Share News

పంచాయతీ ఎన్నికల్లో కూటమిదే విజయం: ఎమ్మెల్సీ నాగబాబు

ABN , Publish Date - Nov 21 , 2026 | 01:42 PM

ఆంధ్రప్రదేశ్‌ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భీమవరం ప్రాంతంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయం సాధిస్తుందని ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ధీమా వ్యక్తం చేశారు. కూటమి పార్టీల మధ్య సమన్వయం ఉందని, ఎన్నికల సమయానికి మూడు పార్టీలు కలిసి పనిచేస్తాయని ఆయన స్పష్టం చేశారు.

పంచాయతీ ఎన్నికల్లో కూటమిదే విజయం: ఎమ్మెల్సీ నాగబాబు
MLC Konidela Nagababu

ప.గో.జిల్లా, నవంబర్ 21: ఆంధ్రప్రదేశ్‌ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భీమవరం ప్రాంతంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయం సాధిస్తుందని ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ధీమా వ్యక్తం చేశారు. కూటమి పార్టీల మధ్య సమన్వయం ఉందని, ఎన్నికల సమయానికి మూడు పార్టీలు కలిసి పనిచేస్తాయని ఆయన స్పష్టం చేశారు. ప్రతి పార్టీలోనూ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశించే నాయకులు, కార్యకర్తలు చాలామంది ఉంటారని, అయితే అందరికీ అవకాశం కల్పించడం సాధ్యం కాదన్నారు. టికెట్ల కేటాయింపు విషయంలో అసంతృప్తులు ఉన్నప్పటికీ, కూటమి నిర్ణయం ఒక్కటేనని అన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య భిన్నాభిప్రాయాలకు తావులేదని ఎమ్మెల్సీ నాగబాబు వ్యాఖ్యానించారు.


గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని ఎమ్మెల్సీ నాగబాబు విమర్శించారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలంటే కనీసం మరో 15 సంవత్సరాలు వేచి చూడాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఏపీలో కూటమి ఐక్యత, గ్రామస్థాయిలో మూడు పార్టీల సమన్వయమే రానున్న ఎన్నికల్లో కీలకమని అన్నారు. టికెట్లు ఆశించే నాయకులు ఎక్కువగా ఉన్నప్పటికీ, పార్టీలు తీసుకునే ఉమ్మడి నిర్ణయానికి కట్టుబడి పనిచేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. పంచాయతీ ఎన్నికల వేళ నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


కాగా, ఏపీలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. మొదటి విడత పోలింగ్ ఈ నెల 26న, రెండో విడత 29న, మూడో విడత పోలింగ్ డిసెంబర్ 2న జరగనున్నాయి. ఈ మేరకు మూడు విడతలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్లను ఇప్పటికే అధికారులు విడుదల చేశారు. ఈ నెల 13న మొదటి విడత, 16న రెండో విడత, 19న మూడో విడత ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్లను ఎన్నికల సంఘం విడుదల చేసింది. పోలింగ్ వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల యంత్రాంగం పటిష్ట చర్యలు చేపడుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి

రాజకీయాల్లో వీడ్కోలు ఉండదు.. మాజీ కార్పొరేటర్లకూ సమాన గౌరవం: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

స్థానిక ఎన్నికల్లో 90 శాతం పైగా కూటమి స్ట్రైక్ రేట్ సాధించాం: సీఎం చంద్రబాబు

Updated Date - Nov 21 , 2026 | 01:48 PM