Share News

బడికెళ్లాలంటే.. వాగు దాటాల్సిందే!

ABN , Publish Date - Aug 12 , 2026 | 07:20 AM

అదొక మారుమూల గ్రామం.. 15 ఇళ్లు మాత్రమే ఉండే ఈ గ్రామం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలో ఒడిశా సరిహద్దుకు సమీపంలో ఉంది. ఈ ఊరిలో 1 నుంచి 10వ తరగతి వరకూ చదివే పిల్లలు 10 మంది ఉన్నారు.

బడికెళ్లాలంటే.. వాగు దాటాల్సిందే!

  • మన్యం కంఠుగూడలో విద్యార్థులకు తప్పని అవస్థలు

  • నడుం లోతు నీళ్లలో.. ప్రమాదకర స్థితిలో రాకపోకలు

  • కంఠుగూడలో విద్యార్థులకు తప్పని అవస్థలు... నడుం లోతు నీళ్లలో దిగి.. రాకపోకలు

కురుపాం: అదొక మారుమూల గ్రామం.. 15 ఇళ్లు మాత్రమే ఉండే ఈ గ్రామం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలో ఒడిశా సరిహద్దుకు సమీపంలో ఉంది. ఈ ఊరిలో 1 నుంచి 10వ తరగతి వరకూ చదివే పిల్లలు 10 మంది ఉన్నారు. వారు బడికి వెళ్లాలంటే ప్రాణాలను ఫణంగా పెట్టి గెడ్డ దాటాల్సిన దుస్థితి. నడుం లోతునీళ్లలో దిగి.. ప్రమాదకర స్థితిలో రాకపోకలు సాగించాల్సి వస్తోంది. ఉదయపురం పంచాయతీ పరిధిలోని కంఠుగూడకు 3 కిలోమీటర్ల దూరంలోని రెల్లిగూడలో ప్రాథమిక పాఠశాల ఉన్నా సరైన రోడ్డు సదుపాయం లేదు.


పైగా చిన్నారులు రోజూ 3కిలోమీటర్లు కాలినడకన వెళ్లలేని పరిస్థితి. దీంతో కిలోమీటరు దూరంలోని గుమ్మలక్ష్మీపురం మండలంలోని తాటిశీల ప్రాథమిక పాఠశాలకు వెళ్తున్నారు. ఈ రెండు గ్రామాలకు మధ్య ఉన్న మండగూడ గెడ్డ దాటి రోజూ స్కూల్‌కు వెళ్లాల్సి వస్తోంది. ప్రస్తుతం గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో తల్లిదండ్రులు పిల్లలను తీసుకుని నడుంలోతు నీళ్లలో దిగి గెడ్డ దాటిస్తున్నారు.


ప్రమాదమని తెలిసినా.. స్కూలు దగ్గరగా ఉన్న కారణంతో ప్రాణాలకు తెగిస్తున్నారు. ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఐటీడీఏ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు ఎస్‌.అప్పారావు, వీఆర్వో శారద మంగళవారం గ్రామానికి చేరుకుని విషయం తెలుసుకున్నారు. కంఠుగూడ- రెల్లిగూడ రోడ్డును బాగుచేయాలని, లేకుంటే కంఠుగూడ- తాటిశీల గ్రామాల మధ్య గెడ్డపై వంతెన నిర్మించాలని ఆ గ్రామస్థులు కోరారు.

Updated Date - Aug 12 , 2026 | 07:27 AM