Share News

అక్కడ పెళ్ళికి ఒప్పుకోను

ABN , Publish Date - Oct 25 , 2026 | 04:14 AM

బెంగళూరు యలహంకలోని ఇల్లు తనదేనని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిష్కర్షగా ప్రకటించారు. అక్కడ షర్మిల కుమార్తె అంజలిరెడ్డి పెళ్లి చేయడం వల్ల తన భద్రత, వ్యక్తిగత గోప్యతకు ముప్పు ఏర్పడుతుందని, అందరి దృష్టి భవనంపై పడుతుందని భయాందోళనలు వ్యక్తం చేశారు.

అక్కడ పెళ్ళికి ఒప్పుకోను

  • యలహంకలోని ఆ ఇల్లు నాది.. షర్మిలకు లేఖ ద్వారా జగన్‌ స్పష్టీకరణ

  • అందరి దృష్టి ఆ భవనంపై పడుతుంది.. భద్రత, గోప్యతకు ముప్పు

  • పరిచయం లేని వ్యక్తుల రాకతో వీడియోలు, ఫొటోలు బయటికొస్తాయి

  • మరో వేదికను ఎంచుకోండి.. కావాలంటే నా లోటస్‌పాండ్‌ వాడుకోండి

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనాలతో గత్యంతరం లేని స్థితిలో లేఖ విడుదల

అమరావతి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): బెంగళూరు యలహంకలోని ఇల్లు తనదేనని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిష్కర్షగా ప్రకటించారు. అక్కడ షర్మిల కుమార్తె అంజలిరెడ్డి పెళ్లి చేయడం వల్ల తన భద్రత, వ్యక్తిగత గోప్యతకు ముప్పు ఏర్పడుతుందని, అందరి దృష్టి భవనంపై పడుతుందని భయాందోళనలు వ్యక్తం చేశారు. యలహంకలో ఒకే ప్రాంగణంలో తనతో పాటు షర్మిలకు ఉన్న ఇల్లు కూడా తనదేనని.. అక్కడ అంజలిరెడ్డి పెళ్లి చేయరాదని.. భద్రతాపరమైన సమస్యలు వస్తాయని పెళ్లికి జగన్‌ అడ్డుపుల్లలు వేయడంపై ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనాలు సంచలనం సృష్టించాయి. సామాన్యులు, రాజకీయవర్గాలు, సొంత బంధుగణంలోనూ చర్చనీయాంశంగా మారాయి. దీంతో గత్యంతరం లేనిస్థితిలో ఇటీవల షర్మిలకు రాసిన లేఖను శనివారం జగన్‌ బహిర్గతం చేశారు. యలహంకలో వేదికను ఏర్పాటు చేసి తన కుమార్తె అంజలిరెడ్డి వివాహాన్ని చేయాలని షర్మిల భావించిన వెంటనే జగన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.


2 నెలల ముందే షర్మిలకు చెప్పారని వైసీపీ నేతలు చెబుతున్నారు. వేదికను మార్చుకోవాలంటూ బంధువుల ద్వారా చెప్పించారు. ఈ సూచనలను షర్మిల పట్టించుకోలేదు. దీంతో కొద్ది రోజుల కిందట ఆమెకు జగన్‌ లేఖ రాశారు. ఆ లేఖలోని కీలకాంశాలు ఇలా ఉన్నాయి. ‘గడచిన ఏడేళ్లుగా మన మధ్య ఎన్ని పరిణామాలు జరిగినా అంజలి జీవితాంతం సంతోషంగా, ప్రేమానురాగాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ నా అభ్యంతరాలను పట్టించుకోకుండా నేను నివసిస్తున్న ప్రాంగణంలోనే అంజలిరెడ్డి వివాహం జరిపించాలని భావిస్తున్నట్లుగా నా దృష్టికి వచ్చింది. నేను నివసిస్తున్న ప్రాంగణంలో పెళ్లి నిర్వహించడం వల్ల తీవ్రమైన భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయి. ఈ విషయాన్ని ఇప్పటికే వివిధ వ్యక్తుల ద్వారా తెలియజేశాను.

పెళ్లి వంటి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారు. క్యాటరింగ్‌, డెకరేషన్‌, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిబ్బంది, ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, అతిథులు ఇలా ఎంతోమంది వస్తారు. వీరిలో చాలా మంది మనకు కనీసం పరిచయం లేని వ్యక్తులే. ఇంతమంది నివాస ప్రాంగణంలోకి రాకపోకలు సాగించడం వల్ల నివాస ప్రాంగణం, చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు వెళ్లడం భద్రతాపరమైన ఆందోళనలకు దారితీస్తుంది. నా ఇంటి ప్రాంగణంలో అంజలి వివాహ వేడుకను జరపరాదన్న నిర్ణయం తీసుకోవడం నాకు సులభం కాలేదు.


అంజలిరెడ్డి విషయంలోనే కాదు, నా కుమార్తెలు హర్ష, వర్ష విషయంలోనూ ఇలాంటి నిర్ణయమే తీసుకునేవాడిని. ప్రస్తుతం నేను నివసిస్తున్న ఇంట్లో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల అనవసరంగా అందరి దృష్టి నా నివాసంపై పడుతుంది. చివరకు ఇది నా ఇల్లు. ఇక్కడ నేను నా కుటుంబం సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను. భద్రత, వ్యక్తిగత గోప్యతలకు సంబంధించి ఇప్పటికే నా అభ్యంతరాలను తెలియజేశాను. మేనల్లుడు రాజారెడ్డి పెళ్లి చేసినట్లుగానే కన్వెన్షన్‌ సెంటర్‌ లేదా డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ వేదికలో అంజలిరెడ్డి విహహం చేసుకోవచ్చు. అలాంటి వేదికలు ఇష్టం లేకపోతే హైదరాబాద్‌లో లోటస్‌పాండ్‌లోని నా ఆస్తి వాడుకోవచ్చు’ అని లేఖలో జగన్‌ పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

కానరాని ఎన్నికల సందడి

భీతావహం

Updated Date - Oct 25 , 2026 | 04:14 AM