Share News

పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి శాఖ క్లారిటీ.. రాజ్యసభ వేదికగా వివరాలు వెల్లడి..

ABN , Publish Date - Aug 10 , 2026 | 07:24 PM

పోలవరం ప్రాజెక్టు తొలి దశ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన సవరించిన అంచనా వ్యయం రూ.30,436.95 కోట్లని కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించింది. తొలి దశలో 41.15 మీటర్ల వరకు ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపింది.

పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి శాఖ క్లారిటీ.. రాజ్యసభ వేదికగా వివరాలు వెల్లడి..
Polavaram Project Details

న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు తొలి దశ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన సవరించిన అంచనా వ్యయం రూ.30,436.95 కోట్లని కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించింది. తొలి దశలో 41.15 మీటర్ల వరకు ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపింది. గత ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.12,620.53 కోట్ల నిధులు విడుదల చేసిందని పేర్కొంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.5,512.40 కోట్లు కేటాయించినట్లు వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు పురోగతిపై రాజ్యసభలో బీజేపీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.


ఈ సందర్భంగా స్పిల్‌వే నిర్మాణంలో ఇప్పటివరకు 96.87 శాతం మట్టి పనులు పూర్తయ్యాయని కేంద్ర జలశక్తి శాఖ తెలిపింది. కాంక్రీట్ పనులు 98.84 శాతం, స్టీల్ పనులు 92.9 శాతం మేర పూర్తయ్యాయని వెల్లడించింది. అలాగే ఎర్త్‌-కమ్‌-రాక్‌ఫిల్ డ్యామ్‌కు సంబంధించి కాంక్రీట్ పనులు 81.99 శాతం పూర్తయ్యాయని పేర్కొంది. ప్రధాన కాలువల తవ్వకం పనులు 98.96 శాతం పూర్తయ్యాయని వివరించింది. ప్రాజెక్టు తొలి దశలో మిగిలిన పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. పోలవరం తొలి దశలో నిర్వాసిత కుటుంబాల పునరావాసం, పునరావాస ప్యాకేజీల అమలుపైనా కేంద్రం వివరాలు వెల్లడించింది. ఇప్పటివరకు 17,892 నిర్వాసిత కుటుంబాలను తరలించినట్లు తెలిపింది.


ఆర్‌అండ్‌ఆర్‌ పరిహారం కింద రూ.1,373.01 కోట్లు పంపిణీ చేసినట్లు కేంద్రం పేర్కొంది. పునరావాసం, పునరావాస పనులకు అదనంగా రూ.1,581.08 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు తొలి దశను మార్చి 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్రం తెలిపింది. అవసరమైతే మరో ఏడాది గడువు పొడిగించే వెసులుబాటు కూడా ఉందని స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వాసితుల పునరావాసం, పునరావాస పనులను సమాంతరంగా ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు కొనసాగుతున్నాయని రాజ్యసభకు ఇచ్చిన సమాధానంలో కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది.


ఈ వార్తలు కూడా చదవండి

ఈ జీవోకు, ఫార్చ్యూన్ ఇండియా కథనానికి సంబంధం లేదు: ఏపీ ప్రభుత్వం క్లారిటీ

వైసీపీ నేత చింతాడ రవికుమార్‌కు బిగుస్తోన్న ఉచ్చు

Updated Date - Aug 10 , 2026 | 07:31 PM