Share News

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. మదుపర్లకు బ్లాక్ డేగా బడ్జెట్ డే.!

ABN , Publish Date - Feb 01 , 2026 | 04:25 PM

కేంద్రం.. బడ్జెట్ ప్రవేశపెట్టిన చారిత్రాత్మక ఆదివారం నాడు మదుపర్లకు భారీ షాక్‌నిచ్చాయి స్టాక్ మార్కెట్లు. నేడు ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు.. బడ్జెట్ ప్రసంగం ముగిసేసరికి ఇన్వెస్టర్లు ఒక్కసారిగా అమ్మకాలకు మొగ్గుచూపడంతో భారీ నష్టాలను చవిచూశాయి. దీంతో మదుపర్లకు బ్లాక్ సండే అయింది.

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. మదుపర్లకు బ్లాక్ డేగా బడ్జెట్ డే.!
Stock Market Crash

ఇంటర్నెట్‌ డెస్క్‌: బడ్జెట్ వేళ.. దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. కేంద్రం.. బడ్జెట్ 2026 ప్రవేశపెట్టిన ఈ చారిత్రాత్మక ఆదివారం నాడు భారత స్టాక్ మార్కెట్లు భారీ అస్థిరతకు లోనయ్యాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ.. బడ్జెట్ ప్రసంగం ముగిసే సమయానికి ఇన్వెస్టర్లు ఒక్కసారిగా అమ్మకాలకు మొగ్గు చూపడంతో మార్కెట్లు ఒక్కసారిగా నేలకు దిగాయి. నూతన బడ్జెట్‌లో కంపెనీల బైబ్యాక్‌పై పన్ను విధించడం సహా ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌పై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌ను పెంచడం మార్కెట్ల పతనానికి కారణమైంది.

ఒకానొక దశలో 2400 పాయింట్లకు పైగా పతనమై 80వేల దిగువకు చేరిన సెన్సెక్స్.. చివరకు 1546 పాయింట్లు పతనమై 80,722 వద్ద స్థిరపడింది. 495 పాయింట్ల భారీ నష్టాన్ని చవిచూసిన నిఫ్టీ.. 24,119 వద్ద ముగిసింది. బడ్జెట్‌ నేపథ్యంలో ఆదివారం అయినప్పటికీ పనిచేసిన మార్కెట్లు.. మదుపర్లకు బ్లాక్‌సండేను మిగిల్చాయి. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజున సెన్సెక్స్, నిఫ్టీలు ఇంత భారీ స్థాయిలో పతనమవడం గత ఆరేళ్లలో ఇదే తొలిసారి. బడ్జెట్‌ ప్రసంంగానికి ముందు ఫ్లాట్‌గా ట్రేడైన సూచీలు.. మధ్యలో సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌(ఎస్‌టీటీ) ప్రస్తావన రావడంతో మెల్లగా నష్టాల్లోకి జారుకున్నాయి. తాజా బడ్జెట్‌లో ఎస్‌టీటీని 0.02 నుంచి 0.05 శాతానికి పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది.


ఎస్‌టీటీని పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించడంతో బ్రోకరేజీ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో 18 శాతం వరకు ఆయా కంపెనీల షేర్లు ఒక్కసారిగా పతనమయ్యాయి. బీఎస్‌ఈలో మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీ షేర్లు 18.08 శాతం మేర పడిపోయి.. రూ.2,068కి చేరింది. గ్రో మాతృ సంస్థ బిలియన్‌ బ్రెయిన్‌ గ్యారెజీ వెంచర్స్‌ షేర్లు 13 శాతం మేర క్షీణించి రూ.154కు చేరాయి. ఐఐఎఫ్‌ఎల్‌ క్యాపిటల్‌ 10.4 శాతం పతనమై రూ.296.10కి చేరింది. ఏంజెల్‌ వన్‌ స్టాక్‌ కూడా 11.84 శాతం మేర నష్టపోయి రూ.2,237.95కి పడిపోయాయి.

నష్టాలకు ప్రధాన కారణాలివే..

  • ఎస్‌టీటీ పెంపు: ఫ్యూచర్స్ ట్రేడింగ్‌పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్(STT)ను 0.05 శాతానికి పెంచడం ట్రేడర్లలో నిరాశ కలిగించింది.

  • పన్ను శ్లాబుల్లో మార్పు లేకపోవడం: మధ్యతరగతి ప్రజలు, వేతన జీవులు ఆశించిన విధంగా ఆదాయపు పన్ను శ్లాబుల్లో ఎటువంటి ఊరట లభించకపోవడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

  • ప్రాఫిట్ బుకింగ్: బడ్జెట్‌కు ముందు కొన్ని రోజులుగా మార్కెట్లు పెరగడంతో, కీలక నిర్ణయాల తర్వాత ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించడానికి (Profit Booking) ప్రాధాన్యత ఇచ్చారు.


జోరందకున్న విమర్శలు..

కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026పై పలువురు ఆర్థిక నిపుణులు స్పందించారు. ఈ పద్దులో కాలయాపన తప్ప ఏమీ లేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ బడ్జెట్‌పై భారీ అంచానాలను పెట్టుకున్న వ్యాపారవేత్తలు సహా సామాన్యులూ నిర్మలమ్మ పెదవి విరిచారు. ముఖ్యంగా వ్యక్తిగత ఆదాయం కలిగినవారికి పన్నుల నుంచి ఉపశమనం లభిస్తుందని భావించిన వేతన జీవులకు నిరాశే మిగలడం విమర్శలకు తావిచ్చింది.


ఇవీ చదవండి:

బడ్జెట్ 2026: ఏ రంగానికి ఎంత కేటాయింపులు చేశారంటే..

నిర్మలమ్మ బడ్జెట్‌.. క్రీడా వస్తువుల తయారీకి ప్రత్యేక పథకం

Updated Date - Feb 01 , 2026 | 05:02 PM