Share News

ఢిల్లీ వీధుల్లో ‘సైకిల్ ఎంపీ’ సందడి.. కలిశెట్టి దార్శనికతకు నెటిజన్ల సలామ్!

ABN , Publish Date - May 16 , 2026 | 03:27 PM

దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలను గుర్తించి ప్రధాని నరేంద్ర మోదీ ఇంధనం పొదుపు చేయాలని సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. ఎందుకంటే..

ఢిల్లీ వీధుల్లో ‘సైకిల్ ఎంపీ’ సందడి.. కలిశెట్టి దార్శనికతకు నెటిజన్ల సలామ్!
Kalisetti Appalanaidu

ఢిల్లీ, మే 16: దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలను గుర్తించి ప్రధాని నరేంద్ర మోదీ ఇంధనం పొదుపు చేయాలని సూచించిన సంగతి తెలిసిందే. ప్రధాని పిలుపు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు తమ కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించుకున్నారు. అలానే పలువురు ప్రజాప్రతినిధులు కూడా ఇంధన పొదుపు పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. ఇంధన పొదుపు గురించి మోదీ చెప్పక ముందే అప్పలనాయుడు గతంలోనే ఈ ఆచరణను జీవితంలో భాగం చేసుకున్నారు. దీంతో ఈయన 'సైకిల్ ఎంపీ'గా ఇప్పుడు ట్రెండింగ్‌లో నిలిచారు.


పార్లమెంట్ సమావేశాలకు రోజూ సైకిల్‌పైనే వెళ్లడం ద్వారా ఆయన అప్పుడే ఒక స్పష్టమైన సందేశాన్ని దేశానికి ఇచ్చారు. అధికార హోదా ఉన్నప్పటికీ ఆడంబరాలకు దూరంగా ఉంటూ, సాధారణ ప్రజల మాదిరిగానే ప్రయాణించడం ఆయన ప్రత్యేకతగా నిలిచింది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. మరోవైపు రోజురోజుకీ పెరుగుతున్న కాలుష్యం నేపథ్యంలో సైకిల్ ప్రయాణమే ఉత్తమ ప్రత్యామ్నాయమని ఆయన ఆచరణతో చాటిచెప్పారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆయన ఫొటోలు, వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. 'ఇది పబ్లిసిటీ స్టంట్' అని విమర్శించిన వారికి కూడా ఏళ్లుగా నిరంతరం అదే జీవనశైలిని కొనసాగిస్తూ తన పనితీరుతోనే సమాధానం ఇచ్చారంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. 'మోదీ చెప్పకముందే ఇంధన పొదుపు మొదలుపెట్టిన నేత', 'నిజమైన ప్రజాప్రతినిధి', 'పర్యావరణ హిత రాజకీయ నాయకుడు' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.


విజయనగరం నేల నుంచే నిరాడంబరతకు చిరునామాగా నిలిచిన కలిశెట్టి అప్పలనాయుడు, ఇప్పుడు దేశ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అధికారంలో ఉన్నా అహంకారం లేకుండా, ప్రజలకు ఆదర్శంగా నిలవొచ్చని ఆయన నిరూపిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణపై చర్చలు మాటల్లోనే పరిమితమవుతున్న ఈ కాలంలో, సైకిల్‌పై పార్లమెంట్‌కు వెళ్లే ఎంపీగా కలిశెట్టి అప్పలనాయుడు చూపిస్తున్న నిబద్ధతకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 'విజయనగరం గడ్డ అంటే ఇదే.. నిరాడంబరతకు అడ్డా' అంటూ తెలుగు రాష్ట్రాల నెటిజన్లు గర్వంగా పోస్టులు పెడుతున్నారు. 'ఇంధనం ఆదా చేయాలి అంటే ముందుగా అలవాట్లు మారాలి.. నాయకులే ఆదర్శంగా నిలవాలి' అనే సందేశాన్ని తన జీవనశైలితోనే చెబుతున్న కలిశెట్టి అప్పలనాయుడు బాటలో ఇతర ప్రజాప్రతినిధులు నడవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.


ఇవి కూడా చదవండి...

స్వచ్ఛమైన పెనుకొండ కోసం ప్రజల సహకారం అవసరం: మంత్రి సవిత

ప్రతినెలా మూడో శనివారం ‘స్వచ్ఛాంధ్ర’ తప్పనిసరి: మంత్రి కొల్లురవీంద్ర

Updated Date - May 16 , 2026 | 03:54 PM