Share News

ఏరా.. నేను నిలబెడితే..నువ్వు తప్పుకొంటావా!?

ABN , Publish Date - Oct 25 , 2026 | 05:39 AM

‘‘ఏరా.. నేను ఎంపీటీసీ అభ్యర్థిగా నిన్ను నిలబెడితే.. నువ్వు తప్పుకుంటావా!. ఎంత ధైర్యం. మీ గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకున్నారని చెప్పి.. నా మాటే కాదంటావా.’’ అంటూ వైసీపీ నాయకుడిని అదే పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చెప్పుతో కొట్టారు.

ఏరా.. నేను నిలబెడితే..నువ్వు తప్పుకొంటావా!?

వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిని చెప్పుతో కొట్టిన జక్కంపూడి

బుచ్చింపేట ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవం కావడంపై ఆగ్రహం

రాజమహేంద్రవరం/కోరుకొండ, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): ‘‘ఏరా.. నేను ఎంపీటీసీ అభ్యర్థిగా నిన్ను నిలబెడితే.. నువ్వు తప్పుకుంటావా!. ఎంత ధైర్యం. మీ గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకున్నారని చెప్పి.. నా మాటే కాదంటావా.’’ అంటూ వైసీపీ నాయకుడిని అదే పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చెప్పుతో కొట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బుచ్చింపేటలో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరగడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బుచ్చింపేటలో ఎంపీటీసీ అభ్యర్థిగా వైసీపీ తరఫున అనపర్తి మణికంఠ నామినేషన్‌ దాఖలు చేశారు.

శుక్రవారం రాత్రి గ్రామపెద్దలు ఎంపీటీసీ పదవిని ఏకగ్రీవం చేసుకోవాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా జనసేనకు చెందిన వెంకటేశ్వరరావుకు అవకాశం ఇవ్వాలని భావించారు. ఇరుపార్టీలకు చెందిన గ్రామనాయకుల సమక్షంలో ఒప్పందం జరిగింది. దీంతో మణికంఠ పోటీ నుంచి తప్పుకొనేందుకు అంగీకరించారు. ఈ సమాచారం తెలియడంతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆగ్రహంతో ఊగిపోయారు. పది వాహనాల్లో అర్ధరాత్రి వేళ గ్రామానికి చేరుకున్నారు. ఇంటి వద్ద ఉన్న మణికంఠను బస్టాండ్‌ సెంటర్‌కి పిలిపించారు. ‘ఏరా? ఏంటిది?.’ అని రాజా ప్రశ్నించగా.. గ్రామ పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని, తాను వైసీపీ తరఫున పోటీలో ఉండలేనని మణికంఠ చెప్పారు.


దీంతో బూతుల దండకం మొదలుపెట్టిన రాజా.. చెప్పు తీసుకొని మణికంఠను కొట్టారు. రాజా అనుచరులు సైతం ఆయనపై దాడి చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న గ్రామానికి చెందిన యువత మణికంఠను అతికష్టంపై తీసుకెళ్లడంతో ప్రాణాలు దక్కాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బొడ్డు వెంకట రమణ చౌదరి గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్తులు, బాధితుడితో మాట్లాడి ధైర్యం చెప్పారు. శాంతి భద్రతలు అదుపులో ఉంచాలని పోలీసులకు సూచించారు. అయితే, బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా వైసీపీ కార్యకర్తలు, నాయకులు మణికంఠను ఇంట్లోనే బంధించారు. వీఆర్వో ఫిర్యాదుతో రాజాతో పాటు మరికొందరిపై కేసు నమోదైంది. గ్రామంలో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు.

అనపర్తి మణికంఠపై దాడి చేసిన మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సహా ఆయన అనుచరులపై కోరుకొండ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్టు రాజమహేంద్రవరం నార్త్‌జోన్‌ డీఎస్పీ జీవన తెలిపారు. బుచ్చింపేట ఎంపీటీసీ పదవిని తన అనుమతి లేకుండా ఎందుకు ఏకగ్రీవానికి అంగీకరించావని ప్రశ్నిస్తూనే మణికంఠపై రాజా విచక్షణారహితంగా దాడి చేశారన్నారు. ఈ దాడిపై తక్షణం స్పందించిన జిల్లా ఎస్పీ డి. నరసింహ కిశోర్‌ ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై కేసు నమోదు చేశామని డీఎస్పీ పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

కానరాని ఎన్నికల సందడి

భీతావహం

Updated Date - Oct 25 , 2026 | 05:41 AM