Share News

ఆ 5 కోట్ల సంగతేంటి?

ABN , Publish Date - Sep 25 , 2026 | 03:42 AM

‘జగన్‌ చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నీకు అందిన ఐదు కోట్ల రూపాయలు ఎక్కడివి? దస్తగిరికి ఇచ్చిన రూ.కోటి అందులోనివేనా? లేక అది వేరేనా..? అసలు ఎవరి నుంచి తీసుకున్నావ్‌’ అని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)..

ఆ 5 కోట్ల సంగతేంటి?

  • దస్తగిరికి ఇచ్చిన రూ.కోటి ఎక్కడిది?.. ఆ డబ్బు ఎవరి నుంచి తీసుకున్నావ్‌?

  • వివేకా హత్య కేసు నిందితుడు సునీల్‌ యాదవ్‌కు ఈడీ అధికారుల ప్రశ్నలు

  • ఎర్రగంగిరెడ్డి, ఉమాశంకర్‌లకూ నోటీసులు.. 27, 28 తేదీల్లో రావాలని ఆదేశం

  • త్వరలో వైసీపీ పెద్దలను ప్రశ్నించే అవకాశం!

అమరావతి/హైదరాబాద్‌/కడప, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ‘జగన్‌ చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నీకు అందిన ఐదు కోట్ల రూపాయలు ఎక్కడివి? దస్తగిరికి ఇచ్చిన రూ.కోటి అందులోనివేనా? లేక అది వేరేనా..? అసలు ఎవరి నుంచి తీసుకున్నావ్‌’ అని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ).. వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన ఏ-2 సునీల్‌ యాదవ్‌ను ప్రశ్నించింది. తనకు సునీల్‌ యాదవ్‌ నుంచి రూ.కోటి ఆఫర్‌ వచ్చిందని, అందులో రూ.75 లక్షలు మాత్రమే తన మిత్రుడు సయ్యద్‌ మున్నాకు అందజేసి మరో 25 లక్షలు సునీల్‌ యాదవ్‌ తీసుకున్నట్లు ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి వాంగ్మూలమిచ్చాడు. దీని ఆధారంగా ఈడీ అధికారులు గురువారం సునీల్‌ యాదవ్‌ను హైదరాబాద్‌ పిలిపించి విచారించారు. వివేకా వద్దకు తాను రంగురాళ్లు, వజ్రాల విక్రయానికి సంబంధించి వెళ్లానని.. ఆ తర్వాత భారీ ఆఫర్‌ రావడంతో తప్పు చేశానని, పని అయిపోయాక తనకు ఇచ్చింది తక్కువేనని సునీల్‌ యాదవ్‌ చెప్పినట్లు తెలిసింది. సునీల్‌తో పాటు అతడి కుటుంబ సభ్యుల బ్యాంకు స్టేట్‌మెంట్లను పరిశీలించిన ఈడీ.. ఆ డబ్బు ఎవరి నుంచి అందింది.. రూటింగ్‌ ఎలా జరిగింది.. హత్యకు ముందు, ఆ తర్వాత జరిగిన బ్యాంకు లావాదేవీల గురించి గట్టిగా అడిగినట్లు సమాచారం. రూ.5 కోట్లు అందజేసిన వైసీపీ కీలక పెద్దలను త్వరలోనే ఈడీ ప్రశ్నించే అవకాశం ఉందని అంటున్నారు.


కాగా.. ఇదే కేసులో ఏ-1 ఎర్రగంగిరెడ్డి, ఏ-3 ఉమాశంకర్‌రెడ్డిలను ఈ నెల 27, 28 తేదీల్లో విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. గురువారం ఈడీ విచారణ అనంతరం సునీల్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడాడు. ఈడీకి బ్యాంకు స్టేట్‌మెంట్లు అందజేశానని చెప్పాడు. హత్య కోసం రూ.40 కోట్ల ఫండింగ్‌ విషయాలు తనకు తెలియవన్నాడు. ఈడీ అధికారులు ఎప్పుడు పిలిచినా వస్తానన్నాడు. వైసీపీ ప్రభుత్వంలో అణచివేతకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ వార్తలనూ చదవండి...

మహిళల భద్రతకు ప్రాధాన్యం

సన్నాలకు రికార్డు ధర

Updated Date - Sep 25 , 2026 | 03:42 AM