Share News

గురువులపై గూండాగిరి!

ABN , Publish Date - Sep 22 , 2026 | 03:24 AM

మెగా డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటాలో నియమితులైన ఉపాధ్యాయుల లక్ష్యంగా వైసీపీ అల్లరి మూకలు రెచ్చిపోయాయి. కోడిగుడ్లు, రాళ్లు, వాటర్‌ బాటిళ్లను టీచర్లపైకి విసురుతూ, వీరంగం సృష్టించాయి. వారికి రక్షణగా నిలిచిన ‘శాప్‌’ సిబ్బందిపై కర్రలతో దాడి చేశాయి.

గురువులపై గూండాగిరి!

  • డీఎస్సీ టీచర్లపై వైసీపీ ఉన్మాద దాడి

  • మంత్రికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన స్పోర్ట్స్‌ కోటా టీచర్లపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి

  • విజయవాడ ‘శాప్‌’ కార్యాలయం వద్ద వీరంగం

  • టీచర్లపైకి దూసుకెళ్లిన రౌడీషీటర్లు

  • బారికేడ్ల పైకెక్కి అవినాశ్‌ హడావుడి

  • వరుదు కల్యాణి నేతృత్వంలో మహిళల బూతులు

  • లం. కొడుకులు.. రప్పా రప్పా అంటూ కేకలు

  • స్వల్ప లాఠీచార్జి చేసి చెదరగొట్టిన పోలీసులు

  • అవినాశ్‌, కిట్టు, జక్కంపూడి రాజా, అప్పిరెడ్డి, వెలంపల్లి, మల్లాది విష్ణు, గౌతంరెడ్డిలపై కేసులు

వైసీపీ మూకల్లో కొంతమంది అట్టపెట్టెల్లో తెచ్చిన కోడిగుడ్లను, రాళ్లను టీచర్లపైకి విసిరారు. రౌడీషీటర్‌ సందీప్‌ మీసం మెలేస్తూ తొడ కొడుతూ..కొడకల్లారా కాస్కోండి అంటూ రెచ్చగొట్టాడు. వారించబోయిన శాప్‌ డైరెక్టర్ల అనుచరులు కొందరిపై కర్రలతో వైసీపీ మూకలు దాడులకు తెగపడ్డాయి. దాడిలో ఇద్దరికి దెబ్బలు తగిలాయి. నా కొడుకులు.. లం. కొడుకులు అంటూ... కొందరు వైసీపీ మహిళా కార్యకర్తలు రెచ్చిపోయారు. గాజులు, చీరలు ఇస్తాం తొడుక్కోండి అంటూ కవ్వించారు. 2029 లో రప్పా.. రప్పా చేస్తాం లం. కొడకల్లారా అంటూ బూతులు లంకించుకున్నారు.

విజయవాడ, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటాలో నియమితులైన ఉపాధ్యాయుల లక్ష్యంగా వైసీపీ అల్లరి మూకలు రెచ్చిపోయాయి. కోడిగుడ్లు, రాళ్లు, వాటర్‌ బాటిళ్లను టీచర్లపైకి విసురుతూ, వీరంగం సృష్టించాయి. వారికి రక్షణగా నిలిచిన ‘శాప్‌’ సిబ్బందిపై కర్రలతో దాడి చేశాయి. వైసీపీ నేతలు దగ్గరుండి తమ పార్టీ శ్రేణులను హింసకు పురిగొల్పారు. వారితో కలిసి టీచర్లపై రౌడీ షీటర్లు విరుచుకుపడ్డారు. దీంతో.. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ నేతలు, ఆ ఆరోపణలను ఖండిస్తూ డీఎస్సీ టీచర్లు రాష్ట్రవ్యాప్తంగా పరస్పరం ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. తమ వాదన బలంగా వినిపించడానికి మెగా డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా టీచర్లు సోమవారం విజయవాడ ఇందిరా స్టేడియంలోని ‘శాప్‌’ కార్యాలయానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు విజయవాడకు చెందిన నేతల నేతృత్వంలో అక్కడికి వచ్చారు. టీచర్లు లక్ష్యంగా దాడులకు, బూతులతో దుర్భాషలకు తెగబడ్డారు.


నిషేధాజ్ఞలను కాలదన్ని..

డీఎస్సీ వ్యతిరేక నిరసనలను విజయవాడలో జరిపేందుకు అనుమతి కోరుతూ రెండు రోజుల క్రితం వైసీపీ నేతలు ఇచ్చిన పిటిషన్‌ను సిటీ కమిషనరేట్‌ తిరస్కరించింది. నగరంలో సెక్షన్‌ 30 ఉన్నందున.. బహిరంగ ఆందోళనలను అనుమతించబోమని స్పష్టం చేసింది. అయినా... డీఎస్సీ టీచర్లపై దాడులే లక్ష్యంగా సోమవారం భారీఎత్తున వైసీపీ కార్యకర్తలను ఆ పార్టీ నేతలు సమీకరించారు. వారందరినీ దేవినేని అవినాశ్‌ ఇంటి వద్ద సమీకరించారు. ‘శాప్‌’ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చే పేరుతో భారీ ర్యాలీగా ఇందిరా స్టేడియం సమీపంలోని బిషప్‌ అజరయ్య స్కూల్‌ ఉన్న ప్రాంతానికి వారంతా చేరారు. పోలీసులు ఇందిరా మున్సిపల్‌ స్టేడియానికి వెళ్లే రోడ్లను బారికేడ్లతో మూసివేశారు. బిషప్‌ అజరయ్య స్కూల్‌కు సమీపంలోని రెడ్‌ సర్కిల్‌ దగ్గర నిరసన తెలుపుతామంటూ.. పోలీసులను వైసీపీ నేతలు తప్పుదోవ పట్టించారు. అవినాశ్‌ వాట్సాప్‌ మెసేజ్‌ల ద్వారా ఇచ్చిన ఆదేశాలతో.. గుణదల వైపు నుంచి ఒక పెద్ద గుంపు శిఖామణి సెంటర్‌ మీదుగా స్టేడియానికి వెళ్లే ప్రయత్నం చేయగా, వారిని అడ్డుకునేందుకు పోలీసులు అటు పరుగులు తీశారు.

ఇదే అదునుగా రెడ్‌ సర్కిల్‌ నుంచి ఇంకో గుంపు స్టేడియం రోడ్డు దిశగా కదిలాయి. అక్కడి బారికేడ్లను బద్దలుకొట్టే ప్రయత్నం చేశాయి. పోలీసులు అడ్డుకోవటంతో అవినాశ్‌ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. కార్యకర్తలు బారికేడ్లను తోస్తుంటే, అవినాశ్‌ ఒక్క ఉదుటున వాటి మీదకు ఎక్కారు. అవినాశ్‌ను లాగేందుకు పోలీసులు ప్రయత్నించగా, వారి భుజాల మీద కూర్చుని స్టేడియం రోడ్డులోకి దూకారు. దీంతో పోలీసులు అవినాశ్‌ను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ లోపు కార్యకర్తలు బారికేడ్లను తోసేసి స్టేడియం రోడ్డులోకి ప్రవేశించారు. బందరు రోడ్డు మీద ఉన్న బారికేడ్లను కూడా తోసుకుని మరీ ‘శాప్‌’ కార్యాలయం దగ్గరకు వచ్చారు క్రీడల మంత్రి రాంప్రసాద్‌ రెడ్డికి వినతిపత్రం ఇచ్చేందుకు అప్పటికే అక్కడకు స్పోర్ట్స్‌ కోటా టీచర్లు చేరుకున్నారు. ఇరుపక్షాలూ పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. వైసీపీ శ్రేణులను ‘శాప్‌’ కార్యాలయంలోకి రానీయకుండా ప్రహరీగోడ గేటు వద్ద ఆపి పోలీసులు తాళాలు వేశారు. గేటు లోపల డీఎస్సీ ఉపాధ్యాయులు, గేటు బయట వైసీపీ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేశారు. పోలీసులు వైసీపీ శ్రేణులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నంలో తోపులాట జరిగింది.


అల్లరి మూకల్లో రౌడీ షీటర్లు...

శాప్‌ కార్యాలయం ఆవరణలో బైఠాయించి ప్లకార్డులు చేతబూని నినాదాలు చేస్తున్న ఉపాధ్యాయులపై వైసీపీ మూకలు దాడికి ప్రయత్నించాయి. కొందరు రౌడీషీటర్లు వాటర్‌ బాటిల్స్‌ను విసిరారు. రౌడీషీటర్‌ సందీప్‌ మీసం మెలేస్తూ తొడ కొడుతూ....కొడకల్లారా కాస్కోండి అంటూ టీచర్లను తీవ్రంగా రెచ్చగొట్టాడు. వైసీపీ మూకల్లో కొంతమంది అట్టపెట్టెల్లో తెచ్చిన కోడిగుడ్లను, రాళ్లను విసరసాగారు. పోలీసులు అట్టపెట్టలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దశలో టీచర్లకు మద్దతుగా శాప్‌ డైరెక్టర్ల అనుచరులు కొందరు బయటకు వచ్చి వారించే ప్రయత్నం చేశారు. తమ వెంట తెచ్చుకున్న కర్రలతో వారిపై వైసీపీ మూకలు దాడులకు తెగపడ్డాయి. వైసీపీ కర్రల దాడిలో ఒకరికి తలపై దెబ్బలు తగిలాయి. పోలీసులు కర్రలను లాక్కుని అల్లరి మూకలను చెదరగొట్టారు.

శాప్‌ కార్యాలయంలో బైఠాయించిన టీచర్లు... వైసీపీ గూండాగిరిని తీవ్రంగా నిరసించారు. మెగా డీఎస్సీ విషయంలో వైసీపీ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేయగా.. ఫేక్‌ ఫేక్‌ అంటూ వైసీపీ శ్రేణులు వారిని కవ్వించాయి. టీచర్లను రెచ్చగొట్టే ఉద్దేశంతో ఆగిఉన్న స్కూల్‌బస్‌ పైకి దేవినేని అవినాశ్‌, పేర్ని కిట్టు ఎక్కి హడావుడి చేశారు. మల్లాది విష్ణు తన శ్రేణులను టీచర్లపైకి ఉసిగొల్పారు. వైసీపీ నేత గౌతం రెడ్డి ఒక్క ఉదుటున గేటును చుట్టిముట్టే ప్రయత్నం చేశారు. వైసీపీ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేశ్‌, వెలంపల్లి శ్రీనివాస్‌ రోడ్డు డివైడర్‌ మీద నిలబడి కార్యకర్తలను బందరు రోడ్డు రెండో వైపున బైఠాయింపునకు పురమాయించారు. పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేసి.. కార్యకర్తలను చెదరగొట్టారు. కాగా, వైసీపీ మూకల దాడిలో శాప్‌ డైరెక్టర్ల అనుచరులు రామకృష్ణ, నితిన్‌రెడ్డి గాయపడ్డారు. ‘‘టీచర్లపై దాడులకు పాల్పడుతున్నవారిని వారించడానికి నేను ప్రయత్నించాను. వైసీపీ కార్యకర్తలు ‘లోకేశ్‌ జోహార్‌’ అంటూ అరవడం గమనించి.. వారిని అడ్డుకున్నాను. అలా అనటం భావ్యం కాదనడంతో నా మీద దాడికి పాల్పడ్డా’’రని రామకృష్ణ తెలిపారు.


వైసీపీ మహిళా కార్యకర్తల బూతు పురాణం

వైసీపీ మహిళా నాయకురాలు వరుదు కల్యాణి అక్కడకు చేరుకుని కొంత మంది మహిళలను టీచర్లపైకి ఉసిగొల్పారు. టీచర్లను ఉద్దేశిస్తూ నా కొడుకులు.. లం. కొడుకులు అంటూ... కొందరు వైసీపీ మహిళా కార్యకర్తలు రెచ్చిపోయారు. గాజులు, చీరలు ఇస్తాం తొడుక్కోండి అంటూ కవ్వించారు. 2029 లో రప్పా.. రప్పా చేస్తాం లం. కొడకల్లారా అంటూ బూతులకు లంకించుకున్నారు.

ఈ వార్తలనూ చదవండి....

‘హామీల అమలుకు చర్యలు తీసుకోండి’

ఆర్‌వీ నగర్‌ కాఫీ పరిశోధన స్థానం స్వర్ణోత్సవాలకు సీఎం రాక

Updated Date - Sep 22 , 2026 | 03:24 AM