మంత్రి లోకేశ్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. భోగాపురం ఈవెంట్ అద్భుతమంటూ కితాబు..
ABN , Publish Date - Aug 07 , 2026 | 03:05 PM
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. విజయనగరం చేనేత కార్మికులు రూపొందించిన ప్రత్యేక వస్త్రాలను ప్రధానికి కానుకగా ఆయన అందజేశారు.
న్యూఢిల్లీ: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. విజయనగరం చేనేత కార్మికులు రూపొందించిన ప్రత్యేక వస్త్రాలను ప్రధానికి కానుకగా ఆయన అందజేశారు. ఈ సందర్భంగా చేనేత కళాకారుల నైపుణ్యాన్ని, వారి సేవలను మోదీ అభినందించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రస్తావనకు వచ్చింది. ఆ కార్యక్రమం ఎంతో అద్భుతంగా నిర్వహించారని ప్రధాని ప్రశంసించారు.
అలాగే ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను ప్రత్యేకంగా అభినందించారు ప్రధాని. మంత్రి లోకేశ్‌కు ఆర్గనైజేషన్ స్కిల్స్ బాగున్నాయని ఆయన కితాబిచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు క్రమశిక్షణను కూడా మోదీ కొనియాడారు. సమావేశాల సమయంలో ఎంపీ కలిశెట్టి రోజూ పార్లమెంట్‌కు సైకిల్‌పై వస్తుండటాన్ని తాను గమనించానని, ప్రజాప్రతినిధిగా ఆయన క్రమశిక్షణ కలిగిన నాయకుడని అభినందించారు. ఈ భేటీలో ఎంపీ కుమార్తె కలిశెట్టి నిఖిల కూడా పాల్గొన్నారు. ప్రధాని పాలనను భారత్‌తో పాటు విదేశాల్లోని జెన్-జీ (Gen-Z) తరం గర్వంగా భావిస్తోందని ఆమె తెలిపారు.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన పట్ల ప్రజలు ఎంతో సంతృప్తిగా ఉన్నారని నిఖిల చెప్పగా.. ఆమె మాటలతో ప్రధాని మోదీ ఏకీభవించారు. వారి భేటీ సందర్భంగా జాతీయ చేనేత దినోత్సవం నేపథ్యంలో దేశ ప్రజలు, చేనేత కార్మికులకు ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
చేనేత వైభవాన్ని మళ్లీ తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం: సీఎం చంద్రబాబు
మెడికోలను వాహనంతో ఢీ కొట్టిన నిందితులపై కఠిన చర్యలు: సీఎం ఆదేశం