Share News

నమ్మకద్రోహి ఎవరు?

ABN , Publish Date - Aug 30 , 2026 | 04:37 AM

తాను ఏనాడూ నమ్మకద్రోహం పనులు చేయలేదని వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. తాను నమ్మకద్రోహినే అయితే సకల శాఖా మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మాదిరిగా ఆనాడే కాంగ్రెస్‌తో సంధి చేసుకునేవాడినన్నారు

నమ్మకద్రోహి ఎవరు?

  • నేనే అయితే అప్రూవర్‌గా మారేవాణ్ని

  • జగన్‌కు నమ్మకస్తుడనే నాపై కేసులు, జైలు

  • సజ్జల పేరు ఏ కేసులోనూ లేదేం?

  • పార్టీ ప్లీనరీలో ఆయన నాపై భౌతికదాడి చేశారు: విజయసాయి

అమరావతి, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): తాను ఏనాడూ నమ్మకద్రోహం పనులు చేయలేదని వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. తాను నమ్మకద్రోహినే అయితే సకల శాఖా మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మాదిరిగా ఆనాడే కాంగ్రెస్‌తో సంధి చేసుకునేవాడినన్నారు. సీబీఐ, ఈడీ చార్జిషీట్‌లో తన పేరులేకుండా చేసుకుని ఉండేవాడినని, అప్రూవర్‌గా మారేవాడినని పేర్కొన్నారు. జగన్‌కు నమ్మకస్తుడినన్న కారణంతో ఆయనతో పాటు ప్రతి చార్జిషీట్‌లోనూ అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం తనను చేర్చిందన్నారు. జగన్‌ను 16 నెలలు, తనను 15 నెలలు జైల్లో పెట్టారన్నారు. వైసీపీలో తనపై జరుగుతున్న దుష్ప్రచారానికి శనివారం ఆయన ‘ఎక్స్‌’లో ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. మంగళగిరిలో 2022లో జరిగిన పార్టీ ప్లీనరీలో సజ్జల రామకృష్ణారెడ్డి తనపై భౌతికదాడి చేశారని విజయసాయి రెడ్డి ఆరోపణలు చేశారు. పార్టీ అధినేత జగన్‌కు తెలిసీ ప్రేక్షకపాత్ర వహించారని, అక్కడున్న నాయకులు కూడా చూశారని తెలిపారు. ‘వైసీపీ ప్రభుత్వంలో సకల శాఖా మంత్రిగా పేరుగాంచిన సజ్జల పేరు ఏ కేసులోనూ లేదు.


2024 ఎన్నికల తర్వాత నాకు సంబంధం లేని లిక్కర్‌ స్కామ్‌లో ఏ-5గా చేర్చారు. కాకినాడ సీ-పోర్టు కేసులో ఏ-2గా చేర్చారు. జగన్‌కు వెన్నుపోటు పొడుస్తూ ఏ కేసులూ లేకుండా ఎలా చేసుకోవాలో అక్కడ ఉన్న కోటరీ నాయకుడికి తెలిసినంతగా నాకు తెలియదు. ఇప్పుడు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్న ఉత్తరాంధ్ర నాయకుడితో కలసి ఈ కోటరీ నాయకుడు జగన్‌కు నాపై చాడీలు చెప్పించి ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించడానికి కారణమయ్యాడు. జగన్‌ మెప్పు పొందేందుకు నాస్తికుడిగా, కమ్యూనిస్టుగా చెప్పుకొనే ఆయన వైసీపీకే కాదు.. రాష్ట్రానికే నమ్మకద్రోహి. ఢిల్లీలో, పార్టీలో నన్ను అవమానకరంగా అంచెలంచెలుగా తగ్గించిందెవరు? పొమ్మనలేక పొగబెట్టిందెవరు? 2019 ఎన్నికల్లో విజయం తర్వాత సజ్జల ప్రమేయ ఎలా శృతి మించింది? సజ్జల సకల శాఖల మంత్రిగా, ఒక రాజ్యాంగేతర శక్తిగా తన ముఠాతో పాలన చేశారు. జగన్‌ను నాయకులు ఎవరూ కలవకుండా గోడ కట్టింది ఈ సజ్జల కాదా? కుటుంబ సభ్యులు సైతం దూరమైంది సజ్జల వల్ల కాదా? 2029లో మరోసారి పార్టీ ఓడిపోతే సీనియర్లు, నాయకులు, కార్యకర్తలు సజ్జలను తిట్టుకుంటూ రాజకీయాల నుంచి రిటైర్డ్‌ అయిపోవాల్సిందేనా?’ అని విజయసాయిరెడ్డి విమర్శించారు.

Also Read:

సింహాద్రి అప్పన్న ఆలయంలో ముగ్గురు ఉద్యోగుల సస్పెండ్‌

గత ప్రభుత్వానికి నరకడం తప్ప.. నాటే ఆలోచనే రాలేదు: నాగబాబు

Updated Date - Aug 30 , 2026 | 04:37 AM