వచ్చే బడ్జెట్లో బంగారం కొనుగోళ్ల మీద పాన్-ఆధార్ పరిమితి పెంచే అవకాశం ఉందా?
ABN , Publish Date - Jan 30 , 2026 | 07:10 AM
బంగారం కొనుగోళ్లకు సంబంధించి వచ్చే బడ్జెట్‌లో పాన్-ఆధార్ పరిమితి పెంచాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో చిన్న మొత్తంలో నగలు కొన్నా రూ. 2 లక్షల మార్కును దాటేస్తున్నాయి.
ఆంధ్రజ్యోతి, జనవరి 30: ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒక గ్రాము బంగారం ధర సుమారు రూ.16,395 వరకు చేరుకుంది. 2016 జనవరి నుంచి అమలులో ఉన్న నిబంధన ప్రకారం, ఒకే ట్రాన్సాక్షన్‌లో రూ. 2లక్షల కంటే ఎక్కువ విలువైన బంగారు ఆభరణాలు, బంగారు బిస్కెట్లు కొనుగోలు చేస్తే జ్యువెలరీ షాప్ దగ్గర తప్పనిసరిగా PAN కార్డు లేదా ఆధార్ కార్డు వివరాలు ఇవ్వాలి. ఇది ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్ (Section 139A & Rule 114B) కిందకి వస్తుంది.
ఈ నిబంధన ఉద్దేశం నల్లధనాన్ని అరికట్టడం, భారీ ట్రాన్సాక్షన్లపై నిఘా ఉంచడం. కానీ ఇప్పుడు బంగారం ధరలు భారీగా పెరిగినందున, చిన్న మొత్తంలో నగలు (ఉదా: 10-15 గ్రాములు) కొన్నా సులభంగా రూ.2లక్షల మార్కును దాటేస్తున్నాయి. దీంతో సామాన్యులు కూడా అనవసరంగా ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ రాడార్‌లోకి వస్తున్నారు.
ఇది కేవలం ధర పెరగడం వల్లే జరుగుతోంది. కొనుగోలు పరిమాణం పెరగడం వల్ల కాదు. ఈ నేపథ్యంలో ట్యాక్స్ నిపుణులు, జ్యువెలరీ అసోసియేషన్లు (జెమ్ అండ్ జ్యువెలరీ కౌన్సిల్ వంటివి) బడ్జెట్ 2026లో ఈ రూ.2లక్షల థ్రెషోల్డ్(పరిమితి)ని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిని కనీసం రూ.5లక్షలు వరకు పెంచాలని సూచనలు వస్తున్నాయి. లేదా బంగారం ధరలకు అనుగుణంగా ఈ లిమిట్‌ను ఎప్పటికప్పుడు సర్దుబాటు చేయాలని ప్రతిపాదనలు వస్తున్నాయి.
ఇలా చేయడం వల్ల మధ్యతరగతి కుటుంబాలకు ఊరట లభిస్తుంది. PAN భయం లేకుండా నగలు కొనవచ్చు. జ్యువెలరీ షాపులకు సంబంధించి రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు తక్కువ పేపర్ వర్క్, సమయం ఆదా అవుతుంది. అంతేకాదు, ప్రభుత్వం నిజంగా భారీ మొత్తాల్లో ట్రాన్సాక్షన్లు చేసేవారిని మాత్రమే ట్రాక్ చేయగలదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
అజిత్ పవార్ విమాన ప్రమాదం.. కాక్ పిట్‌లో చివరి మాటలివే..
భారీ నష్టాల నుంచి లాభాల వైపు.. చివర్లో కోలుకున్న దేశీయ సూచీలు