర్చు పెరుగుతుంది. జనవరి గరిష్ఠంతో పోలిస్తే రూపాయి విలువ ఇప్పటికీ దాదాపు 2 శాతం తక్కువగానే ఉంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పడిపోయినా, భారత్‌లో ఆ తగ్గుదల పూర్తిస్థాయిలో కనిపించలేదు (Gold Price Correction).
ఏదేమైనా అంతర్జాతీయ మార్కెట్‌తో పోలిస్తే భారత్‌లో బంగారం ధరలు తక్కువగా తగ్గినప్పటికీ, కొనుగోలుదారులకు మాత్రం పసిడి చౌకగా మారిందని చెప్పలేం. గత ఏడాది ధంతేరాస్ సందర్భంగా ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,400గా ఉండేది. ప్రస్తుతం రూ.1,46,300గా ఉంది. అంటే ఏడాదితో పోలిస్తే ధరలు ఇంకా దాదాపు 10 శాతం అధికంగానే ఉన్నాయి.
బంగారంతో పాటు వెండి ధరల్లోనూ భారీ తగ్గుదల కనిపిస్తోంది (Silver Price Crash). అంతర్జాతీయ మార్కెట్లో జనవరి గరిష్ఠమైన ఔన్సుకు 121.64 డాలర్లతో పోలిస్తే నవంబర్ 6 నాటికి వెండి ధర సుమారు 57 శాతం తగ్గి 52 డాలర్ల స్థాయికి చేరింది. భారత్‌లో ఢిల్లీలో కిలో వెండి ధర రూ.4,04,500 గరిష్ఠ స్థాయి నుంచి రూ.1,92,500కు పడిపోయింది. అంటే దేశీయ మార్కెట్లోనూ సుమారు 52 శాతం తగ్గింది. వెండి దిగుమతులపై కూడా మే నెలలో దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచారు. అంతేకాకుండా చాలా వెండి కడ్డీల దిగుమతులను పరిమితుల కేటగిరీలోకి తీసుకొచ్చారు.
ఇవి కూడా చదవండి..
మైదానంలోకి ప్లాస్టిక్ బ్యాట్ విసిరిన అభిమాని.. విరాట్ కోహ్లీ ఏం చేశాడో చూడండి..
స్థిరంగా పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..