Share News

భారత ఆర్థిక వ్యవస్థకు చమురు సెగ

ABN , Publish Date - Sep 09 , 2026 | 04:22 AM

ముడి చమురు ధర మళ్లీ మండుతోంది. భారత్‌ దిగుమతి చేసుకునే బ్యారల్‌ ముడి చమురు సగటు ధర.. గత శుక్రవారం గత ఆరు వారాల్లో ఎన్నడూ లేని విధంగా 101.07 డాలర్లకు చేరింది...

భారత ఆర్థిక వ్యవస్థకు చమురు సెగ

100 డాలర్ల పైన బ్యారల్‌ ధర

  • 56 శాతం పెరిగిన క్రూడ్‌ దిగుమతి బిల్లు

  • 4 నెలల్లోనే రూ.6.01 లక్షల కోట్లు

  • పొంచి ఉన్న ధరల సెగ

న్యూఢిల్లీ: ముడి చమురు ధర మళ్లీ మండుతోంది. భారత్‌ దిగుమతి చేసుకునే బ్యారల్‌ ముడి చమురు సగటు ధర.. గత శుక్రవారం గత ఆరు వారాల్లో ఎన్నడూ లేని విధంగా 101.07 డాలర్లకు చేరింది. మంగళవారం ఇరాన్‌ అనుకూల మిలీషియా హౌతీలు మరోసారి సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై దాడి చేశారు. దీనికి తోడు అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర మరింత సెగలు కక్కుతోంది. దీంతో మంగళవారం బ్యారల్‌ ధర దాదాపు 100 డాలర్లను తాకింది. బ్రెంట్‌ ఫ్యూచర్స్‌ ధర కూడా 2 శాతం పెరిగి 99 డాలర్లకు చేరింది. మరోవైపు యూఎస్‌ వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియెట్‌ క్రూడ్‌ ధర 3 శాతం వృద్ధి చెంది 94 డాలర్లను తాకింది. తాజాగా పశ్చిమాసియా యుద్ధం రోజుకో మలుపు తీసుకుంటుండటంతో భారత చమురు దిగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. చమురు వినియోగం, దిగుమతుల్లో ప్రస్తుతం భారత్‌.. ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. మరోవైపు ఉద్రిక్తతలు ఇలానే కొనసాగితే బ్యారల్‌ ముడి చమురు ధర త్వరలోనే 120 డాలర్లకు చేరుతుందని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ గోల్డ్‌మన్‌ శాక్స్‌ ఇప్పటికే ఒక నివేదికలో హెచ్చరించింది.

భారంగా దిగుమతులు

మన చమురు అవసరాల్లో 88 శాతానికి దిగుమతులే దిక్కు. పశ్చిమాసియా సంక్షోభంతో ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లోనే మన దేశ చమురు దిగుమతుల బిల్లు 6,340 కోట్ల డాలర్లకు (సుమారు రూ.6.01 లక్షల కోట్లు) చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 56 శాతం ఎక్కువ.

బ్యారల్‌ ముడి చమురు ధర 10 డాలర్లు పెరిగితే మన దిగుమతుల బిల్లు 1,200 కోట్ల డాలర్ల నుంచి 1,500 కోట్ల డాలర్ల (సుమారు రూ.1.13 లక్షల కోట్ల నుంచి రూ.1.42 లక్షల కోట్లు) మేర పెరుగుతుందని అంచనా.


నష్టాల్లో ఓఎంసీలు

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు (ఓఎంసీ) అల్లాడి పోతున్నాయి. నాలుగు విడతలుగా లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.7.35, డీజిల్‌ ధర రూ.7.53 చొప్పున పెంచాయి. అయినా ఈ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (క్యూ1)లో రూ.18,150 కోట్ల నష్టాలు మూటగట్టుకున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో నష్టాల ఖాతా మరింత పెరగనుంది. దీనికి తోడు చమురు దిగుమతుల బిల్లు మరింత పెరిగి మూలధన ఖాతా లోటు (సీఏడీ) అదుపు తప్పడం, డాలర్‌తో రూపాయి మారకం రేటు మళ్లీ బక్కచిక్కే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఇవన్నీ ఒకెత్తయితే పొంచి ఉన్న ద్రవ్యోల్బణం ఆమ్‌ ఆద్మీని మరింత కాటేసే ప్రమాదం కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

గిల్‌పై ప్రతీకారం తీర్చుకున్న అభిషేక్ శర్మ.. వీడియో వైరల్!

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్.. వాషింగ్టన్ సుందర్ ఫిట్

Updated Date - Sep 09 , 2026 | 04:23 AM