ఎల్‌నినోపై ముందస్తు చర్యలేవీ?
ABN , Publish Date - Sep 18 , 2026 | 05:25 AM
అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. గద్దెదిగాక మరోలా వ్యవహరించడం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు అలవాటుగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుంచి వైసీపీ ప్రధాన కార్యదర్శులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పోలవరం ప్రాజెక్టు సామర్థ్యంపై కూటమి రాజీపడిందని జగన్ ఆరోపణ
నిజానికి ‘తొలి దశ’ విన్యాసాలు చేసింది ఆయనే
119 టీఎంసీలకే పరిమితం చేస్తే బ్యారేజీగా మారుతుందని హెచ్చరించినా వినలేదు
టీ-ప్రాజెక్టులపై కేసీఆర్‌ను ఏనాడూ అడగలేదు
పైగా ఇచ్చిపుచ్చుకోవాలంటూ సుద్దులు
తన హయాంలో కరువు మండలాలే ప్రకటించలేదు
అమరావతి, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. గద్దెదిగాక మరోలా వ్యవహరించడం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు అలవాటుగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుంచి వైసీపీ ప్రధాన కార్యదర్శులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావం ఉంటుందని తెలిసినప్పటికీ సీఎం చంద్రబాబు ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. 688 మండలాలకు గాను 628 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని.. అయినా ఇంతవరకు కరువు మండలాలను ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. శ్రీశైలం డ్యాం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు సరైన సమయంలో నీరివ్వలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు సామర్థ్యంపై కూటమి ప్రభుత్వం రాజీపడిందన్నారు. వాస్తవానికి ఆయన సీఎంగా ఉన్నప్పుడే 2020లో ఈ ప్రాజెక్టును 194.6 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి బదులు 41.15 మీటర్ల కాంటూరులో 119 టీఎంసీలకు కుదించారు. తొలి దశ, మలి దశ అంటూ విన్యాసాలు చేశారు.
ఇలాగైతే ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టు బ్యారేజీగా మారిపోతుందంటూ ‘ఆంధ్రజ్యోతి’ నాడు హెచ్చరించినా పట్టించుకోలేదు. ఆనాటి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసినప్పుడు.. కృష్ణా, గోదావరి నదులపై అనుమతుల్లేకుండా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై నోరు మెదపలేదు. పైగా రెండు రాష్ట్రాలూ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలంటూ జగన్ సుద్దులు చెప్పారు. కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షతన జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి ప్రస్తావించలేదు. ఆయన అధికారంలో ఉండగా మూడేళ్ల పాటు కరువు నెలకొంది. అయినా తానొస్తే కరువు ఉండదని.. వర్షాలు పుష్కలంగా పడతాయంటూ స్వీయ కితాబిచ్చుకున్నారు. అదే సమయంలో తాను సీఎంగా ఉన్నప్పుడు రాయలసీమలో చీనీ తోటలకు ట్యాంకర్లతో నీరు సరఫరా చేశానన్నారు. తన పాలనలో కరువు లేదంటూనే .. చీనీ తోటలకు ట్యాంకర్లతో నీళ్లిచ్చానంటూ జగన్ చెప్పడాన్ని రాజకీయ వర్గాలు ఎద్దేవా చేస్తున్నాయి. ఆయన అధికారంలో ఉండగా కరువు మండలాలను ప్రకటించేందుకే ఇష్టపడలేదని గుర్తుచేస్తున్నాయి. పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు తాగునీటి కోసం నీరు విడుదల చేస్తున్నా అబద్ధమాడుతున్నారని ఆక్షేపిస్తున్నాయి.
ఈ వార్తలనూ చదవండి: