Share News

ఎల్‌నినో బూచి చూపి ధరల మోత

ABN , Publish Date - Oct 18 , 2026 | 03:27 AM

గత మూడేళ్లూ ప్రభుత్వ అంచనా మేరకు రైతులు వరి సాగు చేశారు. ధాన్యం దిగుబడి ఆశించిన స్థాయిలో వచ్చింది. సాధారణంగా మూడేళ్ల పాటు ధాన్యం నిల్వ చేసుకునే అవకాశం ఉంది.

ఎల్‌నినో బూచి చూపి ధరల మోత

  • పాత ధాన్యం నిల్వలున్నా పెంపు

  • గత మూడేళ్లూ గరిష్ఠ దిగుబడి

  • 3 సీజన్ల ధాన్యం నిల్వకు అవకాశం

  • అయినా మిల్లర్లు, వ్యాపారుల మాయ

  • సన్న బియ్యానికి కృత్రిమ కొరత

  • 26 కిలోల బస్తా ధర 2 వేలు

  • కిలోపై నెలకు రూ.5-6 పెంపు

  • పప్పు ధాన్యాలు, నిత్యావసరాల ధరలూ పైపైకి

  • క్షేత్రస్థాయిలో తనిఖీలు నిల్‌

  • రేషన్‌ బియ్యం పక్కదారిపైనా నిఘా నాస్తి

(అమరావతి-ఆంధ్రజ్యోతి): గత మూడేళ్లూ ప్రభుత్వ అంచనా మేరకు రైతులు వరి సాగు చేశారు. ధాన్యం దిగుబడి ఆశించిన స్థాయిలో వచ్చింది. సాధారణంగా మూడేళ్ల పాటు ధాన్యం నిల్వ చేసుకునే అవకాశం ఉంది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులున్నా కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి, పెన్నా డెల్టాల్లో ఖరీఫ్‌ పంటకు సాగునీటి లభ్యత దాదాపు సరిపడానే ఉంది. త్వరలో ఖరీఫ్‌ ధాన్యం రానుంది. అయితే ఎల్‌నినోను బూచిగా చూపుతూ వ్యాపారులు దోపిడీ చేస్తున్నారు. ఈ ఏడాది వర్షాభావం, సాగునీటి కొరతతో పంటలు పండలేదని సాకులు చెబుతూ.. ధాన్యానికి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. పాత ధాన్యం నిల్వలున్నా నెలనెలా ధరలు అంతకంతకూ పెంచేస్తున్నారు. వినియోగదారులపై భారం మోపి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.

బియ్యంతో పాటు పప్పుధాన్యాలు, వంట నూనెలు, కూరగాయలు, నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. చాలామంది అన్నానికి వాడుతున్న సన్న బియ్యాన్ని డిమాండ్‌గా అమ్ముతున్నారు. బీపీటీ, సోనా మసూరి వంటి సన్నరకాలు జూన్‌లో 26 కిలోల బస్తా రూ.1,250 ఉంటే.. ఇప్పుడు దాదాపు రూ.2000కు చేరింది. సన్నబియ్యం కిలో రూ.50 నుంచి రూ.75-80కు పెరిగింది. నెలకు కిలోకు రూ.ఐదారు పెంచేస్తున్నారు. బియ్యం ధరల పెరుగుదల తీరును చూస్తుంటే.. రానున్న రోజుల్లో కిలో రూ.100 మార్క్‌ దాటినా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం సాధారణ రకం కూడా కిలో రూ.50కి తక్కువ అమ్మడం లేదు. కిలో రూ.60-65 చెప్తున్నారు. బియ్యం ధరలు పెరిగిపోతుంటే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేసిన దాఖలా లేదు.


పాత ధాన్యం, బియ్యం నిల్వలు లేవంటూ ధరలు పెంచేస్తుంటే.. నిజంగా నిల్వలు తరిగిపోయాయా? ఉన్న సరుకు ఎక్కడికిపోతోంది? డిమాండ్‌ ఎందుకు వచ్చింది? ధరల పెరుగుదలకు కారణాలేంటి? అన్న అంశాలపై కనీసం పరిశీలన, పర్యవేక్షణ కొరవడింది. క్షేత్రస్థాయిలో తనిఖీలు తూతూ మంత్రంగా చేయడమే సమస్యకు కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

గత మూడేళ్లూ విరివిగా వరి సాగు

ఎల్‌నినోతో వర్షాలు కురవక వరి సాగు తగ్గిందనే అపోహలు సృష్టించి కొందరు వ్యాపారులు బియ్యం ధరలు పెంచేస్తున్నట్లు స్పష్టమౌతోంది. 2026 ఖరీఫ్‌లో వరి 15.14 లక్షల హెక్టార్లకు 14.54 లక్షల హెక్టార్లలో(96 శాతం) సాగైంది. 2025-26 రబీలో వరి 7.45 లక్షల హెక్టార్లకు 9.19 లక్షల హెక్టార్లలో(123శాతం) సాగైంది. 2025 ఖరీఫ్‌లో 15.55 లక్షల హెక్టార్లకు 15.59 లక్షల హెక్టార్లలో(105శాతం)సాగైంది. 2024-25 రబీలో వరి సాగు కొంత తగ్గింది. 2024 ఖరీ్‌ఫలో 15.63 లక్షల హెక్టార్లకు 13.90 లక్షల హెక్టార్లలో (92శాతం) సాగైంది. వ్యవసాయశాఖ అంచనా ప్రకారం వార్షిక ధాన్యం ఉత్పత్తి 18.7 కోట్ల బస్తాలు(బస్తా 75కిలోల చొప్పున) దిగుబడి అంచనా ఉంది.

పౌరసరఫరాల శాఖ ఏటా సగటున 65 లక్షల క్వింటాళ్ల ధాన్యం సేకరిస్తోంది. సాధారణంగా మూడు సీజన్ల ధాన్యం, బియ్యం నిల్వకు అవకాశం ఉంటుంది. గత మూడు సీజన్లలో సగటు సాగు పెద్దగా తగ్గలేదు. పైగా ధాన్యం దిగుబడి, బియ్యం ఉత్పత్తి కూడా తగ్గలేదు. అలాంటప్పుడు బియ్యం నిల్వలు ఎందుకు తగ్గిపోయాయన్నది ప్రశ్న. ధాన్యం అధికంగా పండించే కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి, పెన్నా డెల్టాల్లో వర్షపాతం తగ్గినా.. ఖరీఫ్‌ పంటకు సాగునీటి లభ్యత దాదాపు సరిపడానే జరిగింది. ఖరీఫ్‌ ధాన్యం రానున్న తరుణంలో పాత బియ్యం నిల్వలు అయిపోయినట్లు.. ధరలు పెంచేస్తున్న తీరుపై ప్రభుత్వం క్షేత్రస్థాయిలో నిఘా పెట్టి, కృత్రిమ డిమాండ్‌ను అరికట్టాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు.


రేషన్‌ బియ్యం మార్కెట్లోకి..

ధరల పెరుగుదల నేపథ్యంలో తక్కువ ధరకు మంచి బియ్యం అందిస్తామంటూ గత ఆగస్టు నుంచి రైస్‌మిల్లర్ల అసోసియేషన్‌ సమన్వయంతో రైతుబజార్లలో పౌరసరఫరాల శాఖ కిలో రూ.52 చొప్పున మంచి బియ్యం కౌంటర్లు ఏర్పాటు చేసింది. ఒక్కో రైతుబజార్‌లో రోజుకు సగటున ఐదు క్వింటాళ్ల బియ్యం అమ్ముడుపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వందకు పైగా రైతుబజార్లలో ఈ బియ్యం కౌంటర్లు నడుస్తున్నాయి. అయితే చాలా చోట్ల డిమాండ్‌కు సరిపడా సరఫరా చేయడం లేదు. విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో నో స్టాక్‌ బోర్డులు కనిపించాయి.

గ్రామీణ ప్రాంతాల్లోని మండల కేంద్రాలు, కూడళ్లలో తక్కువ ధరకు బియ్యం విక్రయించే కౌంటర్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయలేదు. దీంతో వినియోగదారులు మార్కెట్‌లో తప్పక కొనాల్సిన పరిస్థితి. మరోవైపు ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో పోర్ట్‌ఫైడ్‌ రేషన్‌కార్డులపై ఉచితంగానే ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెలా రేషన్‌ షాపులకు 23.84 లక్షల క్వింటాళ్లు.. హాస్టళ్లు, ఇతర అవసరాలకు మరో 6 లక్షల క్వింటాళ్ల బియ్యం పౌరసరఫరాల శాఖ సరఫరా చేస్తోంది. అయినా అత్యధికమంది కార్డుదారులు రేషన్‌ షాపుల్లోని బియ్యం తినడానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో బియ్యం పక్కదారి పడుతోంది. అదే బియ్యం రీసైక్లింగ్‌ చేసి మళ్లీ మార్కెట్‌లోకి రైస్‌ బ్యాగుల రూపంలో వస్తోంది.

ఈ వార్తలనూ చదవండి:

జగన్ ఆదేశాల మేరకే పులివెందులలో వైసీపీ అరాచకం: టీడీపీ నేతలు

దసరా స్పెషల్ ట్రైన్లు.. ఛార్జీల పెంపుపై దక్షిణ మధ్య రైల్వే క్లారిటీ

Updated Date - Oct 18 , 2026 | 03:28 AM