సంక్షోభంలో ఉన్న వ్యాపారాలకు కేంద్రం అండ.. రూ. 2.55 లక్షల కోట్ల రుణాలకు గ్రీన్ సిగ్నల్!
ABN , Publish Date - May 05 , 2026 | 10:09 PM
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యాపార సంస్థలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ECLGS 5.0 పథకానికి ఆమోదం తెలుపుతూ, దాదాపు రూ. 2.55 లక్షల కోట్ల రుణ పరపతిని కల్పించాలని నిర్ణయించింది.
న్యూఢిల్లీ, మే 5: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యాపార సంస్థలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. మంగళవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ECLGS 5.0 (ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్) పథకానికి ఆమోదం తెలిపారు. దీని ద్వారా దాదాపు రూ. 2.55 లక్షల కోట్ల అదనపు రుణ పరపతిని కల్పించాలని నిర్ణయించారు.
ఎయిర్‌లైన్ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత
అంతర్జాతీయ పరిణామాల వల్ల విమాన ఇంధన ధరలు విపరీతంగా పెరగడం, విదేశీ సర్వీసులు దెబ్బతినడంతో నష్టపోతున్న ఎయిర్‌లైన్ కంపెనీలకు ఈ పథకం ద్వారా పెద్ద ఊరట లభించనుంది. మొత్తం నిధులలో రూ. 5,000 కోట్లను విమానయాన రంగం కోసం ప్రత్యేకంగా కేటాయించారు.
లిక్విడిటీ సమస్యలకు చెక్
ముడి చమురు ధరల పెరుగుదల, గ్లోబల్ సప్లై చైన్ అంతరాయాల వల్ల నగదు కొరత (Liquidity crunch) ఎదుర్కొంటున్న చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSME) ఇది సంజీవనిలా మారనుంది. ఈ రుణాల కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 18,100 కోట్లను గ్యారంటీగా కేటాయించింది. ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడం వల్ల బ్యాంకులు ఎటువంటి భయం లేకుండా వ్యాపారాలకు సులభంగా రుణాలు మంజూరు చేస్తాయి. పశ్చిమాసియా సంక్షోభం వంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశీయ వ్యాపారాలు కుప్పకూలకుండా చూసేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం 7న