Share News

ఛీ..జగన్‌!

ABN , Publish Date - Oct 22 , 2026 | 03:52 AM

వైసీపీ అధినేత జగన్‌ మరోసారి తన వికృత రూపం ప్రదర్శించారు. ఆస్తులు పంచకుండా తల్లి, చెల్లిని గెంటేసి తన నైజం బయటపెట్టుకున్న ఆయన.. మరోసారి వారిని తీవ్రంగా క్షోభ పెట్టే పనిచేశారు.

ఛీ..జగన్‌!

  • మేనకోడలి పెళ్లికే ఆటంకాలు

  • పెళ్లికి ఇల్లు ఇవ్వనంటూ చెల్లికి అడ్డుపుల్లలు

  • నవంబరు 25న షర్మిల కుమార్తె వివాహం

  • బెంగళూరు భవంతిలో నిర్వహణకు నిర్ణయం

  • తీరా కార్డులు పంచాక జగన్‌ ఫిట్టింగ్‌

  • ఇల్లు తన అత్తగారి పేరిట ఉందని..

  • అది తనదేనంటూ అభ్యంతరం

  • ఆ ఇల్లు షర్మిల కోసం వైఎస్‌ కట్టించిందే

  • రాతపూర్వకంగా లేకపోవడంతో జగన్‌ పేచీ

  • ఇప్పటికే ఆస్తులు ఇవ్వకుండా గెంటివేత

  • ఇప్పుడు పెళ్లి సమయంలో వికృతరూపం

  • మామయ్యా.. ఇంత నిర్దయా?

వైసీపీ అధినేత జగన్‌ మరోసారి తన వికృత రూపం ప్రదర్శించారు. ఆస్తులు పంచకుండా తల్లి, చెల్లిని గెంటేసి తన నైజం బయటపెట్టుకున్న ఆయన.. మరోసారి వారిని తీవ్రంగా క్షోభ పెట్టే పనిచేశారు. ఏకంగా సొంత మేనకోడలి పెళ్లికే ఆటంకాలు సృష్టించేందుకు తెగబడ్డారు. బయటివారు పెళ్లి చేసుకుంటుంటేనే మనం ఆశీర్వదించి చేతనైన సాయం చేస్తాం.. అలాంటిది సొంత చెల్లెలి కుమార్తె పెళ్లికి.. తన సొంత ఇంటినే వాడుకోనివ్వకుండా షర్మిలకు అడ్డుపడుతూ నయా కంసుడి అవతారమెత్తారు. తల్లి స్వయంగా బతిమలాడినా ససేమిరా అంటూ తన కర్కశ స్వభావాన్ని మరోసారి చాటుకున్నారు.

ఇంతకీ ఆయనకు అంత కక్ష ఎందుకు?

చెల్లికి ఆస్తులు ఇవ్వకుండా వేధిస్తున్న జగన్‌.. మేనకోడలి పెళ్లికీ ఆటంకాలు కలిగించడం వెనుక అసలు వాస్తవం ఏమిటి? అందులో దాగి ఉన్న ఆస్తుల కోణం ఏమిటి?


(అమరావతి - ఆంధ్రజ్యోతి): వైఎస్‌ రాజశేఖరరెడ్డి మనవరాలు, షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహం నవంబరు 25వ తేదీన చేయాలని ముహూర్తం నిర్ణయించారు. బెంగళూరు యలహంకలోని షర్మిల ఇంటిని ఇందుకు వేదికగా ఎంచుకున్నారు. కొందరు ప్రముఖులతో పాటు బంధువులు, సన్నిహితులకు ఆహ్వాన పత్రికలు కూడా పంచారు. ఈ సమయంలో అన్న జగన్‌ తన వికృత రూపం బయటపెట్టారు. యలహంకలోని ఇంట్లో పెళ్లి చేయడానికి వీల్లేదని, ఆ ఇల్లు తనదని మడతపేచీ పెట్టారు. వాస్తవానికి యలహంకలోని ఆ ఇల్లు జగన్‌ కష్టార్జితం కాదు. వైఎస్‌ అన్నాచెల్లెళ్లు ఇద్దరికీ అక్కడ చెరొక భవంతీ కట్టించారు. తన పిల్లలు ఇద్దరికీ అన్ని ఆస్తుల్లో సమాన హక్కు ఉండాలన్నది రాజశేఖరరెడ్డి కోరిక. ఇదే విషయం ఆయన బతికున్నప్పుడు నోటి మాటగా చెప్పారు. ఆయన హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించడంతో ఆస్తి పంపకాలు రాతపూర్వకంగా జరగలేదు. దాంతో జగన్‌ ఆస్తుల విషయంలో తన నిజ స్వరూపాన్ని పలుమార్లు బయటపెడుతూ వస్తున్నారు. ఇప్పటికే తల్లీచెల్లిని గెంటేసి, కోర్టు మెట్లెక్కేలా చేసిన ఆయన.. వారిని మరోసారి కష్టాలపాల్జేసేందుకు సిద్ధమయ్యారు.

దటీజ్‌ జగన్‌:

సాధారణంగా పెళ్లి విషయంలో అద్దె ఇంట్లో ఉండేవారికి కూడా ఎవరూ అభ్యంతరం చెప్పరు. రక్తసంబంధీకులు, బంధువులు అయితే దగ్గరుండి మరీ ఏర్పాట్లు చేస్తారు. అయితే ‘జగనన్న’ రూటే సెపరేటు. సొంత చెల్లెలి కుమార్తె, మేనకోడలి వివాహానికి వేదికగా నిర్ణయించిన ఇల్లు తనదని, అక్కడ పెళ్లి చేయడానికి వీల్లేదని ఆయన అడ్డం తిరిగి కక్ష సాధించడం మొదలెట్టారన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ ఇల్లు తన భార్య భారతి తల్లి పేరున ఉందని.. అది షర్మిలది కానే కాదంటూ అడ్డం తిరిగారు. దీంతో షర్మిల కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దీంతో తల్లి విజయమ్మ రంగంలోకి దిగి నచ్చజెప్పినా జగన్‌ ఒప్పుకోవడం లేదు. తన కుమార్తె ఇంట్లో పెళ్లికి సొంత కొడుకే ఇబ్బందులు పెడుతుండటం, షర్మిలకు కట్టించిన ఇంటిని ఇవ్వనని జగన్‌ మొండికేయడం ఆమెకు ఏ మాత్రం మింగుడుపడని విషయంగా మారింది. తన మనవరాలి వివాహం విషయంలో జగన్‌ మూర్ఖంగా ప్రవర్తించడంతో ఆమె నిశ్చేష్టురాలయ్యారు. కొడుకు తీరుపై తీవ్ర మనస్తాపం చెందారు. షర్మిల అయితే ఈ షాక్‌ నుంచి కోలుకోలేకపోతున్నారు.


వివాహానికి ఏర్పాట్లన్నీ చేసుకున్నాక, కార్డులు పంచిన తర్వాత.. ఇప్పుడు పెళ్లికి మరో వేదిక చూసుకోవాల్సి రావడం, ఇప్పటికే ఆహ్వాన పత్రాలు పంపిన వారందరికీ ఈ విషయం చెప్పడం ఎలా అని మథనపడుతున్నారు. విజయమ్మ, షర్మిలకు ఈ పరిస్థితి రావడంపై కుటుంబ సన్నిహితులు కూడా విస్మయానికి గురవుతున్నారు. వాస్తవానికి పెళ్లికి కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ వంటి ప్రముఖులనూ ఆహ్వానించి ఉండటంతో వారి భద్రతకు, ఇతరత్రా ఏర్పాట్లకు అనువైన వేదికను వెతుక్కోవాల్సి రావడం షర్మిల కుటుంబానికి పెద్ద సమస్యగా మారిందని సమాచారం. పెళ్లి అనంతరం డిసెంబరు 2న హైదరాబాద్‌లో తలపెట్టిన రిసెప్షన్‌కు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్‌ వంటి వీవీఐపీలు, సన్నిహితులు 175 మంది వస్తారని అంచనా.

అత్తగారికి ఎలా వచ్చిందబ్బా!

మేనకోడలి పెళ్లికి అంతా సిద్ధమైన తరుణంలో బెంగళూరు భవంతి తన అత్తగారి (భారతి తల్లి) పేరిట ఉందని, అందులో పెళ్లి చేయడానికి వీల్లేదని జగన్‌ అడ్డుపడటంతో.. అసలు ఆవిడ పేరిట ఆ భవంతి ఎందుకుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. వాస్తవానికి రాజశేఖరరెడ్డి బతికున్నప్పుడు తన పిల్లలిద్దరికీ ఆస్తిలో సమాన వాటాలు ఉండాలని కోరుకున్నారు. అందుకే హైదరాబాద్‌, బెంగళూరు, ఇడుపులపాయలో కుమారుడు జగన్‌, కుమార్తె షర్మిల కోసం పెద్ద స్థలంలో రెండేసి భవంతులు కట్టారు. మూడు చోట్లా ఒకే ప్రాంగణంలో పక్కపక్కనే దాదాపు ఒకే డిజైన్‌లో వాటిని నిర్మించారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో జగన్‌ ఇంటి పక్కనే షర్మిలకు ఇల్లు ఉంది. ఆమె ఇప్పటికీ అక్కడే ఉంటున్నారు. ఇడుపులపాయలోనూ ఇద్దరికీ ఇళ్లు ఉన్నాయి. ఆ ఇంటికి ప్రస్తుతం జగన్‌ వెళ్లడం లేదు. షర్మిల మాత్రం ఇడుపులపాయ వెళ్లినప్పుడు అక్కడే ఉంటారు. ఇక యలహంకలో ఉండే 20 ఎకరాల స్థలంలో వైఎస్‌ ఇద్దరికీ పక్కపక్కనే భారీ భవనాలు కట్టించారు. ఈ లెక్కన షర్మిల, జగన్‌కు చెరి సగం వాటాలు ఉన్నాయి. జగన్‌ తరచూ బెంగళూరు వెళ్లినపుడు యలహంకలోని ఇంట్లోనే ఉంటారు. రాజశేఖర రెడ్డి బతికుండగా ఎప్పుడు బెంగళూరు వెళ్లినా షర్మిల కోసం నిర్మించిన భవంతిలోనే ఉండేవారు. ఇళ్లు మాత్రమే గాక ఇతర ఆస్తుల్లోనూ జగన్‌, షర్మిలకు సమాన వాటాలు ఉండాలని రాజశేఖరరెడ్డి నోటిమాటగా పంపకాలు చేశారు.


దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్‌ చేయలేదు. వైఎస్‌ చనిపోయాక ఆస్తుల పంపకాల విషయంలో వివాదం ఏర్పడింది. కంపెనీలు, ఆస్తులలో షర్మిలకు జగన్‌ వాటా ఇవ్వకుండా గెంటేశారు. దీంతో విజయమ్మ జోక్యం చేసుకుని షర్మిలకు అన్యాయం చేయవద్దని, ఆస్తిలో వాటా ఇవ్వాలని జగన్‌కు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. తల్లి చెప్పినా జగన్‌ వాటా ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. ప్రస్తుతం ఆస్తుల పంపకాల వివాదం కోర్టులో ఉంది. ఇక బెంగళూరు భవంతి భారతి తల్లి పేరిట ఎందుకుందనే విషయంలో ఆసక్తికరమైన కోణం వెలుగుచూసింది. వైఎస్‌ వివిధ ఆస్తులు సమకూర్చే క్రమంలో ఆర్థికపరమైన సమస్యలు రాకుండా ఉండేందుకు చేపట్టిన ‘ముందు జాగ్రత్త’ చర్యల్లో భాగంగానే ఆ భవంతిని జగన్‌ అత్తగారి పేరిట పెట్టినట్లు తెలిసింది. అయినా షర్మిలకు వాటా చెందాలని నాడు రాజశేఖరరెడ్డి స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. ఇన్నాళ్లూ ఆ ఇంటిని షర్మిల వాడుకున్నా పట్టించుకోని జగన్‌.. ఇప్పుడు పెళ్లి జరగడాన్ని అడ్డుకోవడం వెనుకా ఆస్తులపై ఆయనకున్న మమకారమే కారణమని స్పష్టమవుతోంది. ఇప్పుడు అక్కడ పెళ్లి జరిగితే ఆ భవంతితో పాటు అత్యంత ఖరీదైన ఆ ప్రాంగణం(20 ఎకరాల్లో సగం) కూడా షర్మిలకు చెందుతుందని ఆందోళన చెందే ఆయన అభ్యంతరం చెబుతున్నారన్నది అసలు వాస్తవం. అప్పటి ఆర్థిక లావాదేవీల జాగ్రత్తల్లో భాగంగా.. అత్తగారి పేరు పెట్టగా, దాన్ని సాకుగా చూపి ఆ ఆస్తి మొత్తం తనకే చెందుతుందని పెళ్లికి అడ్డుపడడం.. జగన్‌ కుటుంబంలోనే గాక రాజకీయ వర్గాల్లోనూ సంచలనంగా మారింది.


చెల్లెలిపై జగన్‌కు ఎందుకీ పగ?

నాడు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో జగన్‌ జైలుకు వెళ్లినపుడు వైసీపీ బాధ్యతలను షర్మిల తన భుజాన వేసుకున్నారు. అన్న కోసం పాదయాత్ర కూడా చేశారు. అయితే 2019లో జగన్‌ సీఎం అయ్యాక చెల్లెల్ని క్రమంగా దూరం పెట్టారు. షర్మిలకు ఆస్తులు పంచకపోవడంతో పాటు పార్టీకి ఆమెను, తల్లి విజయమ్మను దూరం చేశారు. రానురాను కుటుంబంలో విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ క్రమంలో గత ఎన్నికల ముందు షర్మిల కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచి ఏపీసీసీ చీఫ్‌గా ఉంటున్నారు. ఎన్నికల సమయంలో రాజశేఖరరెడ్డి కుటుంబంలో వివాదాలు మరింత ముదిరాయి. రాజకీయంగా తనతో విభేదించిన షర్మిల పట్ల జగన్‌ కక్ష కట్టినట్టు వ్యవహరిస్తున్నారు. షర్మిల కొడుకు వివాహ సమయంలోనూ సీఎం చంద్రబాబును ఆహ్వానించేందుకు వెళ్లినపుడు చెల్లెలని కూడా చూడకుండా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మేనకోడలి పెళ్లి సమయంలో నిర్దయగా వ్యవహరిస్తుండటం గమనార్హం.

ఈ వార్తలనూ చదవండి

కూటమి దూకుడు

పండుగపూట ఘోరం

Updated Date - Oct 22 , 2026 | 03:52 AM