Share News

snakes fear సర్పాల కాలం!

ABN , Publish Date - Apr 17 , 2026 | 12:21 AM

snakes fear జిల్లాలో పాముకాటు బాధితులు పెరుగుతున్నారు. మారిన వాతావరణ పరిస్థితులతో విష సర్పాలు బయటకు వస్తున్నాయి. వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే రైతులను కాటు వేస్తున్నాయి. ప్రస్తుతం విజయనగరం మహారాజా ఆస్పత్రికి వారానికి సగటున 6 నుంచి 10 వరకూ పాముకాటు కేసులు వస్తున్నాయి. అప్పుడప్పుడు వర్షాలు.. ఇంకోవైపు అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో పాములు, తేళ్లు, జెర్రిలు బయటకు వచ్చి కాటు వేస్తున్నాయి.

snakes fear సర్పాల కాలం!

సర్పాల కాలం!

- వేసవిలో అప్రమత్తంగా ఉండాల్సిందే

- వేడికి బయటకు వస్తున్న పాములు

- జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు

రాజాం, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో పాముకాటు బాధితులు పెరుగుతున్నారు. మారిన వాతావరణ పరిస్థితులతో విష సర్పాలు బయటకు వస్తున్నాయి. వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే రైతులను కాటు వేస్తున్నాయి. ప్రస్తుతం విజయనగరం మహారాజా ఆస్పత్రికి వారానికి సగటున 6 నుంచి 10 వరకూ పాముకాటు కేసులు వస్తున్నాయి. అప్పుడప్పుడు వర్షాలు.. ఇంకోవైపు అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో పాములు, తేళ్లు, జెర్రిలు బయటకు వచ్చి కాటు వేస్తున్నాయి.

గత ఏడాది జిల్లాలో 700 మంది పాముకాట్లకు గురైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. వ్యవసాయాధారిత జిల్లా కావడం, నదులు, కాలువలు ఎక్కువగా ఉండడంతో పాముల విహారానికి అవకాశం ఎక్కువ. సాధారణంగా వర్షాకాలంలో చిత్తడి నేలలో పాముల విహారం అధికంగా ఉంటుంది. రైతులు వ్యవసాయ పనుల్లో నిగ్నమైనప్పుడు కాటు వేస్తున్నాయి. ప్రధానంగా 60 రకాల విష సర్పాలు ఉండగా జిల్లాలో తాచుపాము, కట్లపాము, రక్తపింజరి, చంద్రపొడ సంచారం అధికం. కొండ, అటవీ, మైదాన ప్రాంతాల్లో వీటి సంచారం అధికంగా ఉంటుంది.

వైద్యం అందక..మూల్యం

పాముకాటు వేసిన వెంటనే తగిన సమయంలో వైద్యసేవలందక ఎక్కువ మంది ప్రాణాలు వదులుతున్నారు. అదీగాక బాధితుల్లో 70 శాతం మంది నాటు వైద్యంపై ఆధారపడుతున్నారు. ప్రాణాలు కాపాడే విలువైన సమయాన్ని చేజేతులా జారవిడుస్తున్నారు. పాముకాటుకు విరుగుడుగా ఇచ్చే ‘పాలీవేలెంట్‌ యాంటీ వినమ్‌’ శాస్త్రీయంగా నిరూపితమైన మందు. కొన్నిరకాల సర్పాల నుంచి సేకరించిన విషంతో దీనిని తయారుచేస్తారు.

గ్రామీణ ప్రాంతాల్లో అధికం

జిల్లాలో అధిక శాతం పాముకాటు మరణాలు గ్రామీణ ప్రాంతాల్లోనే సంభవిస్తున్నాయి. అయితే స్థానికంగా ఉండే పీహెచ్‌సీల్లో యాంటీ వినమ్‌ అందుబాటులో ఉంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటిస్తోంది. కానీ చాలా పీహెచ్‌సీల్లో ఉండడం లేదన్న విమర్శ ఉంది. సీహెచ్‌సీలతో పాటు ఏరియా ఆస్పత్రిల్లో యాంటీవినమ్‌ అందుబాటులో ఉన్నప్పటికీ..అది మొదటి 5-10 డోసులకే పరిమితమవుతోంది. తరువాత బాధితులను జిల్లా కేంద్రాస్పత్రికి తరలించాల్సి వస్తోంది. చికిత్స ఆలస్యం కావడం, విషం తీవ్రత బట్టి డోసుల మోతాదు మారుతూ ఉంటుంది.

పూర్తిగా డోసులు అందక..

జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరానికి తగ్గట్టు డోసులు అందుబాటులో ఉండడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు పాముకాటు బాధితులు ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటున్నప్పటికీ పూర్తిస్థాయి డోసులు పడక దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతున్నారు. ముఖ్యంగా పక్షవాతం, మెదడులో రక్తం గడ్డకట్టడం, అంధత్వం తలెత్తడం, నాడీ వ్యవస్థ దెబ్బతినడంతో పాటు గుండె, కాలేయం పనితీరుపై ప్రభావం చూపే రుగ్మతలకు గురికావడం వంటివి జరుగుతున్నాయి. పాముకాటుకు గురైన బాధితుడికి మూడుగంటల్లోపు శరీరంలో విష తీవ్రత బట్టి యాంటీ వినమ్‌ డోసులను అందించగలిగితే ప్రాణాలు కాపాడుకోవచ్చు. ఆపై దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా అడ్డుకట్ట వేయవచ్చు. జిల్లాలో 60 పీహెచ్‌సీలతో పాటు 104 వాహనాలు 55 ద్వారా ప్రజలకు వైద్యసేవలందుతున్నాయి. వీటిలో పూర్తిస్థాయిలో యాంటీవీనమ్‌ మందును అంబాటులో ఉంచితే పాముకాటు మృతుల సంఖ్యను తగ్గించవచ్చు.

ఇవి చేయాలి

- పాముకాటు బారినపడకుండా ఉండాలంటే వాటి అవాసయోగ్యం కాకుండా ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.

- ఇంటి పరిసరాల్లో వస్తువులు, ధాన్యం రాశులు, సంచులు తదితర వాటిలో మురుగు లేకుండా చూసుకోవాలి.

- పిల్లలను పుట్టలు, గుట్టలు దగ్గర ఆటలు ఆడకుండా చూసుకోవాలి.

- రాత్రి సమయంలో టార్చ్‌లైట్లు వేసుకొని కిందకు చూస్తూ కాలకృత్యాలు తీర్చుకోవాలి.

- రైతులు తమ పశువుల శాలలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

- పొలాలకు వెళ్లినప్పడు చేతిలో కర్రతో పాటు వినికిడి శబ్ధాలు చేసే పరికరాలు తమ వద్ద ఉంచుకోవాలి.

- రాత్రి, తెల్లవారుజాము సమయంలో పొలాలకు వెళ్లే వారు విధిగా తమ వెంట టార్చ్‌లైట్లు అందుబాటులో ఉంచుకోవాలి.

- మట్టి, పెంకుటిళ్లకు ఎక్కడా రంధ్రాలు లేకుండా చూసుకోవాలి.

అప్రమత్తంగా ఉండాలి

పాముకాటు వేస్తే వెంటనే యాంటీవీనమ్‌ డోసు వేయాలి. తక్షణం ఆస్పత్రులకు తీసుకెళ్లాలి. నాటు వైద్యం అత్యంత ప్రమాదకరం. ఆలస్యం చేస్తే ప్రాణాలకే ముప్పు. అన్నింటికీ మించి బాధితుడు ధైర్యంతో ఉండాలి. పాముకాటు వేసిన వెంటనే విష ప్రసారం జరగకుండా అడ్డుకట్ట వేయాలి. తాడుతో గాయాన్ని కట్టి వేయాలి. పాముకాటు వేసిన మూడు గంటల్లో ఇంజక్షన్‌ అందిస్తే ప్రాణాపాయం ఉండదు. ప్రభుత్వాస్పత్రిలో యాంటీ వీనమ్‌ డోసులు అందుబాటులో ఉంటాయి.

- కరణం హరిబాబు, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌, రాజాం

Updated Date - Apr 17 , 2026 | 12:21 AM