పీఠం ఎవరికి ?
ABN , Publish Date - Nov 17 , 2026 | 05:41 AM
జిల్లా పరిషత్ చైర్పర్సన్ పీఠాలపై ఎవరెవరు కొలువుదీరతారన్న దానిపై కూటమి పార్టీల్లో ఉత్కంఠ కొనసాగుతోంది
27 జడ్పీల్లో భారీగా కూటమి ఆశావహులు
కొన్ని జిల్లాల కోసం టీడీపీ, జనసేన పట్టు
శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ,
పశ్చిమ, కృష్ణా, సత్యసాయిలో పోటీ
3 పార్టీల అగ్ర నేతల కసరత్తు ముమ్మరం
స్పష్టత రాగానే రేపు అభ్యర్థుల ప్రకటన
అటు టీడీపీలోనూ అంతర్గత రేసు
తొలి నుంచీ పార్టీలో ఉన్నవారికేప్రాధాన్యమివ్వాలంటున్న శ్రేణులు
కూటమి పార్టీల్లో ఉత్కంఠ
అమరావతి, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్ చైర్పర్సన్ పీఠాలపై ఎవరెవరు కొలువుదీరతారన్న దానిపై కూటమి పార్టీల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెల 20న జడ్పీ చైర్మన్ల ఎన్నిక జరగనున్న నేపథ్యంలో చైర్మన్ల ఎన్నికపై టీడీపీ, జనసేన, బీజేపీ అగ్ర నేతలు కసరత్తు ముమ్మరం చేశారు. బుధవారం (18న) చైర్మన్ల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. కొన్ని స్థానాలపై చర్చలు తేలకపోతే ఆ స్థానాలకు 19న ప్రకటన చేస్తారు. మొత్తం 28 జిల్లా పరిషత్ స్థానాల్లో అల్లూరి సీతారామరాజు తప్ప మిగిలిన 27 జడ్పీలను కూటమి కైవసం చేసుకుంది. చైర్పర్సన్ స్థానాల పంపిణీపై కూటమి పార్టీల నడుమ చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. కొన్ని జిల్లాల కోసం టీడీపీ, జనసేన నడుమ గట్టిపోటీయే నడుస్తోంది. టీడీపీలోనూ అంతర్గతంగా రెండు గ్రూపుల నడుమ హోరాహోరీ పోటీ నెలకొంది. తొలి నుంచీ పార్టీనే నమ్ముకున్న వర్గానికి.. పార్టీ ఓడిపోయినప్పుడల్లా వైసీపీలోకి వెళ్లి అధికారంలోకి రాగానే తిరిగి టీడీపీలోకి వచ్చే వర్గానికి మధ్య చాలా చోట్ల పోటీ ఏర్పడింది. మొదటి నుంచీ పార్టీ కోసం నిలబడిన వారికి న్యాయం చేయాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.
పోటీదారులు వీరే: శ్రీకాకుళం జడ్పీ చైర్మన్ పీఠాన్ని టీడీపీ, జనసేన రెండూ కోరుతున్నాయి. జనసేన నుంచి సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ భార్య, ఎల్‌ఎన్‌పేట చైర్పర్సన్ పదవులకు 20న ఎన్నికలు
జడ్పీటీసీ భవాని రేసులో ఉండగా.. టీడీపీ నుంచి ఆమదాలవలస జడ్పీటీసీ తమ్మినేని సుజాత ఆశిస్తున్నారు. సుజాత టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు సమీప బంధువు.
విజయనగరం జడ్పీ చైర్పర్సన్ పదవి కోసం ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను) కుమార్తె సిరిసహస్ర పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈమె బీసీ సర్టిఫికెట్‌పై వివాదం నెలకొన్న నేపథ్యంలో మరొకరి పేరు పరిశీలించాల్సి వస్తే పూసపాటిరేగ జడ్పీటీసీ, మార్క్‌ఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజు కుమార్తె చంద్రకళ పేరు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. 2024 ఎన్నికల్లో జనసేనకు నెల్లిమర్ల అసెంబ్లీ సీటు కేటాయించడంతో బంగార్రాజు ఆ స్థానాన్ని వదులుకోవలసి వచ్చింది. ఈ కారణంగా తన కుమార్తెకు జడ్పీ పీఠమివ్వాలని ఆయన కోరుతున్నారు.
పార్వతీపురం మన్యం.. పెద్దగా పోటీ లేదు. టీడీపీ నుంచి మాజీ ఎంపీ ప్రదీ్పచంద్రదేవ్ కుమారుడు, కురుపాం జడ్పీటీసీ వీరేశ్‌చంద్రదేవ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. జనసేన కూడా ఈ స్థానాన్ని కోరుతోంది. బామిని జడ్పీటీసీ నిమ్మల నీలిమ రేసులో ఉన్నారు.
విశాఖపట్నం.. టీడీపీ నేత గాడు వెంకటప్పడు భార్య, భీమిలి జడ్పీటీసీ అలివేణి, పెందుర్తి జడ్పీటీసీ సుఖవాసి అజయ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఉన్నదే నలుగురు జడ్పీటీసీలు. అయినా పోటీ ఉండడం గమనార్హం.
అనకాపల్లి.. టీడీపీ, జనసేన నడుమ పోటీ నడుస్తోంది. టీడీపీ నుంచి దేవరాపల్లి జడ్పీటీసీ కిలపర్తి రాజేశ్వరి, జనసేన తరఫున రాంబిల్లి జడ్పీటీసీ సేనాపతి రత్నం, బుచ్చయ్యపేట జడ్పీటీసీ పోతల భవాని రేసులో ఉన్నారు.
కాకినాడ.. ఇక్కడా టీడీపీ, జనసేన నడుమ గట్టి పోటీ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే, కాకినాడ రూరల్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, కాకినాడ రూరల్ జడ్పీటీసీ పిల్లి అనంతలక్ష్మి, జనసేన నుంచి పెద్దాపురం జడ్పీటీసీ బుర్రా దివ్య సునీతారాజ్ ఆశిస్తున్నారు.
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ.. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కుమార్తె, రాజోలు టీడీపీ ఇన్చార్జి, మామిడికుదురు జడ్పీటీసీ అమూల్య, ఐ.పోలవరం జడ్పీటీసీ వీరసత్యకుమారి రేసులో ఉన్నారు. వీరసత్యకుమారి కేసనకుర్రు పంచాయతీకి రెండు సార్లు సర్పంచ్‌గా పనిచేశారు. సూర్యారావు వైసీపీ రాజోలు ఇన్చార్జిగా ఉన్నారు.
పోలవరం.. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే, అడ్డతీగల జడ్పీటీసీ వంతల రాజేశ్వరి, గంగవరం జడ్పీటీసీ తీగల ప్రభ, వై.రామవరం జడ్పీటీసీ గొర్లె అమ్మాజీ పోటీ పడుతున్నారు.
తూర్పుగోదావరి.. ఈ పీఠాన్ని జనసేనకు కేటాయించే అవకాశముంది. కడియం జడ్పీటీసీ రత్నం మహేశ్వరీదేవి ఆ పార్టీ నుంచి రేసులో ఉన్నారు. ఒకవేళ టీడీపీకి దక్కేపక్షంలో గోపాలపురం జడ్పీటీసీ రామతులసి ఆశిస్తున్నారు.
పశ్చిమగోదావరి.. టీడీపీ, జనసేన పోటీ పడుతున్నాయి. టీడీపీ నుంచి తొలి నుంచీ పార్టీలో ఉన్న గణపవరం జడ్పీటీసీ ఇందుకూరి రామకృష్ణరాజు, జనసేన తరఫున ఉండి జడ్పీటీసీ పీవీఎల్ నరసింహరాజు రేసులో ఉన్నారు. ఈయన వైసీపీలో సుదీర్ఘకాలం ఉండి ఇటీవలే జనసేనలో చేరారు.
ఏలూరు.. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె, పెదవేగి జడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికైన నవ్యశ్రీ రేసులో ముందున్నారు. మాజీ ఎమ్మెల్యే గంటా మురళి రామకృష్ణ కుమార్తె, కామవరపు కోట జడ్పీటీసీ మందలపు జాహ్నవి కూడా ఈ పీఠాన్ని ఆశిస్తున్నారు.
ఎన్టీఆర్.. గంపలగూడెం జడ్పీటీసీ కోట పుల్లమ్మ పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఎంటెక్ చదివిన ఈమె గంపలగూడెం సర్పంచ్‌గా పనిచేశారు. గంపలగూడెం జడ్పీటీసీ జనరల్ మహిళకు రిజర్వు అయినప్పటికీ జడ్పీ ఛైర్పర్సన్ను చేయాలన్న ఉద్దేశంతోనే ఎస్సీ సామాజికవర్గానికి చెందిన పుల్లమ్మను అక్కడి నుంచి పోటీ చేయించారు. ఈమె తండ్రి కోట లక్ష్మయ్య కూడా గతంలో సర్పంచ్‌గా పనిచేశారు. జిల్లాలోని టీడీపీ నాయకులంతా ఈమె అభ్యర్థిత్వంపై ఏకతాటిపై ఉన్నారు.
కృష్ణా.. జడ్పీ పీఠం కోసం టీడీపీ, జనసేన నడుమ పోటీ నడుస్తోంది. టీడీపీ నుంచి అవనిగడ్డ జడ్పీటీసీ విక్కుర్తి జయలక్ష్మి, కంకిపాడు జడ్పీటీసీ దండమూడి పూజిత, పమిడిముక్కల జడ్పీటీసీ ప్రవళి రేసులో ఉన్నారు. జయలక్ష్మి అవనిగడ్డ టీడీపీ ఇన్చార్జి విక్కుర్తి శ్రీనివాస్ భార్య కాగా.. పూజిత భర్త దండమూడి చౌదరి ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు. వైసీపీ హయాంలో ఈయనపై 20కిపైగా కేసులు పెట్టారు. తాతినేని ప్రవళి ప్రముఖ ఎన్ఆర్ఐ తాతినేని సురేశ్ కుమార్తె. న్యాయవాదిగా పనిచేస్తున్నారు.
గుంటూరు.. వట్టిచెరుకూరు జడ్పీటీసీ దారా అరుణ, పెదనందిపాడు జడ్పీటీసీ దొప్పల ఉషాకిరణ్మయి రేసులో ఉన్నారు.
పల్నాడు.. నకరికల్లు జడ్పీటీసీ డాక్టర్ నాగోతు లక్ష్మీ వెంకట సరోజ, పెదకూరపాడు జడ్పీటీసీ నల్లపాటి కీర్తనచౌదరి, పిడుగురాళ్ల జడ్పీటీసీ డాక్టర్ వున్నం దీపిక పోటీ పడుతున్నారు. సరోజ కుటుంబం తొలి నుంచీ పార్టీని నమ్ముకుని ఉండడం ఆమెకు కలిసి వచ్చే అంశం.
బాపట్ల.. జడ్పీ చైర్‌పర్సన్‌గా టీడీపీ నుంచి చెరుకుపల్లి జడ్పీటీసీ పూషడపు రోహిణి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. నిజాంపట్నం జడ్పీటీసీ కె.రమాదేవి కూడా ఆశిస్తున్నారు.
ప్రకాశం.. ఈ జడ్పీ చైర్మన్ స్థానం ఎస్సీలకు రిజర్వ్ అయింది. రాష్ట్రం మొత్తమ్మీద పోటీ ఎక్కువగా ఉన్న జిల్లా పరిషత్ ఇదే. ఏకంగా ఏడుగురు టీడీపీ జడ్పీటీసీలు పోటీ పడుతున్నారు.
మార్కాపురం.. చైర్మన్ రేసులో దోర్నాల జడ్పీటీసీ కందుల రామిరెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది.
నెల్లూరు.. ఇద్దరు టీడీపీ మాజీ ఎమ్మెల్యేల నడుమ పోటీ నెలకొంది. కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఇందుకూరుపేట జడ్పీటీసీగా, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి దుత్తలూరు జడ్పీటీసీగా గెలిచి ఈ పీఠాన్ని ఆశిస్తున్నారు.
కర్నూలు.. టీడీపీ కౌతాళం జడ్పీటీసీ ఉలిగయ్య పేరు బలంగా వినిపిస్తోంది. ఈయన పార్టీ ఆవిర్భావం నుంచీ కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో మంత్రాలయం అసెంబ్లీ టికెట్ ఆశించారు. దేవనకొండ జడ్పీటీసీ డాక్టర్ షేక్ సాదికా, తుగ్గలి జడ్పీటీసీ గీతా కుమారి కూడా రేసులో ఉన్నారు.
నంద్యాల.. టీడీపీ నుంచి ఆళ్లగడ్డ జడ్పీటీసీ పోరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, వెలుగోడు జడ్పీటీసీ గుండం వెంకటరమణారెడ్డి, సిరివెళ్ల జడ్పీటీసీ కాటంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి రేసులో ఉన్నారు.
అనంతపురం.. టీడీపీ గార్లదిన్నె జడ్పీటీసీ సభ్యుడు గంజే నాగరాజు, బుక్కరాయసముద్రం జడ్పీటీసీ బండి ఉజ్జినమ్మ పోటీపడుతున్నారు.
శ్రీసత్యసాయి.. టీడీపీ, జనసేన పోటీ పడుతున్నాయి. టీడీపీ నుంచి నల్లచెరువు జడ్పీటీసీగా గెలుపొందిన పరిటాల శ్రీరామ్ రేసులో ఉండగా.. జనసేన నుంచి పుట్టపర్తి జడ్పీటీసీగా గెలుపొందిన చిలకం మధుసూదన్‌రెడ్డి జడ్పీ చైర్మన్ పదవి ఆశిస్తున్నారు.
కడప.. జడ్పీ చైర్మన్ పదవి తమకివ్వాలని బీజేపీ కోరినా.. కీలకమైన ఈ స్థానాన్ని ఇచ్చేందుకు టీడీపీ ససేమిరా అంటోంది. టీడీపీ నుంచి వీరపనేనిపల్లె జడ్పీటీసీ, మాజీ ఎమ్మెల్యే పుత్తా నరసింహారెడ్డి, పులివెందుల జడ్పీటీసీ భారతి రేసులో ఉన్నారు. జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తన అన్న కుమారుడు రాజేశ్‌రెడ్డిని జడ్పీ చైర్మన్‌ను చేసేందుకు ఈ స్థానాన్ని బీజేపీకి కోరుతున్నారు.
అన్నమయ్య.. టీడీపీ నుంచి గాలివీడు జడ్పీటీసీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌బాబు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈయన మాజీ ఎంపీ-ఎమ్మెల్యే పాలకొండ్రాయుడి కుమారుడు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ ఈ కుటుంబం పార్టీలో కొనసాగుతోంది.
చిత్తూరు.. టీడీపీ నుంచి పూతలపట్టు జడ్పీటీసీ శైలజా తేజోమూర్తి, గుడిపాల జడ్పీటీసీ మమతశ్రీ, బంగారుపాళెం జడ్పీటీసీ సుచరిత జయప్రకాశ్, పాలసముద్రం జడ్పీటీసీ జాహ్నవి రేసులో ఉన్నారు.
తిరుపతి.. టీడీపీ నుంచి సత్యవేడు మాజీ ఎమ్మెల్యే, నాగలాపురం జడ్పీటీసీ హేమలత, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి కుమార్తె డాక్టర్ పనబాక చేతన ఉన్నారు. చేతన శ్రీకాళహస్తి జడ్పీటీసీగా గెలుపొందారు.
ఇవి కూడా చదవండి..
స్థానిక సంస్థల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
భారత్‌లో ఓ భిన్నమైన దృశ్యం కనిపించింది: ప్రిన్స్ విలియమ్