పదేళ్లలో బడ్జెట్ ప్రాధాన్యాలు ఎలా ఉన్నాయి? ఈసారి మార్పులేమైనా ఉంటాయా?
ABN , Publish Date - Jan 31 , 2026 | 05:02 PM
యూనియన్ బడ్జెట్ 2026-27 మీదే ప్రస్తుతం అందరి దృష్టీ నెలకొంది. ఈసారి బడ్జెట్‌లో ఏయే అంశాలకు అధిక ప్రాధాన్యం ఇస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. మరి ఈ నేపథ్యంలో గత పదేళ్లుగా పద్దు ప్రాధాన్యాలు ఎలా ఉన్నాయి? వాటిలో వచ్చిన మార్పులేమిటి? ప్రస్తుత పద్దు విధానం ఎలా ఉండనుందనే విషయాలను ఓసారి పరిశీలిస్తే...
ఇంటర్నెట్ డెస్క్: ఫిబ్రవరి 1.. ఆదివారం నాడు కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్.. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో వరుసగా తొమ్మిదో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. స్వాతంత్ర్యానంతరం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా గత పదేళ్లలో బడ్జెట్ ప్రాధాన్యాల్లో భారీ మార్పులొచ్చాయి. తొలి దశలో అనగా 2016 కాలంలో సంక్షేమ పథకాలు, గ్రామీణ అభివృద్ధి ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ఆ తర్వాత రక్షణ, తయారీ రంగం, క్యాపిటల్ వ్యయం, మౌలిక వసతులు వంటి వాటివైపు ప్రభుత్వం దృష్టి సారించింది. ఇక కరోనా తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోగా.. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేదిశగా ఖర్చులను పెంచింది ప్రభుత్వం. దీంతో గత ఐదేళ్లలో వ్యయానికి అధిక ప్రాధాన్యమిచ్చింది. వీటిలో రోడ్లు, రైల్వేలు, ఎయిర్‌పోర్టులు, డిఫెన్స్, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొదలగు రంగాలకు కేటాయింపులు పెద్దఎత్తున పెరిగాయి. మరోవైపు సంక్షేమ పథకాలు సహా సబ్సీడీపై ఖర్చులను నెమ్మదిగా నియంత్రించింది ప్రభుత్వం.
పదేళ్లలో ఎక్కువగా ఖర్చులు పెరిగిన రంగాల్లో మౌలిక వసతులు, రక్షణ, రైల్వే, హైవేలు ఉన్నాయి. కేంద్రం.. క్యాపిటల్ వ్యయాన్ని భారీగా పెంచడంతో 2016లో సుమారు రూ.4 లక్షల కోట్లు ఉండగా.. 2025 నాటికి అది రూ.11 లక్షల కోట్లకు చేరింది. ఇది కేంద్ర పద్దు చరిత్రలోనే అతిపెద్ద మార్పు. రక్షణ రంగంలో బడ్జెట్ ఖర్చులు పెరిగినప్పటికీ.. మూలధన వ్యయం మాత్రం తక్కువగానే కొనసాగుతోంది. రైల్వేలు, రోడ్లకు భారీగా నిధులు కేటాయించడం ద్వారా ఉపాధి కల్పన, ప్రాంతీయ అభివృద్ధి లక్ష్యంగా నిర్దేశించుకుంది కేంద్రం. డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఎకోసిస్టమ్, స్పేస్ రంగాలకు గతంతో పోలిస్తే అధిక ప్రాధాన్యం కల్పించింది. ఇక.. ఆరోగ్యం, విద్య వంటి రంగాల్లో బడ్జెట్ మొత్తం పెరుగుతున్నా.. జీడీపీ వాటాలో మాత్రం పెద్దగా మార్పుల్లేవు. వ్యవసాయ రంగానికి సంబంధించిన కేటాయింపులూ స్థిరంగానే ఉన్నాయి. సబ్సిడీల విషయంలో ప్రభుత్వం క్రమంగా భారం తగ్గించేందుకు యత్నించింది. దీంతో కొన్ని సంక్షేమ పథకాలు కాగితాలకే పరిమితమం అవుతున్నాయన్న విమర్శలు సైతం జోరందుకున్నాయి.
ప్రాజెక్ట్‌ల మాటేంటి?
పద్దులో ప్రాజెక్ట్‌లకు నిధులు కేటాయించినంత మాత్రాన వాటి పనుల్లో పురోగతి ఉండదు. భూసేకరణ సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ లోపం, టెండర్ల ఆలస్యం, కోర్టు కేసులు తదితర అంశాలు ప్రాజెక్టులకు ఆటంకాలుగా మారుతున్నాయి. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం కేంద్రం నిధులను విడుదల చేసినా.. వాటిని సక్రమంగా వినియోగించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. దీంతో ఇది పెద్ద సమస్యగా మారింది. కొన్ని సందర్భాల్లో శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగానూ నిధులు వెనక్కి వెళ్లిపోతున్నాయి.
నిజంగానే వెనక్కి వెళ్తున్నాయా?
బడ్జెట్ కేటాయింపులు పెరిగినా, వినియోగం మాత్రం అనుకున్నంత స్థాయిలో జరగడం లేదనే విషయం గణాంకాల ఆధారంగా స్పష్టమవుతోంది. మూలధన వ్యయ ప్రాజెక్టుల్లో లాస్ట్ మైల్ ఎగ్జిక్యూషన్ బలహీనంగా ఉందని పలువురు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. కొన్ని పథకాలు ప్రకటనలకే పరిమితం కాగా.. మరికొన్నింటి పనులు క్షేత్రస్థాయిలో నెమ్మదిగా అమలవుతున్నాయి. పాలసీ డిజైన్ సమస్య కంటే అమలు యంత్రాంగంలోని లోపాల వల్లే ఇలా జరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హామీల అమలకు ఆలస్యమెందుకు?
ప్రతీ పద్దులో ఇటీవల పెద్ద పెద్ద హామీలు ఇస్తున్నారు. కానీ వాటి అమలు మాత్రం సుదీర్ఘ కాలం పాటు సాగడం సర్వసాధారణమైపోయింది. ఆర్థిక పరిమితులు, ఎన్నికల షెడ్యూల్, విధాన మార్పులు, అంతర్జాతీయ పరిణామాలు వంటివి వీటికి ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. కొన్ని పథకాలు పైలట్ ప్రాజెక్టులకే పరిమితమవుతుండగా.. మరికొన్ని పూర్తి స్థాయి అమలుకు సరైన ప్రణాళిక లేకపోవడం వంటివి జాప్యానికి కారణాలుగా నిలుస్తున్నాయి.
2026-27 బడ్జెట్ మాటేంటి?
గత పరిస్థితులు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈసారి కేంద్ర పద్దులో ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. మొత్తంగా బడ్జెట్ పరిమాణం పెరిగినా సంక్షేమం కంటే అభివృద్ధి వ్యయానికే అధిక ప్రాధాన్యం దక్కనుంది. క్యాపిటల్ వ్యయం పెంపు, రక్షణ రంగంలో మూలధన వ్యయాన్ని 30 శాతానికి పైగా పెంచడం సహా ఎప్పటిలాగే మౌలిక వసతులపై దృష్టి సారించడం వంటివి ప్రధాన లక్ష్యంగా ఉండే అవకాశముంది. ఈ బడ్జెట్‌లో కొత్త హామీల కన్నా.. గతంలో ప్రకటించిన పథకాలను వేగంగా అమలు చేయడంపైనే ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తుందనే అంచనాలున్నాయి. మొత్తంగా 2026-27 పద్దు.. 'ప్రకటనల బడ్జెట్' నుంచి 'అమలు బడ్జెట్' వైపు అడుగులు వేయనుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇవీ చదవండి:
బడ్జెట్ 2026: ఆదివారం రోజే ఎందుకు? ఆ రోజు స్టాక్ మార్కెట్ల పరిస్థితి ఏంటి.?
బడ్జెట్ 2026: కేంద్ర విత్త మంత్రి మరో ఘనత సాధిస్తారా.?