‘పశ్చిమ’ను వీడని వరద కన్నీరు
ABN , Publish Date - Nov 10 , 2026 | 05:48 AM
అర్నబ్, మురసు తుఫాన్లు వెళ్లి పది రోజులు గడుస్తున్నా పశ్చిమ గోదావరి జిల్లా ఇంకా వరదలోనే ఉంది. ఎడతెరిపిలేని వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరదలతో ప్రధాన కాలువలు, డ్రెయిన్లు పొంగుతున్నాయి.
తుఫాన్లు పోయి పది రోజులైనా అదే ఉధృతి
ప్రమాదకరంగా పారుతున్న వయ్యేరు, గోస్తనీ, ఎర్ర కాలువ
పొలాల్లోకి యనమదుర్రు డ్రెయిన్ నీరు
నీళ్లలో కుళ్లుతున్న వరి పంట చేలు
రెండు లక్షల ఎకరాల్లో మొలకలు
భీమవరం రూరల్, తాడేపల్లిగూడెం, తణుకు రూరల్, అత్తిలి, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): అర్నబ్, మురసు తుఫాన్లు వెళ్లి పది రోజులు గడుస్తున్నా పశ్చిమ గోదావరి జిల్లా ఇంకా వరదలోనే ఉంది. ఎడతెరిపిలేని వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరదలతో ప్రధాన కాలువలు, డ్రెయిన్లు పొంగుతున్నాయి. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా వేలాది ఎకరాల్లోకి నీరు చేరి పంటలు కుళ్లిపోతున్నాయి. వరి పనల నుంచి మొలకలు వచ్చాయి. వందలాది ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తాడేపల్లిగూడెం పరిధిలోని నందమూరు, మారంపల్లి ఆయకట్టులో ఎర్రకాలువ వరద తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వందలాది ఎకరాల పంట వారం రోజులుగా నీటిలోనే ఉండిపోయింది. నందమూరు కొత్త అక్విడెక్డ్ వద్ద నీటిమట్టం 34 అడుగులకు చేరింది.
ఇక్కడి నుంచి దిగువకు వెళ్తున్న వరదే మిగిలిన కాలువల ఉధృతికి కూడా ప్రధాన కారణమవుతోంది. ఎర్రకాలువ వరద నేరుగా వచ్చి చేరడంతో ఆకివీడు మండలంలో వెంకయ్య వయ్యేరు గట్లు దాటి ప్రవహిస్తోంది. గుమ్ములూరు, చినకాపవరం, పెదకాపవరం, తరటావ, అప్పారావుపేట, కోళ్లపర్రు తదితర గ్రామాల్లో వేలాది ఎకరాల వరిని ముంచేసింది. గుమ్ములూరు, చినకాపవరంలో ప్రజల ఇళ్లలోకి నీరు చేరింది. తణుకు మండలంలో ఎర్ర కాలువతోపాటు కొవ్వాడ కాలువ వరద తోడవడంతో దువ్వ వయ్యేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. సమీప జాతీయ రహదారిపైకి వరద నీరు చేరి రాకపోకలు స్తంభించాయి. రోడ్లపై భారీ గోతులు ఏర్పడటంతో ప్రయాణికులు గాయపడుతున్నారు. ఈ పట్టణంలో గోస్తనీ కాలువ పొంగి పొర్లడంతో వర్షపు నీరు బయటకు వెళ్లలేకపోయింది.
ఆరు రోజులుగా సజ్జాపురం, సంతమార్కెట్, శివాలయం వీధి, బ్యాంకు కాలనీ తదితర ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయి. వరద నీరు చేరడంతో బస్టాండ్‌ను మూసివేసి, ప్రయాణికులను రోడ్డుపైనే బస్సులు ఎక్కిస్తున్నారు. పాలకోడేరు మండలం గొల్లలకోడేరు వద్ద మురుగు నీరు ఇళ్ల చుట్టూ నిలిచిపోయి స్థానికులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టింది. యనమదుర్రు డ్రెయిన్ ఉధృతికి తోడు ఆరుదలకోడు అవుట్‌ఫాల్ స్లూయిజ్ గేట్లు మూసి ఉండటంతో వరద నీరు వెనక్కి తన్ని, అత్తిలి మండలంలోని గ్రామాలను ముంచెత్తింది. వరిఘేడులో 300, తిరుపతిపురంలో 700.. మొత్తం వెయ్యి ఇళ్లు ముంపునకు గురయ్యాయి.
వరిపంట నాశనం..
పశ్చిమ గోదావరి జిల్లాలో పది రోజులుగా నీళ్లల్లో నానుతున్న రెండు లక్షల ఎకరాల్లో వరి పంట నాశనమైంది. ప్రస్తుతం పంట చేలన్నీ కుళ్లిపోతున్నాయి. కొన్నిచోట్ల మొలకలు వస్తున్నాయి. వేంపాడులో ఆక్వా చెరువుల పడవలను తెచ్చుకుని, నీటిలో నానిపోయిన వరిని వాటి ద్వారా ఒడ్డుకు చేరుస్తున్న దృశ్యాలు రైతుల దైన్యస్థితికి అద్దం పడుతున్నాయి.
ఈ వార్తలనూ చదవండి: