Share News

రాష్ట్రాలకు కేంద్రం 10 శాతం అదనపు కమర్షియల్ ఎల్‌పీజీ

ABN , Publish Date - Mar 18 , 2026 | 06:06 PM

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా మరో 10 శాతం కమర్షియల్ ఎల్‌పీజీ అందించేందుకు కేంద్రం అంగీకరించింది. అయితే ఎల్‌పీజీ భారాన్ని తగ్గించి పైప్డ్ నేచురల్ గ్యాస్ వాడకాన్ని పెంచే రాష్ట్రాలకు మాత్రమే ఈ అదనపు సరఫరా వర్తిస్తుందని తెలిపింది.

రాష్ట్రాలకు కేంద్రం 10 శాతం అదనపు కమర్షియల్ ఎల్‌పీజీ
Commercial LPG

న్యూఢిల్లీ: ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా దేశంలో తలెత్తిన ఎల్‌పీజీ (LPG) కొరతను అధిగమించేందుకు కేంద్రం మరో కీలక ప్రకటన చేసింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా మరో 10 శాతం కమర్షియల్ ఎల్‌పీజీ అందించేందుకు అంగీకరించింది. అయితే ఎల్‌పీజీ భారాన్ని తగ్గించి పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వాడకాన్ని పెంచే రాష్ట్రాలకు మాత్రమే ఈ అదనపు సరఫరా వర్తిస్తుందని తెలిపింది. ఆ ప్రకారం ఎల్పీజీ నుంచి పీఎన్‌జీకి మారేలా రాష్ట్రాలు ప్రోత్సహించడం, మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం చేయాల్సి ఉంటుంది. దేశీయ వంటగ్యాస్ సరఫరాకు ఆటకం కలగకుండా చూడటం, వాణిజ్య అవసరాల కోసం గ్యాస్ కొరత తీర్చడం ప్రభుత్వ ముఖ్యోద్దేశమని పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు.


సీజీడీ అప్లికేషన్ల అప్రూవల్, సమస్యల పరిష్కారానికి రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేసినట్లయితే 1 శాతం అదనపు కేటాయింపులు జరుపుతామని, డీమ్డ్ సీజీడీ పర్మిషన్లు ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేస్తే 2 శాతం, రోడ్ల తవ్వకం, మరమ్మతు (డిగ్ అండ్ రిస్టోర్) పథకం ప్రవేశపెడితే 3 శాతం, వార్షిక రెంటల్‌/లీజ్ ‌తగ్గిస్తే 4 శాతం అదనపు కేటాయింపులు జరుపుతామని ఆమె చెప్పారు.


ఆందోళనకరమే అయినా..

ఎల్‌పీజీ అంశం ఇంకా ఆందోళనకరంగానే ఉన్నప్పటికే ఆన్‌లైన్ బుకింగ్ పరిస్థితి మెరుగుపడిందని సుజాత శర్మ తెలిపారు. ఈనెల 17న 2,300కు పైగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్టు చెప్పారు. చాలా రాష్ట్రాలు ఇప్పటికే స్టేట్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కాగా, ఎల్పీజీ సరఫరాలపై ఒత్తిడిని తగ్గించేందుకు హాస్పిటాలిటీ, రెస్టారెంట్లతో సహా పలు రంగాలకు కిరోసిన్, బొగ్గు సరఫరాలకు కేంద్రం ఇప్పటికే ఆదేశాలిచ్చింది.


ఇవి కూడా చదవండి..

జియో కీలక ప్రకటన.. రోమింగ్ ప్యాక్ లేకున్నా ఓటీపీలు

సూచీలకు వరుసగా మూడో రోజూ లాభాలే.. రూపాయి భారీ పతనం..

Updated Date - Mar 18 , 2026 | 06:18 PM