జనవరి 26న దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల నిరసన
ABN , Publish Date - Jan 25 , 2026 | 05:10 PM
గిగ్ కార్మికుల న్యాయమైన డిమాండ్లు నిరవేర్చాలంటూ జనవరి 26న దేశవ్యాప్తంగా నిరసన చేపట్టనున్నట్లు గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ ప్రకటించింది. గిగ్ వర్కర్లను అధికారికంగా కార్మికులుగా గుర్తించడంతో పాటు సెంట్రల్ గిగ్ చట్టం తీసుకురావాలన్న డిమాండ్‌తో ఈ ఉద్యమం చేపట్టనున్నట్లు తెలిపింది.
ముంబై: గిగ్, ప్లాట్‌ఫామ్ రంగాల్లో కార్మికులపై జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా జనవరి 26న దేశవ్యాప్తంగా నిరసన చేపట్టనున్నట్లు గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ (GIPSWU) ప్రకటించింది. గిగ్ వర్కర్లను అధికారికంగా కార్మికులుగా గుర్తించడంతోపాటు సెంట్రల్ గిగ్ చట్టం తీసుకురావాలన్న డిమాండ్‌తో ఈ నిరసన చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ నిరసనలో భాగంగా రైడ్ హైలింగ్, ఆహార, కిరాణ వస్తువుల డెలివరీ, గృహ సేవలు, బ్యూటీ–వెల్‌నెస్, లాజిస్టిక్స్, ఈ-కామర్స్, డిజిటల్ సేవల రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు తమ యాప్‌లను పూర్తిగా ఆఫ్ చేసి నిరసన తెలపాలని యూనియన్ పిలుపునిచ్చింది. తమ డిమాండ్లపై సానుకూల నిర్ణయం రాకపోతే ఫిబ్రవరి 3న మరోసారి దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నట్లు వెల్లడించింది.
గిగ్ కార్మికులు తీవ్ర అనిశ్చితి, ఆదాయ భద్రతా లేమి, పారదర్శకతలేని రేటింగ్ వ్యవస్థలు, అకారణంగా ఐడీలు బ్లాక్ చేయడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని GIPSWU ఆరోపించింది. కార్మికులతో సంప్రదింపులు లేకుండానే కంపెనీలు పని విధానాల్లో మార్పులు చేస్తున్నాయని పేర్కొంది. ప్రత్యేకంగా మహిళా కార్మికులకు భద్రత, చట్టపరమైన రక్షణ, గౌరవం లేకపోవడంతో మరింత ఇబ్బందులు పడుతున్నారని యూనియన్ జాతీయ అధ్యక్షురాలు సీమా సింగ్ తెలిపారు. న్యాయమైన వేతనం, పలు సందర్భాల్లో వినియోగదారుల నుంచి దాడులు ఎదురవుతున్నాయని, వాటిపై ఫిర్యాదు చేసినా ఏఐ ఆధారిత వ్యవస్థల వల్ల సకాలంలో స్పందన రావడం లేదని ఆమె పేర్కొన్నారు. ఫలితంగా మహిళా కార్మికుల ఐడీలు బ్లాక్ చేసి జీవనాధారాన్ని కోల్పోయే పరిస్థితులు నెలకొంటున్నాయని సీమా సింగ్ ఆరోపించారు.
ప్రస్తుతం గిగ్ కార్మికుల పరిస్థితులు రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కులకు విరుద్ధంగా ఉన్నాయని యూనియన్ అభిప్రాయపడింది. ఒక ఈ-కామర్స్ సంస్థ ప్రతి నెలా 5 వేల మందికి పైగా కార్మికులను తొలగిస్తున్నామని చేసిన ప్రకటనను GIPSW యూనియన్ ఉదాహరణగా చూపింది. ఈ సమస్యలపై కేంద్ర ప్రభుత్వానికి, కార్మికశాఖకు ఎన్నిసార్లు వినతులు సమర్పించినా స్పందన లేదని గిగ్ యూనియన్ పేర్కొంది. 10 నిమిషాల డెలివరీ వ్యవస్థను నిలిపివేస్తామని గతంలో కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ హామీ ఇచ్చినప్పటికీ, నేటికి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు విడుదల కాలేదని పేర్కొంది. ఇది గిగ్ కార్మికుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదనడానికి సంకేతమని GIPSWU జాతీయ సమన్వయకర్త నిర్మల్ గోరానా విమర్శించారు.
ఇవి కూడా చదవండి:
ఐసీసీ చురకలు.. టీ20 ప్రపంచ కప్‌నకు జట్టును ప్రకటించిన పాకిస్తాన్
సంజూ ఇప్పటికే చాలా ఒత్తిడిలో ఉన్నాడు: టీమిండియా మాజీ క్రికెటర్