Share News

జగన్‌ కాక్రోచ్‌ జపం!

ABN , Publish Date - Oct 16 , 2026 | 05:24 AM

‘నేనూ కాక్రోచ్‌నే’ అని ఆ మధ్య ఒక ప్రకటన చేసిన వైసీపీ అధినేత ఇప్పుడు నేరుగా కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ)కి మద్దతు పలికారు. ‘‘సీజేపీ నేతలు సౌరవ్‌ దాస్‌, అశుతోష్‌ రంకా అరెస్టులు సమస్యలను పరిష్కరించలేవు.

జగన్‌ కాక్రోచ్‌ జపం!

  • సీజేపీ నేతల అరెస్టులకు ఖండన.. పాలనపై కేంద్రానికి హితోక్తులు

  • అరెస్టులు సమస్యలను పరిష్కరించలేవు

  • ఎన్నికల ప్రక్రియపై విశ్వాసాన్ని పునరుద్ధరించాలి: జగన్‌

  • రాహుల్‌తో కలవాలంటూ జగన్‌కు వైసీపీ శ్రేణుల పిలుపు

(అమరావతి - ఆంధ్రజ్యోతి): ‘నేనూ కాక్రోచ్‌నే’ అని ఆ మధ్య ఒక ప్రకటన చేసిన వైసీపీ అధినేత ఇప్పుడు నేరుగా కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ)కి మద్దతు పలికారు. ‘‘సీజేపీ నేతలు సౌరవ్‌ దాస్‌, అశుతోష్‌ రంకా అరెస్టులు సమస్యలను పరిష్కరించలేవు. ఎన్నికల ప్రక్రియపై విశ్వాసాన్ని పునరుద్ధరించాలి. ప్రభుత్వ వ్యతిరేక ధోరణితో పరిస్థితులు ఉద్రిక్తమవుతాయి. ప్రభుత్వ విధానాల్లోని లోపాలను సవరించుకోవాలి’’ అని గురువారం ‘ఎక్స్‌’లో జగన్‌ పేర్కొన్నారు. ఆయన మద్దతుకు సీజేపీ నేతలు ధన్యవాదాలు తెలిపారు. దీంతో ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అవినీతి, అక్రమాస్తుల కేసుల్లో నిండా మునిగిన జగన్‌.... ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని ఎప్పుడూ విమర్శించలేదు.

ఆయన అధికారంలో ఉండగా... కేంద్రం అడగకపోయినా అన్ని విషయాల్లో మద్దతు పలికారు. అలాంటి జగన్‌ ఇప్పుడు హఠాత్తుగా సీజేపీకి మద్దతు పలుకుతూ కేంద్ర ప్రభుత్వానికి సుద్దులు చెప్పడం గమనార్హం. తమ అధినేత ట్వీట్‌ చేయగానే వైసీపీ శ్రేణులు సామాజిక మాధ్యమాల్లో క్రియాశీలమయ్యాయి. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీతో కలసి ప్రయాణం చేయాలని జగన్‌కు సూచించాయి. గతంలో తానూ కాక్రోచ్‌నేనంటూ మీడియా ముందు జగన్‌ మాట్లాడిన సందర్భంలో విలేకరులు రాహుల్‌ ప్రస్తావన తీసుకురాగా.. ఆయన గురించి మాట్లాడడం టైమ్‌ వేస్ట్‌ అని జగన్‌ తేలిగ్గా తీసిపడేశారు.

ఏమిటీ మార్పు...

అక్రమాస్తుల వ్యవహారంలో జగన్‌పై సీబీఐ, ఈడీ దాఖలుచేసిన కేసులను రోజువారీ విచారించేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు సమాయత్తమైంది. తన చిన్నాన్న వివేకానందరెడ్డి హత్యకు రూ.40 కోట్ల డీల్‌ వ్యవహారంలో ఈడీ దూకుడుగా వెళ్తోంది. వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి, సన్నిహితుడు దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డిలను విచారణకు పిలిచి గంటల తరబడి ప్రశ్నిస్తుండడంతో జగన్‌ ఇరకాటంలో పడ్డారు. ఈ నేపథ్యంలో తన ఆక్రోశాన్ని కేంద్రం దృష్టికి తెచ్చేందుకే సీజేపీకి మద్దతుగా ట్వీట్‌ చేసి ఉండొచ్చని రాజకీయ వర్గాలు సందేహిస్తున్నాయి.


  • అవినీతి జగన్‌తో సీజేపీ జట్టా?

కాక్రోచ్‌ పార్టీ రంగు బయటపడింది.. బీజేపీ రాష్ట్ర నేత మాధవ్‌ ఫైర్‌

అవినీతి వ్యతిరేక పోరాటం.. ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ నినాదాలు చేసే కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ).. అవినీతి కేసుల్లో కూరుకుపోయి సీబీఐ, ఈడీ కేసుల్లో నిందితుడైన జగన్‌తో జట్టు కట్టి తన అసలు రంగును బయట పెట్టుకుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా చేసిన దోపిడీతో సీబీఐ కేసులు, ఈడీ విచారణలు ఎదుర్కొంటున్న జగన్‌.. తన హయాంలో రాష్ట్రంలో ఆలయాలు ధ్వంసం, రథాల దహనం, విగ్రహాల శిరచ్ఛేదం, మత మార్పిడులకు ప్రోత్సాహం వంటివాటికి పాల్పడ్డారని.. ఐదేళ్ల పాలనలో ప్రజలు, ప్రతిపక్షాల హక్కుల్ని కాలరాసి.. అరాచకం చేసి.. ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన జగన్‌ ఏ విధంగా ప్రజాస్వామ్య వాది.. ఆయనతో సీజేపీ ఎలా జట్టు కట్టిందని మాధవ్‌ నిలదీశారు.

స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దేశంలో అస్థిరత సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న శక్తులన్నీ ఒక్కటవుతున్నాయని గురువారం ‘ఎక్స్‌’లో మండిపడ్డారు. ‘శాంతియుత నిరసన ఈ దేశంలో ప్రతి ఒక్కరి హక్కు. కానీ పోలీసులపై రాళ్ల దాడులు, మహిళలపై అనుచిత ప్రవర్తన సీజేపీ దృష్టిలో ప్రజాస్వామ్యమా.? అటువంటి శక్తులతో జట్టు కట్టిన జగన్‌ తీరును ప్రజలు క్షమిస్తారా’ అని ప్రశ్నించారు. కాగా.. రాష్ట్రంలోని వైసీపీ దేశాన్ని దోచుకుంటే.. దేశంలో అస్థిరత సృష్టించేందుకు సీజేపీ విదేశీ నిధులతో విర్రవీగుతోందని బీజేపీ మీడియా ఇన్‌చార్జి దిలీప్‌ ఆరోపించారు.

ఈ వార్తలనూ చదవండి:

మీ ఛాయిస్‌ ఎవరు?

మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

Updated Date - Oct 16 , 2026 | 05:24 AM