క్యూఎస్ సస్టైనబిలిటీ ర్యాంకింగ్స్‌లో.. వీఐటీకి ప్రపంచస్థాయిలో 293వ ర్యాంకు
ABN , Publish Date - Nov 18 , 2026 | 01:06 AM
వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(వీఐటీ) అంతర్జాతీయ స్థాయిలో మరో ఘనత సాధించింది.
హైదరాబాద్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(వీఐటీ) అంతర్జాతీయ స్థాయిలో మరో ఘనత సాధించింది. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ -సస్టైనబిలిటీ -2027లో ప్రపంచవ్యాప్తంగా 293వ ర్యాంకును, దేశంలో ఐదో స్థానాన్ని దక్కించుకుంది. గత ఏడాది ప్రపంచస్థాయిలో 352వ స్థానంలో ఉన్న వీఐటీ ఈసారి ఏకంగా 59 స్థానాలు మెరుగుపరుచుకుని టాప్-300 విశ్వవిద్యాలయాల జాబితాలోకి చేరింది మొత్తం 81.2 స్కోరుతో ఈ ఘనత సాధించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,000 విశ్వవిద్యాలయాల పనితీరును ఈ ర్యాంకింగ్స్‌లో అంచనా వేశారు.
పర్యావరణ పరిరక్షణ, సామాజిక ప్రభావం, పాలనాపరమైన ప్రమాణాలు అనే మూడు ప్రధాన అంశాల ఆధారంగా క్యూఎస్ సస్టైనబిలిటీ ర్యాంకింగ్స్‌ను రూపొందిస్తారు. ఈ మూడు విభాగాల్లో వీఐటీ చేపట్టిన వినూత్న కార్యక్రమాలు మెరుగైన ర్యాంకుకు దోహదపడ్డాయని వర్సిటీ చాన్సలర్ డాక్టర్ జి.విశ్వనాథన్ వెల్లడించారు. క్యాంప్‌సలో వాహనాల పార్కింగ్ ప్రాంతాలపై 441 కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు.
వీటి ద్వారా ఏటా 650 మెగావాట్ల పవర్ విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. హాస్టళ్లలో ఆహార వ్యర్థాలను పునర్వినియోగం చేసి 200 కిలోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. ఏటా సుమారు 15 టన్నుల కలప వ్యర్థాలను బయో ఎనర్జీగా మారుస్తున్నారు. స్వచ్ఛమైన ఇంధన వినియోగం, వ్యర్థాల నిర్వహణ, జీవవైవిధ్య పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ చేపడుతున్న చర్యలే అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో వీఐటీ స్థాయిని పెంచాయని వర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
అక్వాన్ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు