ఆర్‌వీ నగర్ కాఫీ పరిశోధన స్థానం స్వర్ణోత్సవాలకు సీఎం రాక
ABN , Publish Date - Sep 21 , 2026 | 11:59 PM
జీకేవీధి మండలం ఆర్‌వీ నగర్‌లోని కేంద్ర కాఫీ పరిశోధన స్థానం స్వర్ణోత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా హాజరవుతారని కేంద్ర కాఫీ బోర్డు సీఈవో ఎం.కూర్మారావు తెలిపారు.
కేంద్ర కాఫీ బోర్డు సీఈవో కూర్మారావు వెల్లడి
పాడేరు, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): జీకేవీధి మండలం ఆర్‌వీ నగర్‌లోని కేంద్ర కాఫీ పరిశోధన స్థానం స్వర్ణోత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా హాజరవుతారని కేంద్ర కాఫీ బోర్డు సీఈవో ఎం.కూర్మారావు తెలిపారు. ఆర్‌వీ నగర్‌లో కేంద్ర కాఫీ ప్రాంతీయ పరిశోధన స్థానం స్వర్ణోత్సవాలపై జిల్లా అధికారులతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. గిరిజన ప్రాంతంలో పోడు వ్యవసాయాన్ని అరికట్టి పర్యావరణాన్ని పరిరక్షించడంతోపాటు కాఫీ తోటల పెంపకంతో గిరిజనుల ఆదాయాన్ని పెంచాలనే లక్ష్యంతోనే 1976లో ఆర్‌వీ నగర్‌లో ప్రాంతీయ పరిశోధనా స్థానాన్ని ఏర్పాటు చేశారన్నారు. దీంతో ఐదు దశాబ్దాలుగా కాఫీ సాగుపై గిరిజనులకు అవసరమైన అన్ని సలహాలు, సూచనలు, పరిశోధనా ఫలితాలు అందించడం ద్వారా నేడు మన్యంలోని కాఫీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించిందన్నారు. 50 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది అక్టోబరు 29న స్వర్ణోత్సవ సంబరాలు నిర్వహిస్తామని, వాటికి సీఎం చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా హాజరవుతారన్నారు. కార్యక్రమంలో భాగంగా అవసరమైన ఏర్పాట్లు పక్కాగా చేయాలని ఆదేశించారు. కాఫీ రైతులతో ముఖాముఖీ, కాఫీ ఉత్పత్తులు, ఫొటోల ప్రదర్శన, తదితరాలు ఏర్పాటు చేయాలన్నారు. స్వర్ణోత్సవాలకు వచ్చే వీవీఐపీలు, వీఐపీల రాకపోకలకు అనువుగా ఏర్పాట్లు, ఇతర ప్రొటోకాల్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, మినుములూరు కాఫీ బోర్డు ఎస్‌ఎల్‌వో ఎల్.రమేశ్, జిల్లా ఉద్యానవనాధికారి శ్రీధర్, ఐటీడీఏ కాఫీ ఏడీ అయింతి, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్.నందు, ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎల్.భాస్కరరావు, పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు, తదితరులు పాల్గొన్నారు.