Share News

యువత ఉద్యోగాల కల సాకారం చేస్తాం

ABN , Publish Date - Oct 01 , 2026 | 04:01 AM

‘యువత మమ్మల్ని అడుగుతున్న ఒకే ఒక్క విషయం ఉద్యోగాల కల్పన. అందుకే మా ప్రభుత్వం ఉద్యోగాల కల్పనను ప్రధాన అజెండాగా పెట్టుకుంది. సీఎం నుంచి అన్ని స్థాయిల్లోని ఉద్యోగులు ఆ అజెండాపైనే పనిచేస్తున్నారు.

యువత ఉద్యోగాల కల సాకారం చేస్తాం

  • ప్రభుత్వ ప్రధాన అజెండా కూడా అదే

  • 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం

  • రాజకీయ నిరుద్యోగులే డీఎస్సీపై ఆరోపణలు చేస్తున్నారు

  • విద్యార్థులకు కొత్త టెక్నాలజీలు

  • వ్యవస్థలో మార్పే జెన్‌జీ కోరిక

  • నిర్దిష్ట విధానంలో ‘సర్‌’ ఉండాలన్నదే టీడీపీ అభిప్రాయం

  • క్రికెట్‌ మ్యాచ్‌కు వెళ్లినా పెట్టుబడులపైనే మాట్లాడతా

  • సీఎం పదవి నాకు ప్రాధాన్యం కాదు

  • విద్యా వ్యవస్థలో మార్పులు తేవడం నాకు ముఖ్యం

  • సౌత్‌ కాంక్లేవ్‌లో మంత్రి లోకేశ్‌

అమరావతి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ‘యువత మమ్మల్ని అడుగుతున్న ఒకే ఒక్క విషయం ఉద్యోగాల కల్పన. అందుకే మా ప్రభుత్వం ఉద్యోగాల కల్పనను ప్రధాన అజెండాగా పెట్టుకుంది. సీఎం నుంచి అన్ని స్థాయిల్లోని ఉద్యోగులు ఆ అజెండాపైనే పనిచేస్తున్నారు. యువత కలల సాకారం కోసమే 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం నిర్ణయించాం’ అని విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ స్పష్టం చేశారు. బుధవారం కేరళంలోని కొచ్చిలో జరిగిన ఇండియా టుడే సౌత్‌ కాంక్లేవ్‌లో లోకేశ్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లోకేశ్‌ మాట్లాడుతూ.. డీఎస్సీపై రాజకీయ నిరుద్యోగులే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. క్వాంటమ్‌ అనేది ఊహకాదని, ఆ నెక్ట్స్‌ జనరేషన్‌ టెక్నాలజీని ఏపీ అందిపుచ్చుకుందని అన్నారు.

తొలి 156 క్యూబిట్‌ క్వాంటమ్‌ కంప్యూటర్‌ను అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ‘సర్‌’పైనా తన అభిప్రాయాన్ని తెలిపారు. వ్యవస్థను ప్రశ్నించే వారికి కొంత బాధ్యత ఉండాలన్నారు. రాజకీయ పార్టీగా టీడీపీ కూడా సర్‌కు సంబంధించిన వివిధ అంశాలపై ఎప్పటికప్పుడు వివరణ కోరిందని, ఎన్నికల సంఘం ఇచ్చిన వివరణను టీడీపీ పరిశీలించిందని తెలిపారు. అది సక్రమంగానే ఉందని టీడీపీ భావిస్తోందని చెప్పారు. ప్రతి ఎన్నికల్లో బీజేపీ గెలిచేందుకు జ్ఞానేశ్‌ కుమార్‌ను నియమించారన్న ఆరోపణలపై స్పందిస్తూ.. అలా అయితే కేరళం, తెలంగాణల్లో బీజేపీ ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించారు. అర్హత కలిగిన ప్రతి ఓటరూ ఓటర్ల జాబితాలో ఉండటం చాలా ముఖ్యమన్నారు. సర్‌ ఒక నిర్దిష్ట విధానంలో జరగాలన్నదే మొదటి నుంచి తమ అభిప్రాయమని, అది ఎక్కడా మారలేదని చెప్పారు. వివిధ అంశాలపై ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే.. ఆయన మాటల్లోనే..


జెన్‌జీ గురించి.. యువత కోరుతున్న మార్పుపైన..

కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా దేశంలో ఓ కొత్త ఉద్యమం వస్తుందని భావిస్తున్నాను. ఇది జనరేషన్‌ మార్పు. వ్యవస్థను మార్చాలని భావిస్తున్న యువత ఉద్యమిస్తోంది. మా ప్రభుత్వంలో కూడా ఇంకా మెరుగుపరచాల్సిన అంశాలు ఉన్నాయి. సమస్యలను గుర్తించాం. యువతతో కలిసే వాటికి పరిష్కారాలు కనుగొనడం నాకు చాలా ఉత్సాహ్నాన్నిస్తుంది. నిరుద్యోగ సమస్యకు పరిష్కారం విద్యతో ప్రారంభమవుతుంది. అందుకే మేము పాఠ్యాంశాలను పూర్తిగా పునఃపరిశీలిస్తున్నాం. పరిశ్రమలతో కలిసి ఉద్యోగాలు సృష్టిస్తున్నాం. ఏడాది కాలంలో దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వచ్చాయి. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు యువతలో పెంచుతున్నాం. యువత మనోభావాలను మేం వింటున్నాం. విద్యార్థులతో ఓపెన్‌గా మాట్లాడతాను. ఇటీవల నర్సరావుపేటలో విద్యార్థులు క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ కోర్సులు కావాలని అడిగారు. వారికోసం ఐబీఎంతో మాట్లాడి వారికి క్యాప్సుల్‌ కోర్సులు తీసుకొచ్చాం.

డీఎస్సీ విషయంలో ప్రతిపక్షం ఆరోపణలపై..

డీఎస్సీ పరీక్షను అత్యంత పారదర్శకంగా నిర్వహించాం. ఇది కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష. ప్రతిపక్షం ఒక్క ఆరోపణ కూడా ఇప్పటి వరకు నిరూపించలేదు. గత ప్రభుత్వంలో క్రీడా కోటాలో ఎంపికైన విద్యార్థులకు అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలే సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇప్పుడు అదే అంశంపై ఆరోపణలు చేస్తున్నారు. క్రీడా కోటా అంశంపై వారు కోర్టుకు వెళ్లారు, సీబీఐ దర్యాప్తు కోరారు. మేము తప్పు చేయలేదు. కోర్టు ఏ ఆదేశం ఇచ్చినా దానికి సిద్ధంగా ఉన్నాం. దేశంలోని విద్యావ్యవస్థను పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉంది. ఏఐ నుంచి క్వాంటమ్‌ వరకు భవిష్యత్‌ టెక్నాలజీలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. అమరావతిని క్వాంటమ్‌ వ్యాలీగా మార్చాలన్న చంద్రబాబు ఆలోచన వాస్తవ రూపం దాల్చుతోంది. ఇక పెట్టుబడుల కోసం త్రిపుల్‌ఎస్‌ (స్పీడ్‌, సర్వీస్‌, స్టెబిలిటీ) మంత్రాన్ని అనుసరిస్తున్నాం. ప్రాజెక్ట్‌ ప్రతిపాదనలను క్లియర్‌ చేసే వేగంలో ఏపీ కొత్త ప్రమాణాలను పాటిస్తోంది. స్కైరూట్‌ వంటి సంస్థలు ఎక్కువ మందికి తెలియకముందే మేము వారిని ఏపీకి తీసుకురావడానికి ప్రయత్నించాం.


డేటా సెంటర్ల సవాళ్ల పైన..

ప్రస్తుత తరం మార్పును చూడాలనుకుంటోంది. యువత త్వరగా ఫలితాలు చూడాలని అనుకుంటోంది. మా దగ్గర ఐదేళ్ల సమయం మాత్రమే ఉంది. వేగం మా ప్రధాన లక్షణం. అదే సమయంలో క్లస్టర్‌ ఆధారిత విధానంతో ముందుకు వెళ్తున్నాం. నీరు, విద్యుత్‌ అవసరాలను ముందుగానే ప్రణాళిక చేస్తున్నాం. గూగుల్‌తో సహా చాలా డేటా సెంటర్లు ఎయిర్‌ కూల్డ్‌ డేటా సెంటర్లుగా ఉంటాయి. అవి వినియోగించే నీటి పరిమాణం ఐటీ సెంటర్‌ ఉపయోగించే నీటితో సమానంగా ఉంటుంది. మేం కేవలం డాటా సెంటర్లపై మాత్రమే దృష్టిపెట్టడంలేదు. పలు రంగాల్లోనూ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం.

విద్యాశాఖ మంత్రిగా సాధించింది..

సమాజానికి పెద్ద స్థాయిలో సేవ చేయగలనని భావించి విద్యాశాఖను ఎంచుకున్నాను. గత ప్రభుత్వ హయాంలో 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైట్‌ పాఠశాలలకు వెళ్లారని గణాంకాలు చెబుతున్నాయి. గత రెండేళ్లలో 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్‌ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు తిరిగి వచ్చారు. 16 వేల మంది ఉపాధ్యాయులను నియమించాం. మా ఉపాధ్యాయులు చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఇక మా జీఎస్టీ వృద్ధి దాదాపు రెండంకెల స్థాయిలో ఉంది. 17-18 శాతానికి పైగా వృద్ధి నమోదు ఉంది. దీర్ఘకాలంలో అప్పులను తీర్చగలమనే నమ్మకం ఉంది. ఒక కుటుంబం పేదరికం నుంచి బయటపడిన తర్వాత ఇక సంక్షేమం అవసరం లేని స్థాయికి రావాలి. వారికి ఉద్యోగాలుండాలి. వారు తమ కుటుంబాలను తాము నిర్వహించుకోగలగాలి. అలాంటి సమాజాన్ని నిర్మించడమే లక్ష్యం.


డీలిమిటేషన్‌పై స్పష్టమైన వైఖరి..

డీలిమిటేషన్‌పై టీడీపీది స్పష్టమైన వైఖరి. ప్రస్తుతం పార్లమెంట్‌లో ఉన్న ప్రాతినిధ్యాన్ని కొనసాగించాలి. 2026 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్‌ జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే అవకాశం ఉందనే అంశంపై మేమూ ఆందోళన వ్యక్తం చేశాం. ఇక మహిళలకు రిజర్వేషన్‌ తీసుకొచ్చిన పార్టీ మాదే. ఈ విషయంపై 40 ఏళ్ల క్రితమే దీనిపై నిర్ణయం తీసుకున్నాం. ఇక జనాభా నిర్వహణ భవిష్యత్తులో అత్యంత ముఖ్యమైన అంశంగా మారబోతోంది. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు వంటి రాష్ట్రాలు తమ రీప్లేస్‌మెంట్‌ రేట్‌ను 2.1 వద్ద కొనసాగించాలి. ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుతం 1.5 వద్ద ఉంది. ఇది మరింత తగ్గే అవకాశం ఉంది. ఈ అంశంపై చంద్రబాబు 2019 నుంచే మాట్లాడుతున్నారు. మంత్రిగా నేను నేర్చుకున్నది ఏమిటంటే.. ఎవరు మంచి చెప్పినా అపారమైన సహనంతో వినాలి. అన్నివర్గాల ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలి. ఏ వ్యవస్థా పరిపూర్ణం కాదు. ఒక వ్యవస్థను సరిచేయాలనుకుంటే కొన్ని అంశాల్లో మెరుగుదలకు అవకాశం ఉంటుంది.


సీఎం కావాలనుకుంటున్నారా..?

నేనెప్పుడూ ఉన్నత పదవులను ఆశించలేదు. ప్రజల హృదయాలను గెలుచుకోవాలనే లక్ష్యంతోనే పనిచేశాను. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి నాకు ప్రాధాన్యం కాదు. విద్యా వ్యవస్థను వీలైనంత త్వరగా మార్చడమే నా ప్రాధాన్యం. ఆ తర్వాత పార్టీని ముందుకు నడిపించడం ముఖ్యం. అందుకే మై టీడీపీ యాప్‌ ద్వారా రోజులో అధిక సమయం కార్యకర్తలతో టచ్‌లో ఉంటాను. నేను ఎప్పుడూ ఏబీసీ.. ఆల్వేస్‌ బీ క్లోజింగ్‌ అని నమ్ముతాను. ఎప్పుడూ ఒక అవకాశాన్ని ముగింపునకు తీసుకెళ్లాలి. క్రికెట్‌ మ్యాచ్‌కు వెళ్లినా.. అక్కడ కూడా పెట్టుబడి ఒప్పందాలపై మాట్లాడి వాటిని ముగిస్తాను. ఒక టీ20 మ్యాచ్‌లో నేను ఎంతమంది పారిశ్రామికవేత్తలను, వ్యాపారవేత్తలను కలిశానో చెబితే ఆశ్చర్యపోతారు. వారిలో చాలామంది తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టారు.

కిటెక్స్‌ ఫ్యాక్టరీని సందర్శించిన లోకేశ్‌

కేరళం పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్‌ కొచ్చిలోని కిటెక్స్‌ గార్మెంట్స్‌ సీఎండీ సబు ఎం.జాకబ్‌ను కలిశారు. ఈ సందర్భంగా కిటెక్స్‌ ఫ్యాక్టరీని సందర్శించి దుస్తుల తయారీని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలించాలని జాక్‌బ్‌ను కోరారు.

ఈ వార్తలనూ చదవండి...

ఉన్నతంగా బతికి... మానసికంగా ‘చితికి’

రైతులకు తీపి కబురు

Updated Date - Oct 01 , 2026 | 04:01 AM